కాయకష్టం ఇంకెన్నాళ్లు

తెలంగాణలో వ్యవసాయరంగం అభివృద్ధి చెందుతున్నా.. యంత్రాల వినియోగంలో మాత్రం ఇంకా వెనుకంజలోనే ఉంది.

Published : 31 Mar 2023 04:46 IST

అంతంతమాత్రంగానే యంత్రాల వాడకం
నాలుగేళ్లుగా నిలిచిపోయిన ప్రభుత్వ రాయితీ పథకం
యంత్రాల కోసం రైతుల ఎదురుచూపులు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో వ్యవసాయరంగం అభివృద్ధి చెందుతున్నా.. యంత్రాల వినియోగంలో మాత్రం ఇంకా వెనుకంజలోనే ఉంది. రాష్ట్రంలో 29 శాతం మంది రైతులకే యంత్ర పరికరాలు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన వారికి సాగులో కాయకష్టం తప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ ఆవిర్భావ సమయంలో యంత్రాలకు రాయితీ పథకాన్ని ఆరంభించినా అది అర్ధాంతరంగా నిలిచిపోయింది. నాలుగేళ్లుగా యాంత్రీకరణకు నిధులను కేటాయించడం లేదు. దీంతో యంత్ర పరికరాల వాడకం అంతంత మాత్రంగానే ఉంది.

8 లక్షలకుపైగా దరఖాస్తులకు మోక్షమేది

రాష్ట్రంలో నీటి వనరుల వృద్ధితో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. దీనికి అనుగుణంగా వ్యవసాయ కూలీల అవసరాలు పెరిగాయి. అవసరమైన మేరకు కూలీలు అందుబాటులో లేకపోవడం, ఖర్చులు పెరగడంతో విత్తనాలు నాటే దశ నుంచి ఎరువులు, పురుగుమందుల వాడకం, కోతల వరకు సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం 2015లో వ్యవసాయ యాంత్రీకరణపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా 50 శాతం సబ్సిడీతో ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. దీని కింద రైతులకు 2,912 ట్రాక్టర్లను పంపిణీ చేసింది. మూడు లక్షల మందికి దుక్కి దున్నేందుకు కల్టివేటర్లు, రోటవేటర్లు, విత్తనాలు వేసే మల్టీ క్రాప్‌ ప్లాంటర్‌, మొక్కజొన్న నూర్పిడికి ఉపయోగించే మేజ్‌సెల్లర్‌, వరికోత మిషన్లు, పవర్‌టిల్లర్లు, రీడర్లు తదితర యంత్రాలను పంపిణీ చేసింది. ఈ పథకం కిందే రెండు లక్షల మందికి టార్పాలిన్లు ఇచ్చారు. దీంతో పాటు వెయ్యికి పైగా రైతు ఉత్పత్తి సంఘాలకు యంత్రాలు అందజేశారు. మొత్తం రూ.951 కోట్లతో దాదాపు ఆరు లక్షల మందికి లబ్ధి చేకూరింది. 2019-20 వరకు ఈ పథకం కొనసాగింది. అప్పట్లో ట్రాక్టర్లను అధికారపార్టీకి చెందిన వారికే ఇస్తున్నారనే విమర్శలు సైతం వచ్చాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌ కేటాయింపుల్లేక పథకం నిలిచిపోయింది. మరోవైపు యంత్ర పరికరాల కోసం దాదాపు ఎనిమిది లక్షలకు పైగా దరఖాస్తులు అపరిష్కృతంగా ఉన్నాయి. రాష్ట్రంలో యంత్రపరికరాల వినియోగంపై నిర్వహించిన అధ్యయనంలో సుమారు 71 శాతం మంది వాటిని వినియోగించడం లేదని తేలింది.

2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ప్రతి 5వేల మందికి ఓ రైతు సమూహం ఏర్పాటు చేశాక వాటిలో వ్యవసాయ యంత్రాలను కోరుతున్న రైతుల జాబితాలను సిద్ధం చేశారు. మూడేళ్లుగా ఈ పథకాన్ని పునరుద్ధరిస్తామని ప్రభుత్వం చెబుతున్నా నిధులు మంజూరు చేయడం లేదు. 2023-24 బడ్జెట్‌లోనూ ఈ పథకానికి నిధులు కేటాయించలేదు. పంటలు చేతికి వచ్చే సమయంలో కూలీలు లభించక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదను దాటితే నష్టం వస్తుందనే భావనలో అన్నదాతలు ప్రైవేట్‌ వ్యాపారుల వద్ద అద్దె ప్రాతిపదికన యంత్రాలు తీసుకుంటున్నారు. వాటి ఛార్జీలు భారీగా ఉండడంతో వారిపై భారం పడుతుంది. యంత్రాల ధరలు ఎక్కువగా ఉండడంతో సొంతంగా రైతులు వాటిని కొనలేక పోతు  న్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు