11 వేల గురుకుల పోస్టులు ఆలస్యం

రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటనలు ఆలస్యమవుతున్నాయి.

Published : 01 Apr 2023 04:49 IST

ప్రభుత్వ అనుమతి పేరిట జాప్యం
ఆందోళనలో లక్షల మంది నిరుద్యోగులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటనలు ఆలస్యమవుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే గురుకులాల్లో టీజీటీ నుంచి డిగ్రీ గురుకుల ప్రిన్సిపల్‌ కేటగిరీ వరకు 11 వేల ఉద్యోగాలకు అనుమతులు మంజూరు చేసి నెలలు గడుస్తున్నా ప్రకటనల రూపం దాల్చలేదు. సంక్షేమ గురుకులాల నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు గురుకుల నియామక బోర్డు ప్రక్రియ పూర్తి చేసినప్పటికీ, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ పేరిట నిలిచిపోయాయి. ప్రస్తుతం కోడ్‌ తొలగిపోయినప్పటికీ, ప్రభుత్వం నుంచి అనుమతి పేరిట గురుకుల బోర్డు జాప్యం చేస్తోంది. దీంతో లక్షల మంది నిరుద్యోగులకు ఎదురుచూపులు తప్పడంలేదు.

9 నెలల కిందట అనుమతి ఇచ్చినా...

సంక్షేమ గురుకులాల్లో భర్తీ చేయాల్సిన పోస్టుల సంఖ్య భారీగా ఉంది. గడిచిన నాలుగేళ్లలో కొత్తగా 300 బీసీ గురుకులాలు ఏర్పాటయ్యాయి. 9 నెలల కిందటే 9,096 పోస్టులకు అనుమతి ఇచ్చినప్పటికీ రోస్టర్‌, రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు గురుకుల సిబ్బంది సర్దుబాటు కారణాలతో ఆలస్యమైంది. ప్రతిపాదనలు సిద్ధమయ్యాక 2022-23కి కొత్తగా మంజూరైన 33 బీసీ గురుకుల పాఠశాలలు, 15 బీసీ డిగ్రీ కళాశాలల్లో అదనపు పోస్టుల పేరిట నిలిచిపోయింది. వీటిలో 2,591 పోస్టులకు జనవరిలో ఆమోదం తెలిపినప్పటికీ.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ను కారణంగా చూపారు. గురుకులాల్లో 11 వేల బోధన పోస్టుల భర్తీకి బోర్డు ఏర్పాట్లు పూర్తిచేసింది. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో పకడ్బందీ చర్యలు చేపట్టింది. మార్చి నెలాఖరులోగా ప్రకటనలివ్వాలని నిర్ణయించినప్పటికీ, సాంకేతిక కారణాలతో నిలిచిపోయినట్లు తెలుస్తోంది. బీసీ గురుకులాల్లో 5786, ఎస్సీ గురుకులాల్లో 2267, ఎస్టీ గురుకులాల్లో 1514, మైనార్టీ గురుకులాల్లో 1445, సాధారణ గురుకులాల్లో 96 పోస్టులు ఉన్నాయి. బోధన పోస్టుల కోసం రాష్ట్రంలో 3 లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులు ఎదురుచూస్తున్నారని అని డీఈడీ, బీఈడీ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు