Diabetes: గ్లూకోజ్‌ను నియంత్రించే యాంటీబాడీలు.. మధుమేహ బాధితులకు సాంత్వన

మధుమేహ బాధితులకు సాంత్వన కలిగించే ఓ సరికొత్త పరిశోధనను హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం, రియాజీన్‌ ఇన్నోవేషన్‌ ప్రైవేటు సంస్థ సంయుక్తంగా ఆవిష్కరించాయి.

Updated : 18 May 2023 10:14 IST

హెచ్‌సీయూ - రియాజీన్‌ ఇన్నోవేషన్‌ పరిశోధన
ఈనాడు - హైదరాబాద్‌

మధుమేహ బాధితులకు సాంత్వన కలిగించే ఓ సరికొత్త పరిశోధనను హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం, రియాజీన్‌ ఇన్నోవేషన్‌ ప్రైవేటు సంస్థ సంయుక్తంగా ఆవిష్కరించాయి. మనం తీసుకునే ఆహారం ద్వారా రక్తంలోకి చేరే గ్లూకోజ్‌ను కనిష్ఠ స్థాయికి తగ్గించేందుకు హెచ్‌సీయూలోని ఆస్పైర్‌ - బయోనెస్ట్‌, రియాజీన్‌ ఇన్నోవేషన్‌ అంకుర సంస్థ కలిసి ఏడాదిన్నరగా పరిశోధన చేశాయి. చిన్న పేగు ద్వారా గ్లూకోజ్‌ను రక్తంలోకి వెళ్లకుండా నిరోధించడంతో చక్కెర స్థాయి తగ్గుతుందని శాస్త్రవేత్తలు డాక్టర్‌ ఉదయ్‌ సక్సేనా, క్రాంతి మెహర్‌, వారి సహాయకులు అర్పితారెడ్డి, శరణ్య, గోపి కడియాల రుజువు చేశారు. వీరి పరిశోధన పత్రాలను ప్రముఖ అంతర్జాతీయ జర్నల్‌ బయో ఆర్కైవ్‌ తాజాగా ప్రచురించింది.

కోళ్లపై ప్రయోగాలతో యాంటీబాడీల వృద్ధి

వేగంగా ఉత్పత్తయ్యే గ్లూకోజ్‌ను తగ్గించేందుకు వందల సంఖ్యలో పరిశోధనలు చేశారు. కోడిగుడ్డు ద్వారా ఒక యాంటీబాడీని అభివృద్ధి చేసి.. రక్తంలో గ్లూకోజ్‌ శాతాన్ని తగ్గించవచ్చని రుజువు చేశారు. ఇందుకోసం శాస్త్రవేత్తలు కొన్ని కోళ్లను ఎంచుకున్నారు. మధుమేహాన్ని నియంత్రించే యాంటీబాడీలను అభివృద్ధి చేయగల మందును వాటికి వేశారు. ఆరునెలల పాటు పరీక్షించాక... యాంటీబాడీలు పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఆ కోళ్ల గుడ్ల నుంచి యాంటీబాడీలను వెలికి తీసి ఎలుకలు, ఇతర జంతువుల శరీరాల్లో ప్రవేశపెట్టారు. వాటిలో మధుమేహం నియంత్రణలోకి వచ్చిందని నిర్ధారించుకున్నారు. ఈ పరిశోధన పత్రాలను బయో ఆర్కైవ్‌ జర్నల్‌కు పంపించారు. ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకుని క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభిస్తామని పరిశోధన బృందం ప్రతినిధి డాక్టర్‌ ఉదయ్‌ సక్సేనా      తెలిపారు. 18 నెలల్లో ఈ మందును మార్కెట్‌లోకి తీసుకురావడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని ఆస్పైర్‌ బయోనెస్ట్‌ సంచాలకుడు ప్రొఫెసర్‌ ఎస్‌.రాజగోపాల్‌, జీఎస్‌ ప్రసాద్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని