Computer Science - EAMCET: కంప్యూటర్‌ సైన్స్‌ కోసం ఎంసెట్‌లో పోటీ

విద్యార్థుల్లో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ అంటే ఎంత మక్కువ ఉందో బాసరలోని రాజీవ్‌ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం(ఆర్‌జీయూకేటీ)లో పరిస్థితిని చూస్తే ఇట్టే అర్థమవుతుంది.

Updated : 06 May 2023 09:53 IST

71 శాతం బాసర ఆర్‌జీయూకేటీ  విద్యార్థుల దరఖాస్తు
ఆ బ్రాంచీ చదివితే  ఉద్యోగావకాశాలు ఎక్కువగా  ఉంటాయనే భావన
పీయూసీ పూర్తయిన వెంటనే  వర్సిటీ నుంచి వెనక్కి

ఈనాడు, హైదరాబాద్‌: విద్యార్థుల్లో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ అంటే ఎంత మక్కువ ఉందో బాసరలోని రాజీవ్‌ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం(ఆర్‌జీయూకేటీ)లో పరిస్థితిని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ప్రతిష్ఠాత్మక వర్సిటీలో ప్రవేశం పొందినవారు సైతం రెండేళ్ల ఇంటర్‌ పూర్తయిన తర్వాత బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ బ్రాంచీలో అవకాశం లభిస్తుందో లేదోనని ఎంసెట్‌ రాసేందుకు పోటీపడుతుండటం విశేషం. ఏ పది మందో.. ఇరవై మందో కాదు.. ఏకంగా 1,061 మంది ఈ నెల 10వ తేదీ నుంచి జరిగే ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. వీరిలో 35 మంది ఎంసెట్‌ అగ్రికల్చర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. బాసర ఆర్‌జీయూకేటీలో ఏటా 1,500 మంది ప్రవేశాలు పొందుతారు. వారిలో 1,061 మంది అంటే దాదాపు 71 శాతం మంది ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకోవడం విశేషం.

బాసరలో 350 సీట్లే..

పదో తరగతిలో టాపర్లుగా నిలిచిన 40 వేల మంది పోటీపడితే 1,500 మందికే బాసర ఆర్‌జీయూకేటీలోని ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌లో ప్రవేశాలు లభిస్తాయి. అందులో తొలి రెండేళ్లను పీయూసీగా పిలుస్తారు. ఇది ఇంటర్‌తో సమానం. ఆ తర్వాత నాలుగేళ్లు బీటెక్‌. ఇంటర్‌లో 6 సీజీపీఏ తెచ్చుకుంటేనే బీటెక్‌లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే రెండేళ్ల పీయూసీ ధ్రువపత్రం తీసుకొని వెళ్లిపోవాల్సిందే. మిగిలిన వారికి పీయూసీలో మెరిట్‌, రిజర్వేషన్‌ ఆధారంగా కౌన్సెలింగ్‌ నిర్వహించి.. బీటెక్‌లోని ఏడు ఇంజినీరింగ్‌ బ్రాంచీల్లోని 1,500 సీట్లను భర్తీ చేస్తారు. కంప్యూటర్‌ సైన్స్‌లో 350 సీట్లే ఉన్నాయి. అంటే అందరికీ అవి దక్కవు. కంప్యూటర్‌ సైన్స్‌ చదివితేనే ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్కువ మంది ఎంసెట్‌ వైపు మొగ్గు చూపుతున్నారు.

ఎంసెట్‌లో 45 వేల సీట్లు..

ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌లో చేరవచ్చన్నది విద్యార్థుల ఆలోచన. కన్వీనర్‌ కోటాలో 75 వేల వరకు సీట్లుండగా.. వాటిలో 45 వేల వరకు కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ సంబంధిత సీట్లే ఉండటంతో మంచి కళాశాలలో సీటు దక్కించుకోవచ్చని వారు భావిస్తున్నారు. ‘నాకు కంప్యూటర్‌ సైన్స్‌ అంటే ఇష్టం. అమ్మానాన్నలు కూడా అదే చదవాలని చెబుతున్నారు. అందుకే ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించి ఉత్తమ కళాశాలల్లో చేరవచ్చని దరఖాస్తు చేశాను’ అని కరీంనగర్‌కు చెందిన ఓ విద్యార్థి తెలిపారు. తన స్నేహితుల్లో ఎక్కువ మంది ఇదే భావనతో ఉన్నారని చెప్పారు. ‘మా విద్యార్థుల్లో ఏటా కొందరు ఎంసెట్‌ రాస్తున్నారు. ఎక్కడ తమ భవిష్యత్తు బాగుంటుందని అనుకుంటే అక్కడికి వెళ్తారు’ అని ఆర్‌జీయూకేటీ సంచాలకుడు సతీశ్‌కుమార్‌ వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని