షమీమ్‌ నివాసంలో గ్రూప్‌-1 మాస్టర్‌ ప్రశ్నపత్రం స్వాధీనం

ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నిందితులు, గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షలో 100కు పైగా మార్కులు సాధించిన టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులు షమీమ్‌(ఎల్బీనగర్‌), రమేశ్‌(ఉప్పల్‌), సురేశ్‌(సైదాబాద్‌)ల నివాసాల్లో సిట్‌ పోలీసులు గురువారం సోదాలు నిర్వహించారు.

Updated : 31 Mar 2023 05:20 IST

నిందితుల ఇళ్లల్లో సిట్‌ అధికారుల సోదాలు
రెండోరోజూ ముగ్గురు నిందితుల విచారణ

ఈనాడు, హైదరాబాద్‌: ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నిందితులు, గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షలో 100కు పైగా మార్కులు సాధించిన టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులు షమీమ్‌(ఎల్బీనగర్‌), రమేశ్‌(ఉప్పల్‌), సురేశ్‌(సైదాబాద్‌)ల నివాసాల్లో సిట్‌ పోలీసులు గురువారం సోదాలు నిర్వహించారు. షమీమ్‌ నివాసంలో గ్రూప్‌-1 మాస్టర్‌ ప్రశ్నపత్రాన్ని స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. మరోవైపు.. ఈ ముగ్గురిని పోలీసులు గురువారం రెండోరోజు హిమాయత్‌నగర్‌ సిట్‌ కార్యాలయంలో విచారించారు. గతేడాది అక్టోబరులో ప్రవీణ్‌కుమార్‌, రాజశేఖర్‌రెడ్డిలు ప్రశ్నపత్రాన్ని కొట్టేసేందుకు పథకం రచించిన విషయాన్ని గుర్తించామని.. వారి చేతికి గ్రూప్‌-1 ప్రశ్నపత్రం అందినట్టు తెలియగానే బెదిరించి తీసుకున్నామని విచారణలో నిందితులు చెప్పినట్లు సమాచారం. తమకు అందిన ప్రశ్నపత్రాన్ని ఇతరులెవరికీ ఇవ్వలేదని నిందితులు చెప్పినట్టు తెలుస్తోంది. ఈ అయిదుగురి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయా అన్న కోణంలోనూ పోలీసులు ప్రశ్నించారు. నిందితులు, వారి కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద లావాదేవీలను గుర్తించి.. వాటి ఆధారంగా మరికొందరిని అదుపులోకి తీసుకొని విచారించే అవకాశమున్నట్టు సమాచారం. మరోవైపు, కమిషన్‌ కార్యాలయంలో కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ శంకరలక్ష్మిని సిట్‌ అధికారులు గురువారం మరోసారి విచారించారు. యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లు నిందితులకు ఎలా తెలిశాయన్న అంశంపై ఆమెను ప్రశ్నించినట్లు సమాచారం. కాగా, ప్రవీణ్‌కుమార్‌, రాజశేఖర్‌రెడ్డిల వద్ద లభించిన 5 పెన్‌డ్రైవ్‌లలో కమిషన్‌ నిర్వహించనున్న పరీక్షల ప్రశ్నపత్రాలున్నట్టు పోలీసులు గుర్తించారు. వీరిద్దరికీ జూనియర్స్‌ లెక్చరర్స్‌ పరీక్ష ప్రశ్నపత్రం అందిందని, దీంతో పాటు టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌(టీపీబీవో) తదితర ప్రశ్నపత్రాలనూ విక్రయించారా అనే అంశంపై పోలీసులు కూపీ లాగుతున్నట్టు తెలిసింది.

మాస్టర్‌ ప్రశ్నపత్రాలు కావడంతోనే..

సాధారణ ప్రశ్నపత్రాల్లో సమాధానాలుండవు. ప్రవీణ్‌కుమార్‌, రాజశేఖర్‌రెడ్డిలు తస్కరించినవి మాస్టర్‌ ప్రశ్నపత్రాలు. వాటిలో ప్రశ్నల పక్కనే జవాబులుంటాయి. అందుకే డాక్యానాయక్‌ ఒక్కో ప్రశ్నపత్రాన్ని రూ.5-10 లక్షలకు విక్రయించి సొమ్ము చేసుకున్నట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని