Telangana Secretariat: కల సాకారం... ఇలా సాక్షాత్కారం
‘ఇది చరిత్రలో నిలిచిపోయే నిర్మాణం. ఈ భవంతిని చూసి యావద్దేశం అబ్బురపడుతుంది. కేంద్రీకృత పరిపాలన వ్యవస్థకు ఇది మార్గదర్శిగా నిలుస్తుంది.
సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే రికార్డు సమయంలో సచివాలయ నిర్మాణం
‘ఈనాడు’ ఇంటర్వ్యూలో రాష్ట్ర రహదారులు, భవనాలశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి
ఈనాడు - హైదరాబాద్
‘ఇది చరిత్రలో నిలిచిపోయే నిర్మాణం. ఈ భవంతిని చూసి యావద్దేశం అబ్బురపడుతుంది. కేంద్రీకృత పరిపాలన వ్యవస్థకు ఇది మార్గదర్శిగా నిలుస్తుంది. ఇంతటి భారీ నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేయటం రికార్డు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపును అందిపుచ్చుకోవటంతోనే ఆయన ప్రణాళికను, కలను సాకారం చేయగలిగాం. కనీసం వందేళ్లపాటు మన్నికగా ఉండేలా నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆయన సూచించారు. అంతకు మించి ఈ నిర్మాణం నిలుస్తుంది’ అని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. గురువారం ఆయన నూతన సచివాలయ ప్రాంగణంలో ‘ఈనాడు’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం
‘‘సచివాలయ మహాసౌధం నిర్మాణాన్ని కార్యరూపంలోకి తీసుకురావటంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం.కరోనా సమయంతో కలుపుకొని నిర్మాణానికి రెండున్నర సంవత్సరాలు పట్టింది. కరోనాతో మూడు నెలల పాటు పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఆ తరవాత మునుపటి స్థాయిలో పనులు చేపట్టటానికి మరో మూడు నెలలు పట్టింది. ఆ ఆరునెలలు మినహాయిస్తే రెండేళ్ల కాలంలో నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు లెక్క. దేశంలో ఒకే సమయంలో రెండు చారిత్రక నిర్మాణాలు కాస్త అటూఇటూగా పురుడు పోసుకున్నాయి. ఒకటి తెలంగాణ రాష్ట్ర సచివాలయం కాగా మరొకటి పార్లమెంటు భవనం. దేశంలో లభించే అత్యున్నత నాణ్యమైన సామగ్రి సేకరించడం పెద్ద సవాలు. అన్నింటా ఒకదానికొకటి పోటీపడే పరిస్థితుల్లో సమకూర్చుకోవాల్సి వచ్చింది. నిర్మాణంలో వాడిన ప్రతి వస్తువూ దేశీయంగా తయారైనదే. రూ.617 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణాన్ని ప్రారంభించాం. ఆ తరవాత ఫర్నిచర్ నుంచి పచ్చదనం వరకు అదనంగా చేరటంతో కొంత వ్యయం పెరిగింది.
ప్రణాళికాబద్ధంగా ముందుకుసాగాం
సచివాలయ ప్రాంగణంలో పనుల ప్రారంభ దశలోనే అవసరమైన సామగ్రిని సమకూర్చుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. సివిల్ ఇంజినీరింగ్ చదువుకుని, నిర్మాణ రంగంలో ఉన్న నాకు ముఖ్యమంత్రి సూచన తొలుత బుర్రకెక్కలేదు. ఇంత తొందరేమొచ్చిందిలే అనుకున్నా. వారం పది రోజుల తర్వాత మరోసారి ఆయన అదే అంశాన్ని ప్రస్తావించటంతో అప్రమత్తమయ్యా. అధికారులు, ఇంజినీర్లు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సుదీర్ఘ సమావేశాన్ని నిర్వహించి భవనాన్ని పూర్తి చేసేందుకు అవసరమైన వాటన్నింటిని గుర్తించి ఎన్నెన్ని కావాలో లెక్కలు వేశాం. తయారీదారులతో సమావేశాలు నిర్వహిస్తే వాటిని సమకూర్చేందుకు చెప్పిన వ్యవధి వినగానే వెన్నులో చలి మొదలైంది. ప్రధాన భవనం సుమారు 8.5 లక్షల చదరపు అడుగుల్లో ఉంది. అంతటికీ సెంట్రల్ ఏసీ ప్లాంటు పెట్టాలి. దానిని తయారు చేసేందుకు ఆరు నుంచి ఎనిమిది నెలలు పడుతుందని చెప్పారు. అమర్చేందుకు కనీసం మరో ఆరేడు నెలలు పడుతుందన్నారు. మొదటి అంతస్తు స్లాబు వేసే నాటికే అన్నింటినీ ఆర్డరు చేశాం. నిర్మాణానికి వన్నె తెచ్చేందుకు రాజస్థాన్‌లోని ధోల్పూర్ రాతిని వాడాలని సీఎం సూచించారు. ఆ రాయి కోసం ధోల్పూర్‌లోని గనులకు వెళ్లాం. అనుకూలంగా ఉండటంతో 3,500 క్యూబిక్ మీటర్ల రాయిని ఆర్డర్ చేశాం. మూడు నెలల్లో ఇస్తామన్నారు. మరొకరు మరింత ధర ఇవ్వటంతో వారు సరఫరాకు ముందుకు రాలేదు. మళ్లీ ధోల్పూర్ వెళ్లి మరో రెండు గనులు చూసి ఒప్పందం చేసుకున్నాం. ఆ రాయిని 700 లారీల్లో ఇక్కడికి తరలించాం. కంటికి కనిపించేలా ఆ రాయిని అమర్చేందుకు 12 నెలలు పట్టింది. వందల సంఖ్యలో తలుపులు, వేల సంఖ్యలో కిటికీలు సమకూర్చుకోవటంలో ఇలాంటి సవాళ్లు ఎన్నో ఎదుర్కొన్నాం. ముఖ్యమంత్రి చెప్పినట్లు ముందుగానే ఆర్డర్ చేయకుండా ఉండి ఉంటే ఇంతటి నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కనీసం నాలుగేళ్లు పట్టేది. భద్రతాపరంగా కూడా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాం. అత్యాధునిక శాస్త్ర సాంకేతికతను వినియోగించాం. సచివాలయానికి నలువైపులా రహదారులు రూపొందించాం. నాలుగు వైపులా ప్రవేశ మార్గాలను ఏర్పాటుచేశాం. మూడింటిని మాత్రమే రోజువారీగా ఉపయోగిస్తాం. మరోదానిని అత్యవసరాల కోసం వినియోగిస్తాం.
ఎప్పుడైనా... వీడియో కాన్ఫరెన్స్
ప్రభుత్వ శాఖలు ఇప్పటివరకు పని చేసిన తీరు వేరు.. ఇక నుంచి పని చేసే తీరు వేరు.. అంటే ఆశ్చర్యం కాదు. కార్పొరేట్ సంస్థలకే సాధ్యమన్నట్లుగా ఉన్న నిర్మాణాన్ని ప్రభుత్వం చేయటం అంత సులువేమీ కాదు. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న అన్ని శాఖల వారు కంప్యూటర్లను తెచ్చుకుని పని చేయటమే (ప్లగ్ అండ్ ప్లే) మిగిలింది. ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, 20 మంది మంత్రులకు ఛాంబర్లు నిర్మించాం. వారికి అందుబాటులోనే ఆయా శాఖల అధికారులు, సిబ్బంది ఉండేలా ఏర్పాట్లు చేశాం. ప్రతి శాఖకు ఒకటి చొప్పున మొత్తం 35 కాన్ఫరెన్స్ హాళ్లు, వందల సంఖ్యలో అధికారులు, సిబ్బంది ఛాంబర్లు సిద్ధం అయ్యాయి.
ప్రతి అంతస్తులో సిబ్బందికి భోజనశాల నిర్మించాం. అత్యున్నత ప్రమాణాలతో వాటిని ఏర్పాటు చేశాం. రాష్ట్ర యంత్రాంగం అంతా డిజిటలైజ్ అయింది. ఏ మంత్రయినా..ఉన్నతాధికారైనా క్షణాల్లో ఎంతటి మారుమూల ప్రాంతంలోని అధికారులతోనైనా మొదటి రోజే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు సర్వం సిద్ధం అయింది. పరిపాలన ఇంత సులువుగా నడుస్తుందా? అనిపిస్తోంది. పరిపాలన వ్యవస్థలకు సూచికగా నాలుగు సింహాల భారీ జాతీయ చిహ్నాన్ని లోహంతో తయారుచేయించి ఏర్పాటు చేశాం. నిర్మాణ సమయంలో నిత్యం మూడు వేల మంది ప్రత్యక్షంగా పని చేశారు. వందల మంది పరోక్షంగా పని చేశారు. అధికారుల నుంచి శ్రామికుల వరకు చేసిన కృషి, గడిపిన నిద్రలేని రాత్రుల ఫలితమే ఈ మహా సౌధం’’ అని మంత్రి ప్రశాంత్‌రెడ్డి వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
politics: politics: భాజపా - జేడీఎస్ పొత్తు.. ‘బెస్ట్ ఆఫ్ లక్’ అంటూ కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు
-
Tamil Nadu: స్టాలిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆర్గాన్ డోనర్స్‌కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
-
Chandramukhi2: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘చంద్రముఖి-2’.. రన్‌టైమ్ ఎంతంటే?
-
Jairam Ramesh: ‘కొత్త పార్లమెంట్ మోదీ మల్లీప్లెక్స్’.. జైరాం రమేశ్ విమర్శలకు భాజపా కౌంటర్
-
BJP: తెదేపా- జనసేన పొత్తుపై స్పందించిన పురంధేశ్వరి
-
Kuldeep Yadav: బాగా ఆడుతున్నాడని కుల్దీప్ను పాక్ జట్టుకు సెలెక్ట్ చేయలేం కదా.. ఇంజమామ్ చమత్కారం