తెలంగాణ వర్సిటీలో మళ్లీ వివాదం.. రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టిన కాసేపటికే రిలీవ్ ఆర్డర్ రద్దు

తెలంగాణ విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్‌ నియామకం విషయంలో మళ్లీ గందరగోళం నెలకొంది. ఇటీవల పాలకమండలి సమావేశంలో ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌ విద్యావర్ధినిని తప్పించి.. ఆచార్య యాదగిరిని నియమించారు.

Updated : 04 May 2023 08:49 IST

ఈనాడు, నిజామాబాద్‌: తెలంగాణ విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్‌ నియామకం విషయంలో మళ్లీ గందరగోళం నెలకొంది. ఇటీవల పాలకమండలి సమావేశంలో ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌ విద్యావర్ధినిని తప్పించి.. ఆచార్య యాదగిరిని నియమించారు. దీనిని వ్యతిరేకించిన ఉపకులపతి ఆచార్య రవీందర్‌ హైకోర్టును ఆశ్రయించడంతో నాటి పాలకమండలి తీసుకున్న నిర్ణయాలను నిలిపేస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఉపకులపతి ఉస్మానియా వర్సిటీలోని ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ విభాగం అధిపతిగా ఉన్న నిర్మలాదేవిని రిజిస్ట్రార్‌గా నియమించారు. ఏడాది పదవీకాలానికి ఆర్డరు ఇవ్వడంతో ఆమె బుధవారం మధ్యాహ్నం విధుల్లో చేరారు. అయితే కాసేపటి తర్వాత నిర్మలాదేవి రిలీవ్‌ ఉత్తర్వులను ఉస్మానియా వర్సిటీ రద్దు చేయడం చర్చనీయాంశమైంది.

20 నెలల్లో అయిదుగురు...

తెలంగాణ వర్సిటీలో గత 20 నెలల్లో అయిదుగురు రిజిస్ట్రార్లు మారారు. 2021 సెప్టెంబరు 1న ఆచార్య నసీంను తప్పిస్తూ.. ఆచార్య కనకయ్యను నియమిస్తూ ఉపకులపతి నిర్ణయం తీసుకున్నారు. రెండు నెలల తర్వాత ఆ నిర్ణయాన్ని పాలకమండలి తిరస్కరించింది. తరువాత ఆచార్య యాదగిరి 40 రోజుల పాటు పదవిలో ఉన్నారు. అనంతరం ఆచార్య శివశంకర్‌ను పాలకమండలి ఆమోదం లేకుండానే రిజిస్ట్రార్‌గా కొనసాగించారు. గతేడాది ఆగస్టులో ఆయనను తప్పించి విద్యావర్ధినిని నియమించారు. ఆమె కూడా పాలకమండలి ఆమోదం లేకుండానే 8 నెలల పాటు బాధ్యతలు నిర్వర్తించారు. గత నెల 19న జరిగిన పాలకమండలి సమావేశంలో విద్యావర్ధినిని తప్పించి మళ్లీ యాదగిరిని నియమించారు. ఈ నిర్ణయంపై ఉపకులపతి కోర్టుకు వెళ్లడం.. మధ్యంతర ఉత్తర్వుల కారణంగా పాలకమండలి నిర్ణయం ప్రస్తుతానికి చెల్లుబాటుకాలేదు. ఈ క్రమంలో  ఉస్మానియా వర్సిటీలో ఉన్న నిర్మలాదేవిని రిజిస్ట్రార్‌గా నియమించాలని ఉపకులపతి నిర్ణయించారు. ఈమేరకు వీసీ ఉస్మానియా వర్సిటీ రిజిస్ట్రార్‌కు లేఖరాశారు. దాన్ని పరిశీలించిన అక్కడి అధికారులు నిర్మలాదేవిని రిలీవ్‌ చేశారు.
ఉపకులపతి సంతకం చెల్లదంటూ..: నిర్మలాదేవి ఉస్మానియా వర్సిటీలో రిలీవ్‌ అయిన వెంటనే తెలంగాణ వర్సిటీలో రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టారు. కొంతసేపటికే ఆమె రిలీవ్‌ ఆర్డర్‌ను రద్దు చేస్తున్నట్లు ఉస్మానియా రిజిస్ట్రార్‌ ప్రకటించారు. ఆమెను నియామకంపై తెలంగాణ వర్సిటీ నుంచి వచ్చిన లేఖలో నిబంధనల ప్రకారం రిజిస్ట్రార్‌ సంతకం ఉండాల్సి ఉండగా, ఉపకులపతి సంతకం ఉందని... అందుకే రిలీవ్‌ ఆర్డర్‌ను రద్దు చేసినట్లుగా పేర్కొన్నారు. ఈ విషయమై నిర్మలాదేవి మాట్లాడుతూ.. తనను రిలీవ్‌ చేయడం వల్లే ఇక్కడికి వచ్చి చేరానన్నారు. ఏడాది వరకు రిజిస్ట్రార్‌గా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు