సింగరేణి బొగ్గు ఉత్పత్తిలో కొత్త రికార్డు

సింగరేణి సంస్థ చరిత్రలోనే అత్యధికంగా గత ఆర్థిక సంవత్సరం(2022-23)లో 671 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించింది.

Updated : 02 Apr 2023 04:16 IST

ఈనాడు, హైదరాబాద్‌: సింగరేణి సంస్థ చరిత్రలోనే అత్యధికంగా గత ఆర్థిక సంవత్సరం(2022-23)లో 671 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించింది. అంతకుముందు ఏడాది (2021-22)లో సాధించిన 650 టన్నుల ఉత్పత్తిపై ఇది 3 శాతం పైగా అధికం.  సంస్థ శనివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపింది. అలాగే గనుల నుంచి అత్యధికంగా 418 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల ఓవర్‌ బర్డెన్‌(మట్టి)ని తొలగించి సరికొత్త రికార్డును లిఖించింది. బొగ్గు రవాణాలో గత ఏడాది కన్నా 2 శాతం వృద్ధి ఉంది. 667 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేపట్టింది. భారీ వర్షాలు కురిసి ఉత్పత్తికి ఆటంకం కలిగినప్పటికీ కార్మికులు, అధికారుల సమన్వయంతో అత్యుత్తమ ఫలితాలు సాధించగలిగామని సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ పేర్కొన్నారు. ఇదే ఒరవడితో శనివారం ప్రారంభమైన కొత్త ఆర్థిక సంవత్సరంలో (2023-24)లో 750 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించేందుకు కృషి చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు.

థర్మల్‌ విద్యుత్‌లోనూ ...

మంచిర్యాల జిల్లా జైపూర్‌ వద్ద నెలకొల్పిన సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం 2022-23లో 9,304 మిలియన్‌ యూనిట్ల(మి.యూ.) విద్యుదుత్పత్తి చేసింది. తద్వారా అత్యుత్తమ ఉత్పత్తి శాతం (ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌)తో దేశ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలలో అగ్రస్థానంలో నిలిచింది. గనుల ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన 9 సౌర విద్యుత్కేంద్రాల్లో 2022-23లో 325 మి.యూ. విద్యుత్‌ ఉత్పత్తయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని