సంక్షిప్త వార్తలు(10)

నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌లోని విద్యానగర్‌ కాలనీకి చెందిన అబ్దుల్‌ ముకీబ్‌ ఇటీవల పాత ఇంటిని తొలగించి నూతన గృహ నిర్మాణం ప్రారంభించారు.

Updated : 02 Apr 2023 04:31 IST

చెట్టుపై మమకారం.. తొలగించకుండా భవన నిర్మాణం..!

నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌లోని విద్యానగర్‌ కాలనీకి చెందిన అబ్దుల్‌ ముకీబ్‌ ఇటీవల పాత ఇంటిని తొలగించి నూతన గృహ నిర్మాణం ప్రారంభించారు. ఈ క్రమంలో పాత ఇంటి ఆవరణలో ఆరేళ్ల కింద నాటిన రాయల్‌ ట్రీ ఫామ్‌ అనే అలంకరణ చెట్టు పెరిగి పెద్దది కావడంతో దాన్ని తొలగించడం ఇష్టంలేక ఆ వృక్షానికి ఇబ్బందులు లేకుండా భవన నిర్మాణ పనులు చేపట్టారు. మొదటి అంతస్తు, రెండో అంతస్తులో చెట్టు ఉన్న భాగంలో స్థలం వదిలి స్లాబు వేశారు. మూడో అంతస్తు స్లాబుకు సైతం చెట్టు పెరిగేందుకు ఆటంకం కలగకుండా స్థలం వదిలామని ముకీబ్‌ తెలిపారు. 

 న్యూస్‌టుడే, ఖానాపూర్‌ గ్రామీణం


పూర్తయిన నిర్మాణం.. పంపిణీకి గ్రహణం!

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ మండలం ప్రతాప సింగారంలో అయిదేళ్ల కిందట మూడు బ్లాక్‌లలో 164 డబుల్‌బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇళ్ల నిర్మాణం పూర్తయి రెండున్నరేళ్లవుతోంది. అయినా లబ్ధిదారులకు కేటాయించలేదు. ప్రస్తుతం ఈ నిర్మాణాల్లో తలుపులు, కిటికీలు విరిగి, పిచ్చి చెట్లు మొలిచాయి. అసాంఘిక శక్తులకు అడ్డాగా మారాయి.

 ఈనాడు, హైదరాబాద్‌


కొలువుల ఆశలు.. భారీగా హాజరు

నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్‌ ప్రభుత్వ కళాశాలలో ‘మ్యాజిక్‌ బస్‌ ఇండియా ఫౌండేషన్‌’ సహకారంతో శనివారం నిర్వహించిన మెగా ఉద్యోగ మేళాకు నిరుద్యోగులు భారీగా తరలివచ్చారు. నిజామాబాద్‌, కామారెడ్డి, ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, కరీంనగర్‌, జగిత్యాల, మెదక్‌, సిద్దిపేట జిల్లాల నుంచి 2,261 మంది హాజరయ్యారు. దీంతో కళాశాల ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. 20 మల్టీనేషనల్‌ కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఆయా సంస్థల నిబంధనలకు అనుగుణంగా 457 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారు. మరో 252 మంది రెండో రౌండ్‌కు అర్హత సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్‌ రామ్మోహన్‌రెడ్డి తెలిపారు.

 ఈనాడు, నిజామాబాద్‌

 న్యూస్‌టుడే, నిజామాబాద్‌  విద్యావిభాగం


పకడ్బందీగా రెండో విడత గొర్రెల పంపిణీ

సమీక్షలో మంత్రి తలసాని

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో రెండో విడత గొర్రెల పంపిణీ మరింత పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కలెక్టర్లను ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌ బీఆర్కే భవన్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) శాంతికుమారితో కలిసి గొర్రెల పంపిణీపై జిల్లా కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి మాట్లాడారు. మొదటి విడతలో 50 శాతం మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లు పంపిణీ చేశామని, మిగిలిన వారికి రెండో విడతలో అందజేస్తామని వివరించారు. ‘‘గొర్రెలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నాయన్న విషయాన్ని ఆన్‌లైన్‌లో పరిశీలించేందుకు జీపీఎస్‌ సౌకర్యమున్న వాహనాలనే రవాణాకు వినియోగించాలి. రాష్ట్రంలో పెరిగిన గొర్రెల సంఖ్యకు అనుగుణంగా దాణా కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లబ్ధిదారులు తమ సొంత స్థలాల్లో పశుగ్రాసం పెంచుకొనేందుకు రాయితీపై గడ్డి విత్తనాలు సరఫరా చేయాలి’’ అని మంత్రి కలెక్టర్లకు సూచించారు.


బీసీలకు రూ.2 లక్షల కోట్లు కేటాయించాలి

కేంద్ర మంత్రికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం వినతి

ఈనాడు, దిల్లీ: కేంద్ర ప్రభుత్వం బీసీల సంక్షేమానికి రూ.2 లక్షల కోట్ల బడ్జెట్‌ కేటాయించి విద్య, ఉద్యోగ, శిక్షణ, అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి రాందాస్‌ అథావలెను జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు కోరారు. శనివారం వారు దిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ కుల గణన చేపట్టాలని ఈ సందర్భంగా వారు మంత్రిని కోరారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జు కృష్ణ, నాయకులు కర్రి వేణుమాధవ్‌, భూపేష్‌ సాగర్‌, వరప్రసాద్‌, కె.రాము, యాదగిరి తదితరులు ఉన్నారు.


పదోసారి ప్రపంచ ఛాంపియన్‌గా శ్రీచైతన్య స్కూల్‌

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికా నాసా వారు నిర్వహించిన ‘ఎన్‌ఎస్‌ఎస్‌ సెటిల్‌మెంట్‌ కాంటెస్ట్‌-2023’లో శ్రీచైతన్య స్కూల్‌ వరుసగా పదో సంవత్సరం కూడా వరల్డ్‌ ఛాంపియన్‌గా నిలిచిందని ఆ స్కూల్‌ డైరెక్టరు సీమ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచంలోని 30కి పైగా దేశాలు పాల్గొన్న ఈ పోటీలో తమ పాఠశాల విద్యార్థులు భారతదేశాన్ని మొదటి స్థానంలో నిలిపారని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా 138 ప్రాజెక్టులు ఎంపికవగా వాటిలో 89 ప్రాజెక్టులు భారతదేశం నుంచే ఎంపికయ్యాయని, అందులోనూ 54 ప్రాజెక్టులు చైతన్య స్కూల్‌వేనని చెప్పారు.


స్టాంపులు, రిజిస్ట్రేషన్ల రాబడి రూ.14,285 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.14,285 కోట్ల రాబడి వచ్చింది. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరం లావాదేవీల అనంతరం ఆ శాఖ శనివారం లెక్కలను తేల్చింది. మొత్తం 19.40 లక్షల దస్తావేజుల రిజిస్ట్రేషన్ల ద్వారా ఈ ఆదాయం లభించింది. 2021-22 సంవత్సరంతో పోలిస్తే రూ.1921 కోట్ల రాబడి పెరిగింది. దస్తావేజుల సంఖ్య మాత్రం 48 వేలకు తగ్గడం గమనార్హం.  


ఎన్‌సీఎల్‌ గ్రూప్‌ సంస్థల సహ వ్యవస్థాపకుడు కలిదిండి మధు కన్నుమూత

ఈనాడు, హైదరాబాద్‌: వెన్నెల ఎడ్యుకేషనల్‌ సొసైటీ వ్యవస్థాపకుడు, ఎన్‌సీఎల్‌ గ్రూప్‌ సంస్థల సహ వ్యవస్థాపకుడు కలిదిండి మధు(67) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం హైదరాబాద్‌, వెస్ట్‌మారేడుపల్లిలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. కుటుంబ సభ్యులు తిరుమలగిరి స్వర్గవాటికలో ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 1956 జనవరి 7న జన్మించిన కలిదిండి మధు అంచెలంచెలుగా ఎదిగారు.


కోనసీమ తిరుమలలో రథోత్సవం

డాక్టరు బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా వాడపల్లిలో శనివారం నిర్వహించిన వేంకటేశ్వరస్వామి రథోత్సవానికి వేల సంఖ్యంలో భక్తులు తరలివచ్చారు. తిరు మాడవీధుల్లో రథం లాగేందుకు పోటీపడ్డారు. వీధులన్నీ భక్తజనంతో కిక్కిరిసిపోగా.. భక్తులు భవనాలపైకి ఎక్కి స్వామివారిని దర్శించుకున్నారు. 3 గంటలపాటు రథోత్సవం సాగింది. గ్రామంలో పండగ వాతావరణం కనిపించింది.

 న్యూస్‌టుడే, ఆత్రేయపురం


క్యాన్సర్‌ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలి: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: క్యాన్సర్‌ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, లేనిపక్షంలో అందుకోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌కు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎంకు లేఖ రాసినట్లు శనివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. క్యాన్సర్‌తో మరణించిన పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థికసాయం అందించాలని సీఎంను కోరినట్లు లేఖలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని