కమిషన్‌పైనా సిట్‌ కన్ను

ప్రశ్నపత్రాల లీకేజీ కేసు దర్యాప్తు వేడెక్కుతోంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్‌.. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ముఖ్యులపై దృష్టి సారించింది.

Published : 01 Apr 2023 05:17 IST

టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌, సభ్యుడు లింగారెడ్డికి నోటీసులు
నేడు ఇద్దరి విచారణ
ఈనాడు - హైదరాబాద్‌

ప్రశ్నపత్రాల లీకేజీ కేసు దర్యాప్తు వేడెక్కుతోంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్‌.. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ముఖ్యులపై దృష్టి సారించింది. విచారణకు హాజరు కావాలంటూ ఏకంగా టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి,  ఐఏఎస్‌ అధికారి అనితా రామచంద్రన్‌తో పాటు సభ్యుడు లింగారెడ్డికీ సిట్‌ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. శనివారం విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు.  గ్రూప్‌-1 ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించి వందకు పైగా మార్కులు సాధించిన వారిలో ఇప్పటివరకు వంద మందిని సిట్‌ అధికారులు విచారించి వారి వాంగ్మూలాలు నమోదు చేశారు. మిగిలిన 21 మందిని రెండు మూడు రోజుల్లో ప్రశ్నించనున్నారు. ఇప్పటివరకు ప్రశ్నపత్రం లీక్‌ చేసిన ప్రవీణ్‌, రాజశేఖర్‌, వాటి ద్వారా పరీక్షలు రాసిన వారు సహా మొత్తం 15 మందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

ఇంకా ఎవరెవరికి ప్రశ్నపత్రాలు అందాయి, వారి ద్వారా ఎవరికి డబ్బు అందింది? అన్న కోణంలో సిట్‌ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఎలా లీక్‌ అయిందన్న విషయంలో ఇప్పటికే స్పష్టత వచ్చింది. కాన్ఫిడెన్షియల్‌ విభాగం ఇన్‌ఛార్జి శంకరలక్ష్మి యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లను నిందితులు కొట్టేసి వాటి ద్వారానే ప్రశ్నపత్రాలు తస్కరించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దాంతో దర్యాప్తు అంతా ప్రశ్నపత్రాలు ఎవరెవరికి లీక్‌ అయ్యాయి అన్న కోణంలో ఉంటుందని భావించారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా సిట్‌ అధికారులు కమిషన్‌పైనే దృష్టి సారించడం గమనార్హం.

ప్రవీణ్‌, రమేష్‌ల ప్రమేయంపై...

కమిషన్‌లోని కాన్ఫిడెన్షియల్‌ విభాగం మొత్తం కార్యదర్శి అధీనంలో ఉంటుంది. దాంతో ప్రశ్నపత్రాల తయారీ, వాటిని భద్రపరచడం, వాటి ద్వారా పరీక్షలు నిర్వహించడం, ఇందుకోసం అనుసరించే పద్ధతుల గురించి అనితా రామచంద్రన్‌ను విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో పాటు కార్యదర్శి వద్ద పనిచేస్తున్న ప్రవీణ్‌ ప్రశ్నపత్రాలు కొల్లగొట్టినందున దానికి సంబంధించి కూడా ఆమెను ప్రశ్నించవచ్చు. ముఖ్యంగా ప్రవీణ్‌ గ్రూప్‌-1 పరీక్ష రాసేందుకు అనుమతించినప్పటికీ అతడిని విధుల నుంచి ఎందుకు తప్పించలేదన్న దానికి కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. లీకైన గ్రూప్‌-1 ప్రశ్నపత్రం రమేష్‌ అనే వ్యక్తికి కూడా అందింది. కమిషన్‌ సభ్యుడు లింగారెడ్డికి సహాయకుడిగా రమేష్‌ పనిచేస్తున్నాడు. గ్రూప్‌-1 పరీక్ష రాస్తున్నప్పటికీ రమేష్‌తో సాన్నిహిత్యం కొనసాగించడంపై సిట్‌ అధికారులు లింగారెడ్డిని ప్రశ్నించనున్నారు. విచారణలో వీరు ఇచ్చే సమాచారం ఆధారంగా కమిషన్‌లో ఇంకా ఎవర్నైనా ప్రశ్నించాలా? అన్నది నిర్ణయిస్తారు.

నిందితులకు వైద్యపరీక్షలు

పోలీసు కస్టడీలో ఉన్న నిందితులు రమేష్‌, సురేష్‌, షమీమ్‌లను శుక్రవారం హిమాయత్‌నగర్‌ సిట్‌ కార్యాలయంలో విచారించారు. గ్రూప్‌ 1 ప్రిలిమినరీ మాస్టర్‌ ప్రశ్నపత్రం ఏవిధంగా అందిందనే వివరాలు రాబట్టారు. ఉన్నత ఉద్యోగంలో స్థిరపడాలనే ఉద్దేశంతోనే తాము ప్రశ్నపత్రం లీక్‌ చేసినట్టు ముగ్గురూ అంగీకరించినట్టు సమాచారం. తమద్వారా ఎవరికీ విక్రయించలేదని వారు పోలీసుల వాంగ్మూలంలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. కస్టడీ ముగిసేంతవరకు నిందితులకు 48 గంటలకోసారి వైద్యపరీక్షలు నిర్వహించాలన్న న్యాయస్థానం ఆదేశాలతో శుక్రవారం సాయంత్రం ముగ్గురికీ కింగ్‌కోఠి ప్రభుత్వాసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. లీకైన ప్రశ్నపత్రాలతో అసిస్టెంట్‌ ఇంజినీర్‌(సివిల్‌) పరీక్షరాసిన రాజేందర్‌కుమార్‌, ప్రశాంత్‌రెడ్డి, దళారి తిరుపతయ్యల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ముగ్గురినీ కస్టడీకి కోరుతూ సిట్‌ పోలీసులు న్యాయస్థానంలో గురువారం పిటిషన్‌ దాఖలు చేశారు.


ఎనీడెస్క్‌ ద్వారా ప్రశ్నపత్రం చేరవేత

కొట్టేసిన వాటిలో గ్రూప్‌-1 ప్రశ్నపత్రాన్ని రాజశేఖర్‌రెడ్డి న్యూజిలాండ్‌లో ఉన్న తన బావ ప్రశాంత్‌కు వాట్సప్‌ ద్వారా పంపినట్టు సిట్‌ పోలీసులు తొలుత అనుమానించారు. కానీ వాస్తవానికి రాజశేఖర్‌రెడ్డి మొదట ఈ-మెయిల్‌ ద్వారా ప్రశ్నపత్రం పంపాడని, అది ఎర్రర్‌ రావటంతో కమిషన్‌ ఉద్యోగిని (నిందితురాలు) షమీమ్‌ ల్యాప్‌టాప్‌లో ‘ఎనీడెస్క్‌’ను డౌన్‌లోడ్‌ చేసి దాని ద్వారా ప్రశ్నపత్రాన్ని అతని బావకు చేరవేసినట్టు సాంకేతిక విశ్లేషణ ద్వారా పోలీసులు గుర్తించారు. శుక్రవారం ఎల్బీనగర్‌లోని షమీమ్‌ నివాసంలో జరిపిన సోదాల్లో ల్యాప్‌ట్యాప్‌, మొబైల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అలాగే ఏఈ (సివిల్‌) పరీక్ష ప్రశ్నపత్రం కూడా లీక్‌ కావడంతో దానికి దరఖాస్తు చేసిన అభ్యర్థుల వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. అందులోనూ డాక్యానాయక్‌, తిరుపతయ్యలతో సంబంధాలున్న వారి వివరాలు రాబట్టేందుకు సిట్‌ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని