గొలుసుకట్టు.. ఆట కట్టించలేరా?

సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలం భక్తులాపురానికి చెందిన గోపాల్‌దాస్‌ రాము కోదాడలో గత ఏడాది ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు.

Published : 02 Apr 2023 03:32 IST

‘డైరెక్ట్‌ సెల్లింగ్‌’ ముసుగులో మోసాలు
చాపకింద నీరులా క్యూనెట్‌ తరహా దందాలు
స్వప్నలోక్‌ దుర్ఘటనతో మరోసారి తెరపైకి
- ఈనాడు, హైదరాబాద్‌

సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలం భక్తులాపురానికి చెందిన గోపాల్‌దాస్‌ రాము కోదాడలో గత ఏడాది ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. ఈ-కామర్స్‌ డైరెక్ట్‌ సెల్లింగ్‌ బిజినెస్‌లో చేరాలని అతనితోపాటు చదివిన త్రివేణి ప్రతిపాదించారు. వారానికి రూ.50-60 వేలు సంపాదించే అవకాశముందని చెప్పడంతో రాము గత ఏడాది ఆగస్టులో రూ.1.5 లక్షలు కట్టి సభ్యత్వం తీసుకున్నారు. కట్టిన సొమ్ముకు ప్రతిగా విహాన్‌ డైరెక్ట్‌ సెల్లింగ్‌ (క్యూనెట్‌ అనుబంధం) సంస్థ పేరిట డిన్నర్‌సెట్‌ పంపించారు. దాని విలువ రూ.1,17,200గా పేర్కొన్నారు. ఉద్యోగం కోసం రాము సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లోని కార్యాలయానికి వెళితే బంధువులకు, స్నేహితులకు కాల్స్‌ చేసి సంస్థలో చేర్పించే పని అప్పగించారు. కొత్తగా సభ్యుల్ని చేర్పిస్తేనే కమీషన్‌ వస్తుందని చెప్పడంతో అది గొలుసుకట్టు (మల్టీ లెవెల్‌ మార్కెటింగ్‌-ఎంఎల్‌ఎం) వ్యాపారమని రాము గ్రహించారు. తన డబ్బులు వెనక్కి ఇవ్వాలని ఆయన అడిగితే.. గంజాయి కేసులో ఇరికిస్తాం.. నిర్భయ కేసు పెడతాం అంటూ బెదిరించి బలవంతంగా సంతకం చేయించుకున్నారు. దీంతో రాము గత డిసెంబరు 31న మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందన లేకపోవడంతో ఫిబ్రవరి 1న పెన్‌పహాడ్‌ పోలీసులను ఆశ్రయించారు. తాజాగా ఈ క్యూనెట్‌ సంస్థ కార్యాలయంలోనే అగ్నిప్రమాద దుర్ఘటన జరిగి ప్రాణాలు కోల్పోయిన ఆరుగురిలో త్రివేణి ఒకరు.

‘డబ్బు కట్టి సభ్యత్వం పొందు.. మరో ఇద్దరిని చేర్పించు.. కొత్త సభ్యుల్ని చేర్పిస్తూ ఉంటే కమీషన్‌ నుంచే జీతం వస్తుంది.. లేదంటే కట్టిన డబ్బులు, వేతనం రావు..’ ఇదీ గొలుసుకట్టు మోసాల తీరు. ఈ వ్యాపారంపై దేశంలో నిషేధం ఉండటంతో మోసగాళ్లు తమది గొలుసుకట్టు వ్యాపారం కాదని, నేరుగానే ఉత్పత్తుల్ని విక్రయిస్తున్నాం (డైరెక్ట్‌ సెల్లింగ్‌) అంటూ మాయ చేస్తున్నారు. ఒకవేళ పోలీసులకు దొరికినా అసలైన బాస్‌లు తప్పించుకుంటున్నారు. మధ్యలో ఉండే ఏజెంట్లు మాత్రమే కటకటాలపాలవుతున్నారు. తమ సంస్థలో తొలుత చేరిన సభ్యులు విధిలేని పరిస్థితుల్లో మోసాలకు పాల్పడేలా చేసి వారిని ఇరికించడమే గొలుసుకట్టు సంస్థల వ్యాపార కుయుక్తి. తెలిసో తెలియకో వీటిలో చేరే సభ్యులు.. తమ డబ్బును కమీషన్‌ రూపంలో తిరిగి రాబట్టుకునేందుకు తమ బంధువులనో.. సన్నిహితులనో మాయ చేసి సభ్యులుగా చేర్పిస్తున్నారు. ఎవరైనా ఎదురు తిరిగితే కేసుల పేరిట భయపెడుతున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసు యంత్రాంగం, సీఐడీ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి.


వేలల్లో బాధితులు.. రూ.వేల కోట్లలో మోసాలు

తంలో పల్లికాయ.. మునగకాయ.. కొవ్వొత్తుల తయారీలాంటి గొలుసుకట్టు మోసాలతో పాటు ఇతర రాష్ట్రాల సంస్థల బాగోతాలూ వెలుగుచూశాయి. సైబరాబాద్‌ కమిషనర్‌గా వీసీ సజ్జనార్‌ ఉన్నప్పుడు వీటిని అరికట్టే ప్రయత్నం చేశారు. ఆయా సంస్థల దందాలను బహిర్గతం చేసి పలువురిని కటకటాల్లోకి పంపారు. సైబరాబాద్‌లో ప్రత్యేకంగా ‘ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ)’ ఏర్పాటు చేశారు. ఆయన బదిలీపై ఆర్టీసీ ఎండీగా వెళ్లాక.. కేసుల దర్యాప్తు పురోగతి మందగించిందనే విమర్శలున్నాయి. తాజాగా స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ అగ్నిప్రమాద నేపథ్యంలో రూ.వేల కోట్లతో ముడిపడిన క్యూనెట్‌ బాగోతం మరోసారి బహిర్గతమైంది. ప్రస్తుతం గ్రేటర్‌ హైదరాబాద్‌, కరీంనగర్‌, సూర్యాపేట, నర్సంపేట.. తదితర ప్రాంతాల్లో ఈ సంస్థ బాధితులు వేల సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. గోదావరిఖని, మంచిర్యాల లాంటి ప్రాంతాల్లో బిట్‌కాయిన్‌ మోసాలు.. కామారెడ్డి, నిజామాబాద్‌ తదితర ప్రాంతాల్లో నెలవారీ స్కీముల మోసాలు ప్రస్తుతం యథేచ్ఛగా జరుగుతున్నా పోలీసు యంత్రాంగం స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.


క్యూనెట్‌ దుర్మార్గపు సంస్థ

- వీసీ సజ్జనార్‌, ఆర్టీసీ ఎండీ

మాయకులను మోసం చేస్తున్న క్యూనెట్‌ దుర్మార్గపు సంస్థ. దానిపై ఎన్నో కేసులు నమోదైనా.. అక్రమాస్తుల్ని ఈడీ జప్తు చేసినా తీరు మారడంలేదు. ఆ సంస్థపై సమగ్ర విచారణ జరపాలి. ఎంఎల్‌ఎం సంస్థలు అరచేతిలో వైకుంఠం చూపిస్తూ బుట్టలో వేసుకునే ప్రయత్నాల విషయంలో యువత జాగ్రత్తగా ఉండాలి. అలాంటి సంస్థలిచ్చే అధిక అద్దెలకు ఆశపడి భవన యజమానులు మోసాలకు బాధ్యులు కావొద్దు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు