ప్రాజెక్టులపై భారీగానే ఖర్చు

బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి పూర్తి స్థాయిలో రుణాలు రాకపోయినా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సాగునీటి రంగంపై రాష్ట్ర ప్రభుత్వం భారీగానే ఖర్చు చేసింది.

Published : 31 Mar 2023 04:07 IST

పూర్తిస్థాయిలో రుణాలు రాకున్నా..  ఆంక్షలు పెరిగినా.. సాగునీటిరంగంపై  వెచ్చించిన రాష్ట్ర ప్రభుత్వం
గత నాలుగేళ్లతో పోల్చితే తగ్గిన వ్యయం

ఈనాడు, హైదరాబాద్‌: బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి పూర్తి స్థాయిలో రుణాలు రాకపోయినా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సాగునీటి రంగంపై రాష్ట్ర ప్రభుత్వం భారీగానే ఖర్చు చేసింది. అయితే గత నాలుగేళ్లతో పోల్చితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేసిన ఖర్చు తగ్గింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.16,690 కోట్లు ఖర్చు చేయగా, ఇందులో రూ.9,210 కోట్లు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్నవి కాగా, మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ఖజానా నుంచి చెల్లించింది. 2016లో సాగునీటి ప్రాజెక్టుల పునరాకృతి తర్వాత నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం ఏటా రూ.20 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్ల వరకు ఖర్చుచేసింది. 2018-19లో అత్యధికంగా రూ.31,265 కోట్లు ఖర్చుచేసింది. అటు ఖజానా నుంచి, ఇటు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకొని భారీగా వ్యయం చేసింది. 

     
కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులు తెచ్చి గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడం, అనుమతుల్లేవని నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రాజెక్టులకు రుణాలు ఆపేయడం, బడ్జెటేతర రుణాలను కూడా ఎఫ్‌.ఆర్‌.బి.ఎం పరిధిలోకి తెస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేయడం.. ఇలా పలు కారణాల వల్ల తర్వాత పనుల అవసరాలకు తగ్గట్లుగా నిధులను వ్యయం చేయలేకపోయినట్లు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఖర్చులో 60 శాతానికి పైగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోనే చేశారు. రూ.16,690 కోట్లకు గాను రూ.9,650 కోట్లను ఈ ప్రాజెక్టులోనే వ్యయం చేశారు. ఇందులో కూడా రూ.7,300 కోట్లు బ్యాంకుల నుంచి తీసుకున్నవి కావడం గమనార్హం. దీని తర్వాత రూ.2,500 కోట్లను పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఖర్చు చేశారు. అయితే రుణం పూర్తిగా నిలిచిపోవడంతో ఈ మొత్తాన్ని రాష్ట్ర ఖజానా నుంచే పెట్టారు. సీతారామ ఎత్తిపోతల, సీతమ్మ బ్యారేజి పనులకు రూ.రెండువేల కోట్లు ఖర్చు చేయగా, రూ.720 కోట్లు రాష్ట్ర బడ్జెట్‌ నుంచి కేటాయించారు. మిగిలిందంతా రుణంగా తీసుకొన్నదే. దేవాదులలో రూ.500 కోట్లు రుణం ద్వారా ఖర్చు చేయగా, డిండి ఎత్తిపోతలలో రూ.440 కోట్లను రాష్ట్ర బడ్జెట్‌ నుంచి చెల్లించారు. మిగిలిన ప్రాజెక్టులలో నామమాత్రంగానే ఖర్చుచేశారు. కొన్ని ప్రాజెక్టుల అంచనాలను సవరించిన బడ్జెట్‌లో బాగా తగ్గించారు. మధ్యతరహా ప్రాజెక్టులకు రూ.223 కోట్లు కేటాయించగా కేవలం రూ.17 కోట్లు మాత్రమే ఖర్చుచేశారు. చిన్ననీటి వనరులది కూడా ఇదే పరిస్థితి. రూ.1,550 కోట్లకు గాను రూ.625 కోట్లు ఖర్చుచేశారు.


పెండింగ్‌ బిల్లులు రూ.పదివేల కోట్లపైనే

మరోవైపు ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి పెండింగ్‌ బిల్లులు కూడా భారీగా ఉన్నాయి. చేసిన పనులకు గుత్తేదారులకు చెల్లించాల్సింది రూ.6,700 కోట్లు ఉండగా, భూసేకరణ, పునరావాసం, బ్యాంకులకు మార్జిన్‌ మనీ కింద చెల్లించాల్సింది ఇలా అన్నీ కలిపి రూ.పదివేల కోట్లకు పైగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గుత్తేదారులకు చెల్లించాల్సిన మొత్తంలో రూ.4,800 కోట్లు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలలోనే ఉన్నాయి. కాళేశ్వరం, డిండి, ఎల్లంపల్లి సహా మరో పది ప్రాజెక్టుల్లో బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. బ్యాంకు రుణాలకు మార్జిన్‌ మనీ కింద రూ.2,150 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో రూ.1,770 కోట్లు కాళేశ్వరంలో కాగా మిగిలింది సీతారామ ఎత్తిపోతలలో. భూసేకరణకు రూ.1,300 కోట్లు చెల్లించాల్సి ఉంది. పునరావాసం, విద్యుత్తు ఛార్జీల బిల్లులు కూడా ఓ మేర పెండింగ్‌లో ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు