మామిడిపై మళ్లీ గాలివాన పంజా

ఈసారి మామిడి రైతులను అకాల వర్షాలు, ఈదురు గాలులు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శుక్రవారం సాయంత్రం కురిసిన గాలివానకు వేలాది ఎకరాల్లో కాయలు నేలరాలిపోవడంతో వారు కన్నీరు మున్నీరవుతున్నారు.

Updated : 02 Apr 2023 05:22 IST

చెట్లపై మిగిలింది 30% కాయలే
కన్నీరుమున్నీరవుతున్న రైతులు

ఈటీవీ- ఖమ్మం, న్యూస్‌టుడే, పెనుబల్లి: ఈసారి మామిడి రైతులను అకాల వర్షాలు, ఈదురు గాలులు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శుక్రవారం సాయంత్రం కురిసిన గాలివానకు వేలాది ఎకరాల్లో కాయలు నేలరాలిపోవడంతో వారు కన్నీరు మున్నీరవుతున్నారు. ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో 45 వేల ఎకరాల్లో మామిడి సాగవుతోంది. తోటలకు తామర పురుగుతోపాటు వివిధ తెగుళ్లు సోకడంతో పూత, కాత దశలపై తీవ్ర ప్రభావం పడింది. అయినా ధైర్యం కోల్పోకుండా మందుల పిచికారీకి రైతులు అదనంగా పెట్టుబడి పెట్టారు. తీరా పంట చేతికొచ్చే దశలో ఈదురుగాలులు, వర్షాలతో వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. ప్రస్తుతం అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నారు. ఈలోగా శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు వర్షం కురవడంతో వేల ఎకరాల్లో కాయలు రాలిపోయాయి. ప్రస్తుతం 30% కాయలే చెట్లకు ఉన్నాయి. ఆయా తోటలను శనివారం పెనుబల్లి మండలంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పరిశీలించి రైతులకు భరోసా ఇచ్చారు. సాధారణంగా ఎకరాకు 10 టన్నుల దిగుబడి రావాల్సి ఉండగా... తెగుళ్ల దెబ్బతో 4, 5 టన్నులు మాత్రమే వస్తాయని అంచనా వేశారు. ఈదురుగాలుల బీభత్సంతో రెండు టన్నులు రావడమూ గగనంగా మారిందని రైతులు వాపోతున్నారు. నెల క్రితం వరకు టన్ను మామిడి ధర రూ.45 వేల నుంచి రూ.50 వేల వరకు చేరింది. ప్రస్తుతం రూ.22 వేలకు పడిపోయిందని వారు ఆందోళన చెందుతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు