ప్రవీణ్‌ను సెలవుపై పంపలేదేం?
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రం లీకేజీ కేసు దర్యాప్తు కీలకదశకు చేరుకుంది.
టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ను ప్రశ్నించిన సిట్
ఆమెతో పాటు సభ్యుడు లింగారెడ్డిపైనా ప్రశ్నల వర్షం
గ్రూప్-1 ప్రశ్నపత్రాలపై వివరాల సేకరణ
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రం లీకేజీ కేసు దర్యాప్తు కీలకదశకు చేరుకుంది. సంచలనం రేకెత్తించిన గ్రూప్-1 ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి అనితా రామచంద్రన్‌ను సిట్ అధికారులు శనివారం ఉదయం దాదాపు రెండు గంటలపాటు విచారించారు. సిట్ ఇన్‌ఛార్జి, అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ స్వయంగా ఆమెను విచారించారు. పరీక్షల నిర్వహణ వ్యవహారం అంతా కార్యదర్శి అధీనంలోనే ఉంటుంది. కాన్ఫిడెన్షియల్ విభాగం కూడా కార్యదర్శి ఆధ్వర్యంలోనే పనిచేస్తుంది. ఈ విభాగానికి ఇన్‌ఛార్జిగా ఉన్న శంకరలక్ష్మి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ కొట్టేసిన ప్రవీణ్ ప్రశ్నపత్రాలను చౌర్యం చేశాడు. అతడు కార్యదర్శికి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేయడంతో సిట్ అధికారులు అనితా రామచంద్రన్‌ను విచారణకు పిలిపించినట్లు తెలుస్తోంది. ప్రశ్నపత్రాల తయారీ నుంచి పరీక్షలు నిర్వహించేవరకు అనుసరించే విధానం గురించి సిట్ అధికారులు ఆమెను ప్రశ్నించారు. ముఖ్యంగా ప్రశ్నపత్రాలను దాచి ఉంచే కాన్ఫిడెన్షియల్ విభాగంలో భద్రతా ఏర్పాట్లపై ఎక్కువ ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ప్రవీణ్ గ్రూప్-1 పరీక్ష రాస్తున్నప్పటికీ సెలవుపై ఎందుకు పంపలేదని, ప్రిలిమ్స్‌లో అతడు 100కి పైగా మార్కులు సాధించినా ఎందుకు అనుమానించలేదని ఆరా తీసినట్లు తెలుస్తోంది. అవసరమైతే మరోమారు విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని చెప్పినట్లు సమాచారం. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు కమిషన్ సభ్యుడు లింగారెడ్డిని కూడా సిట్ అధికారులు విచారించారు. ఈయనకు సహాయకుడిగా పనిచేసిన రమేష్‌కు కూడా గ్రూప్-1 ప్రశ్నపత్రం లీక్ అయింది. ప్రవీణ్ ద్వారానే ఇది అందినట్టు పోలీసుల దర్యాప్తులో నిర్ధారించారు. దీంతో అసలు రమేష్ సహాయకుడిగా ఎప్పటి నుంచి పనిచేస్తున్నాడు.. అతడి ప్రవర్తన ఎలా ఉండేది తదితర వివరాలు లింగారెడ్డిని అడిగినట్లు తెలుస్తోంది. రమేష్ గ్రూప్-1 పరీక్ష రాసిన విషయం తనకు తెలియదని లింగారెడ్డి సిట్ అధికారులకు చెప్పినట్లు సమాచారం. విచారణలో భాగంగా లింగారెడ్డి ఎదురుగా రమేష్‌ను ఉంచారు. అతడే తన పీఏ అని లింగారెడ్డి ధ్రువీకరించినట్టు తెలిసింది.
ఒప్పంద ఉద్యోగ నియామకాలపై ఆరా
టీఎస్‌పీఎస్సీలో గ్రూప్-1, ఏఈ సివిల్, టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్ ప్రశ్నపత్రాల లీకేజీలో కీలక నిందితుడు నెట్‌వర్క్ ఇన్‌ఛార్జి రాజశేఖర్‌రెడ్డి, లీకైన ప్రశ్నపత్రంతో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష రాసిన సురేష్ ఇద్దరూ కమిషన్‌లో ఒప్పంద ఉద్యోగులే. అసలు ఒప్పంద ఉద్యోగుల నియామకం, ఎంపిక ప్రక్రియ విధివిధానాలపై కార్యదర్శి అనితా రామచంద్రన్ నుంచి సిట్ అధికారులు వివరాలు సేకరించినట్టు సమాచారం. ఎంపికలో ఛైర్మన్, కార్యదర్శి, బోర్డు సభ్యుల పాత్ర ఏ మేరకు ఉంటుంది? పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాల రూపకల్పన ఎలా జరుగుతుంది? ఎన్ని రకాల ప్రశ్నపత్రాలు తయారు చేస్తారు? ఇవి ఎవరి అధీనంలో ఉంటాయి.. వంటి అంశాలపై ప్రశ్నించి ఆమె వాంగ్మూలం నమోదు చేసినట్టు తెలుస్తోంది. పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు, సమాధానాలు, కీ తదితర అంశాలు ఛైర్మన్ అధీనంలో ఉంటాయని అనితా రామచంద్రన్ చెప్పినట్టు సమాచారం.
25 మంది అభ్యర్థులకు గ్రూప్-1 మోడల్ పరీక్ష!
పోలీసు కస్టడీలో ఉన్న ఏ10 షమీమ్, ఏ11 సురేష్, ఏ12 రమేష్‌లను శనివారం నాలుగోరోజు సుదీర్ఘంగా సిట్ అధికారులు విచారించారు. రెండు రోజుల క్రితమే ఈ ముగ్గురి ఇళ్లలో సోదాలు చేసి గ్రూప్-1 మాస్టర్ ప్రశ్నపత్రం, సెల్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్ స్వాధీనం చేసుకున్నారు. ప్రవీణ్ ద్వారానే ప్రశ్నపత్రం వచ్చినట్టు ఆ ముగ్గురూ అంగీకరించారు. ఒకేచోట పనిచేస్తున్న తాము పరిచయాల ద్వారానే ప్రశ్నపత్రాలు తీసుకున్నట్టు నిందితురాలు షమీమ్ చెప్పినట్టు సమాచారం. ప్రశ్నపత్రాలు చేతులు మారేందుకు తాము ఎవరికీ డబ్బులివ్వలేదని వెల్లడించినట్టు తెలుస్తోంది. గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో 100కి పైగా మార్కులు వచ్చిన 121 మందిలో 110 మంది అభ్యర్థులను విచారించారు. వీరిలో కొందరిని రెండోసారి పిలిచి ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. టీఎస్‌పీఎస్సీ నుంచి గ్రూప్- 1 ప్రిలిమ్స్ మోడల్ పేపర్ తెప్పించి సిట్ కార్యాలయంలో సుమారు 25 మంది అభ్యర్థులతో పరీక్ష రాయించినట్టు విశ్వసనీయ సమాచారం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Latestnews News
Ambati Rayudu: అంబటి రాయుడి విషయంలో మేనేజ్మెంట్ చాలా పెద్ద తప్పు చేసింది: అనిల్ కుంబ్లే
-
General News
Nizamabad: తెలంగాణ వర్సిటీ హాస్టళ్లకు సెలవులు.. రద్దు చేయాలని విద్యార్థుల డిమాండ్
-
Movies News
Nayanthara: ఆనాడు దర్శకుడికి కోపం తెప్పించిన నయనతార.. ‘నువ్వు రావొద్దు’ అని చెప్పేసిన డైరెక్టర్
-
Crime News
Hyderabad: టీచర్, రాజేశ్ చనిపోవాలనుకున్నారు?.. పోలీసుల చేతికి కీలక ఆధారాలు
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
TSPSC: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మరో 13 మంది డిబార్