పులుల సంరక్షణలో తెలంగాణ ప్రభుత్వం విఫలం

‘‘పులుల సంరక్షణలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైంది. భారీ బడ్జెట్‌ ప్రవేశ పెట్టామని గొప్పలు చెప్పుకొంటున్న రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో పులుల సంరక్షణ, పోషణను విస్మరించింది.

Updated : 02 Apr 2023 04:35 IST

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి

ఈనాడు, దిల్లీ: ‘‘పులుల సంరక్షణలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైంది. భారీ బడ్జెట్‌ ప్రవేశ పెట్టామని గొప్పలు చెప్పుకొంటున్న రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో పులుల సంరక్షణ, పోషణను విస్మరించింది. రాష్ట్ర వాటా కింద కేటాయించాల్సిన రూ.2.2 కోట్లు కేటాయించలేదు’’ అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఓ ప్రకటనలో విమర్శించారు. రాష్ట్రంలో పులుల సంరక్షణకు కనీసం రూ.కోటి విడుదల చేయకపోవడంతో రాష్ట్రంలోని కవ్వాల్‌, అమ్రాబాద్‌ పులుల అభయారణ్యంలో అగ్నిమాపక కార్యకలాపాలు, ఇతర కార్యక్రమాలకు సరైన ఆర్థిక సహాయం అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పులులను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ ద్వారా ‘ప్రాజెక్ట్‌ టైగర్‌’ను అమలు చేస్తోందని ఆయన తెలిపారు. ప్రాజెక్ట్‌ టైగర్‌ 18 రాష్ట్రాల్లో అమలవుతోందని, అందులో తెలంగాణలోని కవ్వాల్‌, అమ్రాబాద్‌ ఉన్నాయన్నారు. కవ్వాల్‌ పులుల అభయారణ్యం 2,015.44 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో ఉండగా, అమ్రాబాద్‌ అభయారణ్యం 2,611.39 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉందని, ఇవి కాకుండా 3,296.31 చ.కి.మీ. విస్తీర్ణంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని నాగార్జునసాగర్‌ శ్రీశైలం పులుల అభయారణ్యం ఉందన్నారు. 2014 నుంచి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని పులుల అభయారణ్యాలతో పాటు హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌, ఏటూరునాగారం, కిన్నెరసాని, పాకాల, పోచారం, మంజీర, ప్రాణహిత, శివ్వారం వన్యప్రాణుల అభయారణ్యాలకు వివిధ పథకాల కింద రూ.30 కోట్లు ఇచ్చిందని మంత్రి వెల్లడించారు. ఇవే కాకుండా కంపా కింద రూ.3,110 కోట్లు విడుదల చేసిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తన వాటా నిధులను నాలుగు విడతలుగా విడుదల చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం నుంచి వాటాను స్వీకరించిన నెల రోజుల్లోపు రాష్ట్రం తన వాటాను విడుదల చేయాల్సి ఉంటుందన్నారు. దురదృష్టవశాత్తూ రాష్ట్ర ప్రభుత్వం అలా చేయకపోవడంతో పులుల అభయారణ్యాలకు తీవ్రమైన నిధుల కొరత ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు విడుదల చేసి పులుల సంరక్షణ కార్యక్రమాలకు మద్దతుగా నిలవాలని ఆయన కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని