క్రమబద్ధీకరణ దరఖాస్తుల స్వీకరణ షురూ

ఆక్రమిత ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణకు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.

Published : 02 Apr 2023 04:14 IST

ఈ నెల 30 వరకు గడువు
సింగరేణి ప్రాంతాలకూ అవకాశం
‘మీ సేవ’లో తెరుచుకున్న పోర్టల్‌
ఈనాడు - హైదరాబాద్‌

ఆక్రమిత ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణకు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఎసైన్డ్‌, అభ్యంతరం లేని ఇతర ప్రభుత్వ స్థలాలు, అర్బన్‌ సీలింగ్‌ ల్యాండ్స్‌ను అధీనంలో పెట్టుకున్న వారికి, వివిధ సంస్థలకు నిబంధనల మేరకు వాటిపై హక్కులు బదిలీ చేయనున్నారు. 125 చదరపు గజాల లోపు స్థలాలకు పేదలకైతే ఉచితంగా, అంతకన్నా ఎక్కువ విస్తీర్ణమైతే మార్కెట్‌ ధరకు ప్రభుత్వం క్రమబద్ధీకరించనుంది. ఆక్రమణదారులు 2014 జూన్‌ 2లోపు సంబంధిత స్థలంలో నివాసం ఏర్పాటు చేసుకుని ఉండాలన్న నిబంధనను ప్రభుత్వం సవరించిన విషయం తెలిసిందే. 2020 జూన్‌ రెండో తేదీలోపు వారి అధీనంలో ఉన్నట్లు ఆధారాలు చూపాల్సి ఉంటుంది. గత నెల 17న విడుదల చేసిన కొత్త జీవో 29 ప్రకారం దరఖాస్తులు చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వం శనివారం మీ సేవా కేంద్రాల్లో జీవో 58, 59 పోర్టల్‌ను తిరిగి తెరిచింది. ఈ నెల 30లోపు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.

భారీగా దరఖాస్తులకు అవకాశం

క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఇప్పటికే రెండుసార్లు అవకాశం కల్పించినా ఆక్రమణ గడువు తేదీని మాత్రం మార్చలేదు. ఈ సారి ఆ గడువును ఆరేళ్లకు సడలించింది. ఈ క్రమంలో ఈ ఆరేళ్ల కాలంలో స్థలాలను ఆధీనంలో ఉంచుకున్నవారు, నోటరీ రిజిస్ట్రేషన్లతో కొనుగోలు చేసి ఆ స్థలాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారికి దరఖాస్తు చేసుకోవడానికి వెసులుబాటు లభించినట్లయింది. సింగరేణి గనులున్న ప్రాంతాల్లోనూ ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. గతంలో జీవో 76 కింద క్రమబద్ధీకరణ నిర్వహించినట్లుగానే తాజాగా దరఖాస్తులు స్వీకరించి మరోమారు పట్టాలు అందజేయనున్నారు. గతంలో సరైన ఆధారాలు లేక దరఖాస్తు చేసుకోలేకపోయినవారు, దరఖాస్తులు తిరస్కారానికి గురైన వారు  సైతం తాజా అవకాశాన్ని వినియోగించుకోవచ్చని రెవెన్యూ అధికారులు  చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సారి భారీగా దరఖాస్తులు వస్తాయన్న అంచనాలున్నాయి.

క్రమబద్ధీకరణ నిబంధనలు ఇవి

* 125 గజాలలోపు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని నివాసం ఏర్పరుచుకున్న దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేదలకు జీవో 58 కింద ఉచితంగా క్రమబద్ధీకరిస్తారు.

* జూన్‌ 2, 2020లోపు నివాసం ఉన్నవారికే క్రమబద్ధీకరణకు అవకాశం ఉంటుంది. అంతకు ముందు ఆ స్థలంలో నిర్మాణం చేసుకుని నివాసం ఉంటున్నట్లు ఆధారం చూపాలి. ఇంటి పన్ను, ఇంటి నంబరు రసీదులు, నల్లా పన్ను, విద్యుత్‌ బిల్లు లాంటివి ఆధారాల కింద దాఖలు చేయొచ్చు. రేషన్‌కార్డు, ఆధార్‌ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు లాంటివి దరఖాస్తుతో పాటు జతచేయాలి.

* 125 గజాల కంటే ఎక్కువ స్థలం ఆక్రమించుకున్నవారికి జీవో 59 ప్రకారం మార్కెట్‌ ధర లెక్కిస్తారు

* 126-250 గజాలవారు రిజిస్ట్రేషన్‌ ధరలో 50 శాతం చెల్లించాలి

* 251-500 గజాల లోపైతే 75 శాతం చెల్లించాలి 

* 500 గజాల పైబడి ఉంటే 100 శాతం రిజిస్ట్రేషన్‌ ధర చెల్లించాల్సి ఉంటుంది.

* వాణిజ్య అవసరాల కోసం వాడుకునే స్థలమైతే పరిమాణంతో నిమిత్తం లేకుండా రిజిస్ట్రేషన్‌ ధర చెల్లించి క్రమబద్ధీకరించుకోవాలి. ఆసుపత్రులు, విద్యాసంస్థలు లాంటి వాటిని వ్యాపార సంస్థలుగానే పరిగణిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు