ఆస్తి పన్ను వసూలులో 64 పురపాలికల వెనుకంజ

రాష్ట్రంలోని 64 పురపాలక సంఘాలు ఆస్తి పన్ను వసూలులో వెనుకంజలో ఉన్నాయి. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) కన్నా తక్కువగా ఆస్తి పన్ను వసూలు చేసిన పురపాలక సంఘాలకు 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల ప్రశ్నార్థకంగా మారనుంది.

Published : 31 Mar 2023 04:07 IST

వాటికి 15వ ఆర్థిక సంఘం నిధులందేనా!

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 64 పురపాలక సంఘాలు ఆస్తి పన్ను వసూలులో వెనుకంజలో ఉన్నాయి. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) కన్నా తక్కువగా ఆస్తి పన్ను వసూలు చేసిన పురపాలక సంఘాలకు 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల ప్రశ్నార్థకంగా మారనుంది. గత 5 సంవత్సరాల రాష్ట్ర స్థూల ఉత్పత్తి సగటు 6.06 శాతంగా ఉంది. ఆస్తి పన్ను వసూలు సగటు ప్రగతి అంతకన్నా ఎక్కువగా ఉంటేనే 15వ ఆర్థిక సంఘం నుంచి నిధులు విడుదల చేస్తామని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధికారులు ఆస్తి పన్ను గణాంకాల మదింపు చేపట్టారు. రాష్ట్రంలో 141 పురపాలక సంఘాలకుగాను 77 మాత్రమే కేంద్ర మార్గదర్శకాల మేరకు ఆస్తి పన్ను వసూలు చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 64 పురపాలికలు ప్రస్తుతానికి ఆ స్థాయిని అందుకోలేని పరిస్థితి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం శుక్రవారంతో ముగియనున్న నేపథ్యంలో.. అప్పటికి మరికొన్ని పురపాలికలు అర్హత పొందుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా కేంద్ర మార్గదర్శకాలకు చేరువలో 28 పురపాలికలు ఉన్నాయి. 0.06-10 శాతం మేర మాత్రమే అవి వెనుకబడ్డాయి. వాటిల్లో కనీసం 10-15 పురపాలక సంఘాలు లక్ష్యాలను చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వెనుకంజలో ఉన్న పురపాలక సంఘాల్లో ఆస్తి పన్ను వసూళ్లు పెంచాలని రాష్ట్రస్థాయి అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందికి వర్తమానం పంపారు. గడిచిన వారం నుంచి విస్తృతస్థాయిలో కసరత్తు చేపట్టినట్లు ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’తో చెప్పారు.

రూ.782 కోట్లకు పైగా వసూలు..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ నెల 29 నాటికి రూ.782.51 కోట్ల మేర పురపాలక సంఘాలు ఆస్తి పన్ను వసూలు చేశాయి. గత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.698.25 కోట్లు మాత్రమే వసూలు చేశాయి. కాగా ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత కూడా మరో రెండు మూడు రోజుల వరకు చివరి తేదీతోనే ఆస్తి పన్ను వసూలు చేయడం ఆనవాయితీ. ఈమేరకు ఈ ఏడాది రూ.800 కోట్లకు పైగా ఆస్తి పన్ను వసూలుకు అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని