మహిళా ఉద్యోగుల భద్రతకు సాహస్‌!

రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొనడంతోనే ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందించగలుగుతున్నామని హోంమంత్రి మహమూద్‌ అలీ స్పష్టంచేశారు.

Updated : 20 May 2023 05:00 IST

పనిచేసే చోట వేధింపుల అడ్డుకట్టకు వేదిక  
లోగో ఆవిష్కరించిన హోంమంత్రి మహమూద్‌ అలీ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొనడంతోనే ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందించగలుగుతున్నామని హోంమంత్రి మహమూద్‌ అలీ స్పష్టంచేశారు. పోలీసులపై సీఎం కేసీఆర్‌ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ యంత్రాంగమూ రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని అభినందించారు. పనిచేసే చోట మహిళా ఉద్యోగులు ఎదుర్కొనే లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు దేశంలోనే తొలిసారి తెలంగాణ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో ‘సాహస్‌’ కార్యక్రమం చేపట్టారు. మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ శిఖా గోయల్‌ సారథ్యంలో బేగంపేట్‌లోని హోటల్‌ ఐటీసీ కాకతీయలో శుక్రవారం ‘సాహస్‌’ లోగో ఆవిష్కరణకు హోంమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ, పరిశ్రమల నిర్వాహకులు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశంలోనే ఎక్కువ శాతం మహిళా ఉద్యోగులు తెలంగాణలోనే పని చేస్తున్నారని, వారి భద్రతకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు.

డీజీపీ అంజనీకుమార్‌ మాట్లాడుతూ... రాష్ట్రంలో 5,000 మంది మహిళా కానిస్టేబుళ్లు పనిచేస్తుండటం మహిళా సాధికారతకు నిదర్శనమన్నారు. పని చేసేచోట ఎదురయ్యే ఇబ్బందులను పంచుకునేందుకు ‘సాహస్‌’ మహిళలకు చక్కగా ఉపయోగపడుతుందన్నారు. మహిళా భద్రతా విభాగం అదనపు డీజీ శిఖాగోయల్‌ మాట్లాడుతూ... రాష్ట్ర పోలీసులు చేపట్టిన షీటీమ్స్‌, భరోసాల మాదిరే సాహస్‌ ఒక వినూత్న కార్యక్రమం అన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా మహిళలు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారని నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే-2022 స్పష్టం చేసిందని వివరించారు. మహిళా భద్రతా విభాగం ఎస్పీ పద్మజారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీఐఐ(తెలంగాణ) ఛైర్మన్‌ సి.శేఖర్‌రెడ్డి, క్రెడాయ్‌ ప్రధాన కార్యదర్శి వి.రాజశేఖర్‌రెడ్డి, ఫెమినా మిస్‌ ఇండియా(2020) మానస వారణాసి, హైసియా అధ్యక్షుడు భరణి కుమార్‌, ఈసీ సభ్యుడు రామకృష్ణ లింగారెడ్డి, ఫిక్కీ మహిళా విభాగం ఛైర్‌పర్సన్‌ భాగవతి దేవి, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

‘సాహస్‌’కు ఎలా ఫిర్యాదు చేయాలంటే...

ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పరిశ్రమల్లో మహిళలపై వేధింపులను ఫిర్యాదు చేసేందుకు అంతర్గత కమిటీలుంటాయి. అక్కడ సరైన న్యాయం జరగకుంటే ‘సాహస్‌’ అండగా నిలుస్తుంది. బాధితులకు ఎన్జీవో ఆధ్వర్యంలో అర్హులు, అనుభవమున్న న్యాయ నిపుణుల ద్వారా సూచనలు ఇప్పిస్తారు. వీరు వెబ్‌సైట్‌ ద్వారా నిత్యం అందుబాటులో ఉంటారు. అత్యవసర సమయంలో ఫోన్‌ ద్వారా సహకారం అందిస్తారు.

వెబ్‌సైట్‌: womensafetywing.telangana.gov.in/ sahas/about-sahas, ahasmitru.wsw@gmail.com వాట్సప్‌ నంబరు: 73311 94540.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు