గూడు లేని పంచాయతీ

రాష్ట్రంలోని 30% గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు లేవు. ఫలితంగా ఆయా గ్రామాల్లో సర్పంచులకు, గ్రామ కార్యదర్శులకు, ఇతర ఉద్యోగులకు నీడ కరవైంది.

Published : 31 Mar 2023 04:07 IST

4,575 గ్రామాల్లో కరవైన సొంత భవనాలు
అద్దె ఇళ్లు, పాఠశాలల్లో కార్యాలయాల నిర్వహణ
ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్రంలోని 30% గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు లేవు. ఫలితంగా ఆయా గ్రామాల్లో సర్పంచులకు, గ్రామ కార్యదర్శులకు, ఇతర ఉద్యోగులకు నీడ కరవైంది. ఉపాధి హామీ పథకం కింద నిర్మాణాలకు వెసులుబాటు కల్పించినా పనులు సరిగా జరగడం లేదు. దాంతో రికార్డులన్నీ సర్పంచుల ఇళ్ల వద్దే ఉంటున్నాయి. గ్రామ పంచాయతీలు కొనుగోలు చేసిన ట్రాక్టర్లు, ట్రాలీలను ఖాళీ స్థలాల్లో నిలుపుతున్నారు. వాటికి సరైన రక్షణ ఉండటంలేదు. రాష్ట్ర ప్రభుత్వం టీఎస్‌ఫైబర్‌ ద్వారా అన్ని పంచాయతీలకు ఇంటర్‌నెట్‌ సౌకర్యం కల్పిస్తోంది. సొంత భవనాలు లేనిచోట ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ను ఖాళీగా వదిలేస్తున్నారు. రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు ఉండగా 8,194 పంచాయతీలకే భవనాలున్నాయి. మిగిలిన 4,575 పంచాయతీ కార్యాలయాలను అధిక శాతం అద్దె ఇళ్లు, పాఠశాలల్లో నిర్వహిస్తున్నారు. మరోవైపు సుమారు 1,000 గ్రామాల్లోని పంచాయతీ భవనాలు శిథిలావస్థకు చేరాయి. వాటికి మరమ్మతులు జరగకపోవడంతో గ్రామసభలను చెట్ల కింద, పాఠశాలలు, సర్పంచుల ఇళ్ల వద్ద నిర్వహిస్తున్నారు. గ్రామ పంచాయతీలకు భవన నిర్మాణాలకు దాదాపు వేయి చోట్ల స్థలాల కొరత ఉంది. వేయి నుంచి 1,200 గజాల్లో భవనాలను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.   గ్రామ కంఠాలు, శివార్లలో స్థలాలున్నా... అవి ఊరికి దూరంగా ఉన్నాయని నిర్మాణాలకు వెనుకాడుతున్నారు. గ్రామస్థుల నుంచి స్థలాలను విరాళాలుగా కోరుతున్నా ఎవరూ ముందుకు రావడం లేదు. నిధుల కొరత కారణంగా స్థలాల కొనుగోలూ సాధ్యం కావడం లేదు.

నిర్మాణాల్లోనూ జాప్యం

గతంలో ఎంపీ, ఎమ్మెల్యేల నియోజకవర్గ అభివృద్ధి నిధులతో పంచాయతీ భవనాలను నిర్మించేవారు. ఆదాయ వనరులున్న చోట గ్రామ పంచాయతీలు సొంతంగా నిర్మించుకునేవి. రాష్ట్ర ప్రభుత్వం 2020 నుంచి జాతీయ ఉపాధి హామీలో వీటి నిర్మాణాలకు అనుమతించింది. ఒక్కో భవనాన్ని రూ.20 లక్షలతో చేపట్టేందుకు ఆదేశించింది. ప్రతీయేటా వేయి చొప్పున నిర్మించాలని ప్రభుత్వం భావించినా సాధ్యం కావడంలేదు. 392 గ్రామాల్లో పనులు చేపట్టినా నత్తనడక నడుస్తున్నాయి. మరోవైపు రూ.20 లక్షల మొత్తం సరిపోవడం లేదని, చాలా గ్రామాల్లో గుత్తేదారులు ముందుకురావడం లేదు. ఉపాధి హామీ పథకంలో పంచాయతీల భవన నిర్మాణాలు సరిగా సాగకపోవడంతో ఇది పథకం పురోగతిపైనా ప్రభావం చూపుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని