ఆయిల్‌పామ్‌ అబ్బురం

రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వడగళ్లు, ఈదురుగాలుల వల్ల దాదాపు అన్ని పంటలూ దెబ్బతిన్నప్పటికీ.. ఆయిల్‌పామ్‌కు ఎలాంటి నష్టం వాటిల్లలేదు.

Published : 02 Apr 2023 03:32 IST

వడగళ్లకూ చెక్కుచెదరని పంట
నమోదు కాని నష్టాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వడగళ్లు, ఈదురుగాలుల వల్ల దాదాపు అన్ని పంటలూ దెబ్బతిన్నప్పటికీ.. ఆయిల్‌పామ్‌కు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. రాష్ట్రంలో దాదాపు ఆరున్నర లక్షల ఎకరాల్లో ఈ పంట సాగవుతోంది. రైతు కష్టానికి అదనపు విలువను జోడించేందుకు మూడేళ్లుగా ప్రభుత్వం దీనిని పెద్దఎత్తున ఈసాగును ప్రోత్సహిస్తోంది. రాష్ట్రంలో ఈ పంట వివిధ దశల్లో ఉంది. మొదట్లో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో నాటిన మొక్కలు ఇప్పటికే ఆరడుగుల కంటే ఎత్తు పెరిగాయి. రెండేళ్ల కిందట ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో నాటిన మొక్కలు నాలుగడుగులు దాటాయి. ఉమ్మడి వరంగల్‌, కరీంనగర్‌, రంగారెడ్డి జిల్లాల్లో నాటిన మొక్కలు ప్రస్తుతం మూడడుగుల మేర పెరిగాయి. అకాల వర్షాల నేపథ్యంలో వ్యవసాయాధికారులు జిల్లాల వారీగా అధ్యయనం చేయగా ఆయిల్‌పామ్‌కు నష్టం వివరాలు నమోదు కాలేదు. ఆయిల్‌పామ్‌లో వేసిన అంతర పంటలు దెబ్బతిన్నప్పటికీ ఈ పంటకు ఏమీ కాకపోవడం గమనార్హం.


ఈ పంట అన్నింటినీ తట్టుకుంటుంది

-శ్రీనివాస్‌రావు, ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి, వరంగల్‌

ఆయిల్‌పామ్‌ చీడపీడలతో సహా అన్నిరకాల వాతావరణ పరిస్థితులను తట్టుకుంటుంది. మొక్కలు, ఆకులు బలంగా ఉంటాయి. వడగళ్ల వాన పడినా ఏమాత్రం నష్టం వాటిల్లలేదు. ఈ విషయాన్ని రైతులకు తెలియజేస్తూ.. ఆయిల్‌పామ్‌ సాగు చేపట్టాలని వారిని కోరుతున్నాం.


ఆయిల్‌పామ్‌ కాపాడింది

-రాంరెడ్డి, ఎలుకుర్తి, వరంగల్‌ జిల్లా

ఈసారి వరి, ఇతర పంటలు వేయకుండా ఆయిల్‌పామ్‌ సాగు చేస్తున్నాను. గతేడాది పదెకరాల్లో మిర్చి దెబ్బతిని నష్టపోయాను. ప్రభుత్వం ఇచ్చిన రాయితీలతో పదెకరాల్లో ఆయిల్‌పామ్‌ మొక్కలు వేశాను. వర్షాలకు నష్టం వాటిల్ల్లలేదు. నాటిన మొక్కలన్నీ భద్రంగా ఉండడం ఆనందం కలిగించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు