Donkey Milk: ఖరము పాలు.. కురిపించు సిరులు

రెస్టారెంట్‌, హోటల్‌, లేడీస్‌ కార్నర్‌, రెడీమేడ్‌ దుస్తుల దుకాణం ఇలా ఏ వ్యాపారం చేసినా.. కలిసి రాని ఓ వ్యక్తి వినూత్న రంగాన్ని ఎంచుకున్నారు. గాడిదల ఫాం ఏర్పాటుచేశారు.

Updated : 15 May 2023 07:44 IST

గాడిద పాల ఎగుమతితో ఆదాయం
నాగర్‌కర్నూల్‌లో వినూత్న ప్రయత్నం 

రెస్టారెంట్‌, హోటల్‌, లేడీస్‌ కార్నర్‌, రెడీమేడ్‌ దుస్తుల దుకాణం ఇలా ఏ వ్యాపారం చేసినా.. కలిసి రాని ఓ వ్యక్తి వినూత్న రంగాన్ని ఎంచుకున్నారు. గాడిదల ఫాం ఏర్పాటుచేశారు. వాటి పాలను ఎగుమతి చేస్తూ రూ. లక్షల ఆదాయం కళ్లజూస్తున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం వెల్గొండ గ్రామానికి చెందిన పుల్లిగండ నాగేశ్‌ ప్రయత్నమిది... తన పెద్ద కుమారుడు అఖిల్‌కు వచ్చిన ఆలోచనతో గాడిదల పెంపకం చేపట్టానని నాగేశ్‌ చెబుతున్నారు. గాడిదల పాలకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్‌ ఉందని అఖిల్‌ అంతర్జాలం ద్వారా తెలుసుకున్నారు. యూరప్‌ దేశాల్లో కాస్మొటిక్స్‌, ఫార్మా రంగంలో ఉపయోగిస్తున్నట్లుగా తెలుసుకొని గాడిదల పెంపకం, ధర, మార్కెటింగ్‌పై తమిళనాడు, గుజరాత్‌, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో పర్యటించి వివరాలు సేకరించారు. కొద్ది రోజులు తమిళనాడులో శిక్షణ కూడా పొందారు. తర్వాత తండ్రి నాగేశ్‌తో కలిసి ఫాం ఏర్పాటుచేశారు.  అందులోనే ప్రస్తుతం 110 గాడిదలను పెంచుతున్నారు.


పెట్టుబడి, ఆదాయం ఇలా..

గాడిదల ఫాం ఏర్పాటు కోసం బిజినేపల్లి శివారులో 16 ఎకరాలను ఏడాదికి ఎకరానికి రూ.10 వేల చొప్పున లీజుకు తీసుకున్నారు. ఇందులో ఆరెకరాలను రూ.1.20 కోట్లు ఖర్చుచేసి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారు. చుట్టూ కంచె, షెడ్లు, సిబ్బంది ఉండేందుకు నివాసాలు ఏర్పాటుచేశారు. గాడిదలు తిరగడానికి రెండు ఎకరాలు కేటాయించారు. మిగిలిన భూమిలో జొన్న రకం గడ్డి, మొర్రగడ్డ తీగ పెంచుతున్నారు. వీటితో పాటు గోధుమ, మొక్కజొన్న దాణా, వేరుశెనగ పొట్టు, ఎండు గడ్డిని ఆహారంగా ఇస్తున్నారు. ఒక్కో గాడిదకు రోజూ 25 కిలోల ఆహారం అందిస్తున్నారు. ప్రస్తుతం 60 గాడిదల నుంచి పాలను సేకరిస్తున్నారు. వాటిని ఫ్రిజ్‌లో నిల్వ ఉంచుతారు. రెండు నెలలైనా అవి చెడి పోకుండా ఉంటాయి. ఈ పాలను నెలకోసారి తమిళనాడుకు చెందిన కంపెనీ వారు వచ్చి తీసుకెళతారు. మార్కెట్‌లో ప్రస్తుతం లీటరు ధర రూ.2,500 నుంచి రూ.5వేలు పలుకుతోంది. నెలకు 400 లీటర్ల నుంచి 550 లీటర్ల వరకు సేకరిస్తున్నారు. తద్వారా ప్రతి నెలా రూ.10 లక్షల వరకు ఆదాయం వస్తోంది. ఫాం వద్దనే నిత్యం 8 మంది పనిచేయాల్సి ఉంటుంది. వారికి వేతనాలు, దాణా, మందులు, పర్యవేక్షణకు ప్రతి నెలా రూ.3 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. ఖర్చులు పోను రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు మిగులుతోందని నాగేశ్‌ చెబుతున్నారు. గాడిద పాల అమ్మకానికి కంపెనీలతో ఒప్పందం చేసుకున్న తర్వాతనే ఫాం ప్రారంభించాలని నాగేశ్‌ సూచిస్తున్నారు. 


నాలుగు రకాల జాతుల పెంపకం

వివిధ రాష్ట్రాల్లో పరిశీలించిన నాగేశ్‌, అఖిల్‌ నాలుగు రకాల జాతుల గాడిదలను ఎంపిక చేశారు. హలారీ, కతియావడి, పోయూట్‌, దేశవాళి రకాలను ఫాం తీసుకొచ్చారు. రూ.50 వేల నుంచి రూ.70 వేలకు ఒక్కో గాడిదను కొనుగోలు చేశారు. హలారీ రకం రోజుకు అర లీటరు, కతియావడి రకం 750 మిల్లీలీటర్ల నుంచి లీటరు, పోయూట్‌ రకం లీటర్‌ నుంచి రెండు లీటర్ల వరకు పాలనిస్తాయి. దేశవాళీ గాడిద 250 మీ.లీటర్ల పాలు మాత్రమే ఇస్తుంది. అన్ని రకాలు కలిపి నెలకు 500 లీటర్ల వరకు పాలను సేకరించి నిల్వ చేస్తున్నారు. రోజూ ఒక్క పూట మాత్రమే పాలను పితుకుతారు. ఫాం చూసేందుకు వచ్చే వారి తాకిడి దృష్ట్యా రూ.వెయ్యి ప్రవేశ రుసుం వసూలు చేస్తున్నామని నాగేశ్‌ పేర్కొన్నారు. 

 న్యూస్‌టుడే, నాగర్‌కర్నూల్‌, బిజినేపల్లి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని