Google Takeout: గూగుల్‌ టేకవుట్‌ సమాచారం కచ్చితమైనదే

గూగుల్‌ టేకవుట్‌ ఇచ్చే సమాచారం అత్యంత కచ్చితత్వంతో కూడుకున్నదని, అమెజాన్‌, గూగుల్‌, ఫేస్‌బుక్‌ తదితర క్లౌడ్‌ స్టోరేజీ సంస్థల నుంచి తీసుకునే డేటాను తప్పుపట్టలేమని సైబర్‌ ఫోరెన్సిక్‌ నిపుణుడు నల్లమోతు శ్రీధర్‌ స్పష్టంచేశారు.

Updated : 21 Apr 2023 10:38 IST

న్యాయస్థానాలు సాంకేతిక ఆధారాలుగా పరిగణిస్తున్నాయి
క్లౌడ్‌ స్టోరేజీలు ఇచ్చే డేటాను తప్పుపట్టలేం
‘ఈనాడు-ఈటీవీ’తో సైబర్‌ ఫోరెన్సిక్‌ నిపుణుడు నల్లమోతు శ్రీధర్‌
ఈనాడు - హైదరాబాద్‌

గూగుల్‌ టేకవుట్‌ ఇచ్చే సమాచారం అత్యంత కచ్చితత్వంతో కూడుకున్నదని, అమెజాన్‌, గూగుల్‌, ఫేస్‌బుక్‌ తదితర క్లౌడ్‌ స్టోరేజీ సంస్థల నుంచి తీసుకునే డేటాను తప్పుపట్టలేమని సైబర్‌ ఫోరెన్సిక్‌ నిపుణుడు నల్లమోతు శ్రీధర్‌ స్పష్టంచేశారు. జిల్లా కోర్టుల నుంచి సుప్రీంకోర్టు వరకూ క్లౌడ్‌ స్టోరేజీ సంస్థలు ఇచ్చే డేటాను సాంకేతిక ఆధారాలుగా పరిగణిస్తున్నాయని తెలిపారు. దర్యాప్తు ఏజెన్సీలు గూగుల్‌ సంస్థ అధికారికంగా ఇచ్చే లేఖ, సమాచారం తాలూకు మెయిల్‌తో సహా న్యాయస్థానంలో సమర్పిస్తున్నాయని వివరించారు. మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్యోదంతం సహా వివిధ కేసుల దర్యాప్తులో గూగుల్‌ టేకవుట్‌ సమాచారం కీలకంగా మారిన నేపథ్యంలో దాన్ని దర్యాప్తు సంస్థలు వినియోగిస్తున్న తీరు, సమాచార కచ్చితత్వం సహా అనేక అంశాలను ‘ఈనాడు- ఈటీవీ’ ముఖాముఖిలో శ్రీధర్‌ వివరించారు.


దర్యాప్తు సంస్థలు సేకరించిన సమాచారం నిజమైనదని ఎలా చెప్పగలం?

గూగుల్‌ సంస్థ ఇచ్చే సమాచారం క్లౌడ్‌ స్టోరేజీ నుంచి వస్తుంది. టేకవుట్‌లో ఉండేదంతా నిత్యం రికార్డయ్యే ఒక సాంకేతిక ఆధారం. దాన్ని మార్చడానికి వీల్లేదు. సాంకేతికతపై పట్టున్న వ్యక్తులు మ్యాప్స్‌ లేదా డేటా రికార్డవకుండా చూడొచ్చు. లేదా రికార్డయిన దాన్ని చెరిపేయవచ్చు. అలా చెరిపేసినప్పటికీ పాత డేటా మొత్తం గూగుల్‌ దగ్గర ఉంటుంది. దర్యాప్తు సంస్థలు అడిగినప్పుడు చెరిపేసిన పాత డేటాను గూగుల్‌ ఇస్తుంది. ఏదేమైనా ఆ డేటా మాత్రం పూర్తిగా నిజం. అది వాస్తవమైన సమాచారమేనా అని తెలుసుకోవడానికి న్యాయస్థానం గూగుల్‌ నుంచి వచ్చిన అధీకృత లేఖలు చూపించాల్సిందిగా కోరవచ్చు.


గూగుల్‌ టేకవుట్‌ ఎంత కచ్చితత్వంతో మ్యాప్స్‌ సేకరించగలుగుతుంది?

ఆండ్రాయిడ్‌ ఫోన్‌ వినియోగించే వ్యక్తి ఒక ప్రదేశానికి వెళ్తే, అక్కడికి 50 మీటర్ల పరిధిలో తేదీ, టైమ్‌ జోన్ల ప్రకారం గూగుల్‌ మ్యాప్స్‌లో రికార్డవుతుంది. ఇది 100 శాతం కచ్చితత్వంతో పనిచేస్తుంది. ఒక ప్రదేశంలో ఉంటే, ఇంకో చోట ఉన్నట్లుగా మార్చడం సాధ్యపడదు. ఇలా రికార్డయిన డేటా మొత్తం గూగుల్‌ క్లౌడ్‌లో నిల్వ ఉంటుంది. మనం ఫోన్‌తో ఎక్కడెక్కడికి ప్రయాణించాం? ఏయే సమయంలో ఎక్కడెక్కడ ఉన్నామో? కూడా రియల్‌టైమ్‌లో నమోదవుతుంది.


గూగుల్‌ ఇచ్చే సమాచారాన్ని దర్యాప్తు సంస్థలు వినియోగిస్తున్నాయని నిందితులు తెలుసుకుని అప్రమత్తమయ్యే అవకాశముందా?

గూగుల్‌ టేకవుట్‌కు సంబంధించిన లొకేషన్‌ హిస్టరీ నిలిపేసిన, చెరిపేసిన పక్షంలో అది యూజర్ల ఖాతాలో కనపడదు. గూగుల్‌ సర్వర్లలో మాత్రం నిక్షిప్తమవుతుంది. 2017లో వాట్సప్‌ సంభాషణల డేటా ఆధారంగా మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ(ఎన్‌సీబీ) 2021లో ఓ కేసును ఛేదించింది. నేరగాళ్లు ముందు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ డేటా మళ్లీ పునరుద్ధరించి(రిట్రీవల్‌) గూగుల్‌కు సంబంధించి యూజర్లు ఏ సర్వీసును వినియోగించారో తెలుసుకోవచ్చు. యూజర్‌ ఖాతాలో ఏయే ఐపీ అడ్రస్‌ నుంచి సర్వీసు వినియోగించారు? ఎప్పుడు వినియోగించారో కూడా గుర్తించవచ్చు. కొందరు నేరగాళ్లు గూగుల్‌ కాంటాక్టులు డిలీట్‌ చేస్తారు. దర్యాప్తు సంస్థలు అలాంటి వాటి బ్యాకప్‌ డేటానూ పొందవచ్చు.


దర్యాప్తు సంస్థలు సాంకేతిక ఆధారాలను గూగుల్‌ డేటా నుంచి ఎలా తీసుకోవచ్చు?

ఒక సంఘటన చోటుచేసుకున్నప్పుడు అది జరిగిన తేదీ, సమయం, ఎలా జరిగింది? అక్కడ ఎవరెవరున్నారు? అనే అంశాల ఆధారంగా దర్యాప్తు ముందుకు సాగుతుంది. ఈ కోణంలోనే దర్యాప్తు సంస్థలు గూగుల్‌ టేకవుట్‌ ద్వారా ఆధారాలు లభిస్తాయేమోనని పరిశీలిస్తాయి. అనుమానితుల గూగుల్‌ ఖాతా యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఆధారంగా వారి కదలికలు తెలుసుకుంటాయి. ఓ కేసు దర్యాప్తులో గూగుల్‌ టేకవుట్‌ నుంచి తీసుకున్న సమాచారం ఒక చిన్న అంశం మాత్రమే. ఘటనకు కొన్ని రోజుల ముందు ఏం జరిగింది? పథకాన్ని ఎలా అమలు చేశారు? అది హత్యా? లేక ఇతర కారణం ఏదైనా ఉందా? అనే అంశాలతో పోలిస్తే టేకవుట్‌ ద్వారా తీసుకున్న సమాచారం ప్రాధాన్యమైనదేమీ కాకపోవచ్చు, లేదా ఒకింత కీలకం కావొచ్చు కూడా. ఏదేమైనా దేశంలో 10 దర్యాప్తు సంస్థలకు సాంకేతిక అంశాలపరంగా సర్వాధికారాలు ఉన్నాయి. ఆయా దర్యాప్తు సంస్థలు ఎవరైనా నేరంలో భాగస్వాములయ్యారని అనుమానించే పక్షంలో.. వారి క్లౌడ్‌ డేటా ఇవ్వాలని గూగుల్‌కు అధికారికంగా లేఖ రాసి, టేకవుట్‌ ద్వారా సమాచారం తీసుకోవచ్చు.


గూగుల్‌ టేకవుట్‌ ఏ ఉద్దేశంతో ప్రారంభించారు?

జీమెయిల్‌, డ్రైవ్‌, ఫొటోలు, మ్యాప్స్‌ ఇలా గూగుల్‌ అందించే సేవలకు సంబంధించిన బ్యాకప్‌ పొందడానికి వీలుగా టేకవుట్‌ను గూగుల్‌ సంస్థ ప్రారంభించింది. దీన్నే సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలు నేర పరిశోధనలో భాగంగా వినియోగిస్తున్నాయి. సాంకేతిక ఆధారాలు సేకరిస్తే, ఎంత జటిలమైన కేసులైనా ఛేదించవచ్చు. వాస్తవానికి సర్వర్ల నుంచి డేటా ద్వారా ఆధారాలు సేకరించే ప్రక్రియ రహస్యంగా జరుగుతుంది. దర్యాప్తు సంస్థలు ఫలానా పద్ధతిలో ఆధారాలు సేకరించామని చెబితేనే అది బయటకు తెలుస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని