Palamuru-Rangareddy: పాలమూరు పరుగు.. జూన్‌ ఆఖరుకు వట్టెం జలాశయానికి నీళ్లు

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి నీటిపారుదల శాఖ కసరత్తు ప్రారంభించింది.

Updated : 12 May 2023 07:45 IST

ఉదండాపూర్‌కు సెప్టెంబరు  నాటికి తీసుకెళ్లాలన్నది లక్ష్యం  
4 పంపుహౌస్‌లలో కొనసాగుతున్న  విద్యుదీకరణ పనులు

ఈనాడు, హైదరాబాద్‌: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి నీటిపారుదల శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా భూ సేకరణ, ఎలక్ట్రిఫికేషన్‌ లాంటి కీలకమైన పనులపై దృష్టిసారించింది. వచ్చే జూన్‌ వరకు వట్టెం జలాశయానికి, జులైలో కర్వెన జలాశయానికి నీటిని చేర్చాలన్నది ప్రధాన లక్ష్యం. సెప్టెంబరు నాటికి ఉదండాపూర్‌ జలాశయానికి నీళ్లు చేరాలని తుది లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు తాగునీటి పనులు త్వరగా పూర్తి చేయాలని ఇటీవల సీఎం కేసీఆర్‌ లక్ష్యాన్ని నిర్దేశించారు. ఉదండాపూర్‌ నుంచి రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలకు నీటిని ఇచ్చేందుకు కాలువల పనుల నిధుల విడుదల దస్త్రంపైనా ఆయన సంతకం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పనులపై ఇంజినీర్లు వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. అవరోధాలు అధిగమించడంపై దృష్టి సారించారు. ప్రస్తుతం నాలుగు పంపుహౌస్‌లలో హైటెన్షన్‌ విద్యుత్‌ సరఫరాకు సంబంధించి ట్రాన్స్‌ఫార్మర్లు, ప్యానెల్‌ బోర్డుల పనులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్యాకేజీల కింద భూ సేకరణ నిలిచిపోయి ఉంది. ఉదండాపూర్‌ జలాశయం కింద ముంపు గ్రామాల తరలింపు, పరిహారం చెల్లింపులు వంటివి చేపట్టాల్సి ఉంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని 12.22 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలంలోని నార్లాపూర్‌ వద్ద శ్రీశైలం వెనుక జలాలను తీసుకుంటారు. 90 టీఎంసీలను వివిధ దశల్లో ఎత్తిపోసి తరలించేందుకు మొత్తం 18 ప్యాకేజీలవారీగా పనులను విభజించి నిర్మిస్తున్నారు.


ప్యాకేజీల వారీగా   పనుల పురోగతి ఇదీ..

ప్యాకేజీ 1, 2

మొదటి పంపుహౌస్‌లో తొమ్మిది పంపులు ఏర్పాటుచేయాల్సి ఉండగా ఇప్పటికే రెండు పూర్తికావొచ్చాయి. ఎలక్ట్రిఫికేషన్‌ పనులు కొనసాగుతున్నాయి. ఇక్కడి నుంచి నీటిని నార్లాపూర్‌ జలాశయంలోకి ఎత్తిపోస్తారు. ఈ రిజర్వాయర్‌ నిల్వ సామర్థ్యం 6.40 టీఎంసీలు. జూన్‌ చివరి నాటికి 30 శాతం నీటిని నిల్వ చేసేందుకు పనులు వేగవంతం చేస్తున్నారు. ఇరవై ఎకరాల వరకు భూ సేకరణ పూర్తి చేయాల్సి ఉండగా 90 శాతానికిపైగా పనులు పూర్తికావొచ్చాయి.  

ప్యాకేజీ 3, 4

నార్లాపూర్‌ జలాశయం, ఏదుల జలాశయానికి మధ్య ప్రధాన కాలువ, రెండు సొరంగాల పనులు చేపట్టాల్సి ఉండగా ఒక సొరంగం నిర్మిస్తున్నారు. మరో పది ఎకరాల వరకు భూ సేకరణ చేయాల్సి ఉంది.

ప్యాకేజీ 5, 6

ఏదుల పంపుహౌస్‌ పనులు 80 శాతం వరకు పూర్తయ్యాయి. ఇక్కడ తొమ్మిది పంపులు ఏర్పాటు చేయాల్సి ఉండగా ప్రస్తుతం రెండింటి పనులు చేపడుతున్నారు. 6.55 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న జలాశయం పనులు కొలిక్కివచ్చాయి. ఇంకా 11 ఎకరాల భూ సేకరణ పెండింగ్‌లో ఉంది.

ప్యాకేజీ 7, 8

ఏదుల జలాశయం నుంచి నిర్మిస్తున్న రెండు సొరంగాలలో ఒకటి జూన్‌ చివరికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వట్టెం లిఫ్టులో 10 పంపులు బిగించాల్సి ఉండగా రెండు సిద్ధం చేస్తున్నారు. పనులు కొనసాగుతున్నాయి. 30 ఎకరాల వరకు భూ సేకరణ పెండింగ్‌లో ఉంది.

ప్యాకేజీ 9, 10, 11

1.33 లక్షల కొత్త ఎకరాల ఆయకట్టుకు సాగునీటితోపాటు దిగువకు నీటిని అందించేందుకు 16.74 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న వట్టెం జలాశయం పనులు కూడా కొలిక్కివచ్చాయి. జూన్‌ ఆఖరుకు పూర్తి చేయాలనేది లక్ష్యం.

ప్యాకేజీ 12

వట్టెం జలాశయం నుంచి కర్వెన జలాశయానికి వెళ్లే 12 కిలోమీటర్ల కాలువ నిర్మాణం జరుగుతోంది. వంద మీటర్ల మేర నిర్మాణానికి భూ సేకరణ పూర్తి చేయాల్సి ఉంది. పరిహారం చెల్లింపునకు సంబంధించి కోర్టు కేసులు ఉన్నాయి. మట్టి పనులు పెండింగ్‌ ఉన్నాయి. జులై నాటికి నీటిని ఇచ్చేలా పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ప్యాకేజీ 13, 14, 15

19 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మిస్తున్న కర్వెన జలాశయం పనులు 80 శాతం మేర పూర్తయ్యాయి. ఈ జలాశయం కింద 1.51 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఉంది. సెప్టెంబరు నాటికి పనులు పూర్తి చేసి నాలుగు టీఎంసీలు నిల్వ చేయాలన్న లక్ష్యంతో పనులు చేస్తున్నారు. సిమెంటు కాంక్రీటు పనులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి.

ప్యాకేజీ 16, 17, 18

కర్వెన జలాశయం నుంచి ఉదండాపూర్‌నకు నీటిని తరలించేందుకు ఎనిమిది కిలోమీటర్ల పొడవున రెండు సొరంగాలు నిర్మిస్తున్నారు. అయిదు పంపుల పంపుహౌసులో రెండు ఏర్పాటు చేసేందుకు పనులు జరుగుతున్నాయి. 16.3 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఉదండాపూర్‌ జలాశయానికి సంబంధించి సామాజిక ఆర్థిక సర్వే పూర్తి చేశారు. 1948 ముంపు బాధిత కుటుంబాలకు పునరావాసం, గ్రామాల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. సెప్టెంబరు నాటికి పనులు పూర్తి చేసి జలాశయంలో నీటిని నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఉదండాపూర్‌ జలాశయం నుంచి వికారాబాద్‌ జిల్లా చేవెళ్ల వరకు ఒక కాలువ తవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం రూ.5,680 కోట్లకు ఇటీవల ఆమోదం తెలిపింది. కొత్తగా 9.38 లక్షల ఎకరాల ఆయకట్టును ఈ కాలువ కింద తీసుకురానున్నట్లు తెలిసింది. త్వరలోనే టెండర్లు పిలవనున్నట్లు సమాచారం. కర్వెన, వట్టెం జలాశయాల నుంచి కూడా రెండు కాలువలు తవ్వేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని