తెలంగాణలో ‘అలియంట్‌’ విస్తరణ

అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు సమక్షంలో మరో రెండు ప్రసిద్ధ సంస్థలు భారీ పెట్టుబడులకు నిర్ణయం తీసుకున్నాయి.

Published : 21 May 2023 04:34 IST

టెక్నిప్‌ ఎఫ్‌ఎంసీ పరిశ్రమ, పంపిణీ కేంద్రాలు
రూ.2,750 కోట్ల పెట్టుబడులు
12500 మందికి ఉద్యోగాలు
మంత్రి కేటీఆర్‌ సమక్షంలో నిర్ణయాలు

ఈనాడు,హైదరాబాద్‌: అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు సమక్షంలో మరో రెండు ప్రసిద్ధ సంస్థలు భారీ పెట్టుబడులకు నిర్ణయం తీసుకున్నాయి. రూ.2750 కోట్లతో 12,500 మందికి ఉపాధి కల్పించేందుకు ముందుకొచ్చాయి.

అమెరికాకు చెందిన ప్రసిద్ధ బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమా సంస్థ అలియంట్‌ గ్రూపు హైదరాబాద్‌లోని తమ కేంద్రాన్ని భారీగా విస్తరించనుంది. 2020లో హైదరాబాద్‌ ఏర్పాటు చేసిన తమ కేంద్రం ద్వారా ప్రస్తుతం వెయ్యి మందికి ఉపాధి కల్పిస్తుండగా.. కొత్తగా రూ.1500 కోట్ల పెట్టుబడితో 9వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని సంస్థ సీఈవో ధవల్‌ జాదవ్‌ తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీ రామారావు శనివారం హ్యూస్టన్‌లోని అలియంట్‌ సంస్థ ప్రధాన కార్యాలయానికి వెళ్లి సీఈవో జాదవ్‌తో భేటీ అయ్యారు. పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, సీఆర్‌వో అమర్‌నాథ్‌రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాదవ్‌ తమ విస్తరణ ప్రణాళికను వెల్లడించారు. భారత్‌లో బ్యాంకింగ్‌, బీమా, ఆర్థిక సేవలకు డిమాండ్‌ దృష్ట్యా హైదరాబాద్‌ కేంద్రంగా తమ కేంద్రాన్ని భారీగా విస్తరించాలని నిర్ణయించామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్‌లో తమ కంపెనీ ప్రస్థానం విజయవంతంగా కొనసాగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తంచేశారు. దీనిపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. బీఎఫ్‌ఎస్‌ఐ పరిశ్రమకు హైదరాబాద్‌ కేంద్ర బిందువుగా మారుతోందని తెలిపారు. పన్నులు  అకౌంటింగ్‌, ఆడిట్‌ సర్వీస్‌, ఐటీ టెక్నాలజీకి చెందిన యువతకు ఇదొక సదావకాశం అవుతుందని పేర్కొన్నారు.

ఎఫ్‌ఎంసీ రూ.1250 కోట్ల పెట్టుబడులు...

సంప్రదాయిక, పునరుత్పాదక ఇంధన రంగంలో పేరొందిన ఫ్రెంచ్‌-అమెరికన్‌ ఆయిల్‌-గ్యాస్‌ సంస్థ టెక్నిప్‌ ఎఫ్‌ఎంసీ హైదరాబాద్‌లో రూ.1250 కోట్లతో ప్రపంచస్థాయి పంపిణీ, ఇంజినీరింగ్‌ తయారీ కేంద్రం ఏర్పాటు చేయనుంది. దీనిద్వారా 3500 మందికి ఉపాధి వస్తుందని సంస్థ తెలిపింది. దీంతోపాటు రూ.వెయ్యి కోట్లతో మరో తయారీ కేంద్రాన్ని స్థాపిస్తామని, దీని ద్వారా అదనంగా వెయ్యి మందికి ఉపాధి లభిస్తుందని తెలిపింది. హ్యూస్ట్టన్‌లోని ఎఫ్‌ఎంసీ ప్రాంగణాన్ని కేటీఆర్‌ సందర్శించారు. సంస్థ సీనియర్‌ ఉపాధ్యక్షుడు అండ్రస్‌ డాల్‌, భారత విభాగాధిపతి, ఎండీ హూసిలా తివారీతో పాటు ఇతర ప్రతినిధులు ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమ నిర్ణయాలు వెల్లడించారు. విద్యుత్తు ప్రాజెక్టులు, సాంకేతిక, సేవ, తయారీ రంగాల్లో పేరొందిన తమ సంస్థ దాదాపు 40 దేశాల్లో 33 వేల మంది పనిచేస్తున్నారని తెలిపారు. గ్రీన్‌హౌస్‌ గ్యాస్‌ తొలగింపు, పునరుత్పాదక ఇంధన తయారీ, హైడ్రోజన్‌ ఆధారిత ఇంధన ఉత్పత్తి ఆవిష్కరణల్లో ముందంజలో ఉందని చెప్పారు. హైదరాబాద్‌ కేంద్రంగా రూ.5400 కోట్ల విలువైన ఎగుమతులు చేస్తామన్నారు. టెక్నిప్‌ ఎఫ్‌ఎంసీ నిర్ణయంపై మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తంచేశారు. సీఆర్‌ఓ అమర్నాథ్‌రెడ్డి ఆత్మకూరి, వైమానిక రక్షణ సంచాలకుడు ప్రవీణ్‌ పాల్గొన్నారు. నిజామాబాద్‌లోని ఐటీ హబ్‌లో ఎనిమిది ఐటీ పరిశ్రమలు తమ ప్రాంగణాలు ఏర్పాటు చేసేందుకు మంత్రి కేటీఆర్‌ సమక్షంలో శనివారం ఒప్పందం కుదుర్చుకున్నాయి. పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, భారాస ప్రపంచ ప్రవాస విభాగాల సమన్వయకర్త మహేశ్‌గుప్తా బిగాల, ఐటీ సర్వ్‌  ప్రతినిధులు లక్ష్ చేపూరి, విజయ్‌ రంగినేని తదితరులు పాల్గొన్నారు.


స్కైసోరర్‌ ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌...

ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి (వరల్డ్‌ తెలుగు ఐటీ కౌన్సిల్‌) ప్రచార కార్యక్రమం స్కైసోరర్‌ను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీరామారావు మండలి ఛైర్మన్‌ సందీప్‌కుమార్‌ మక్తలతో కలిసి శనివారం వాషింగ్టన్‌లో ప్రారంభించారు. సింగపూర్‌లో వచ్చే ఆగస్టు 5, 6 తేదీల్లో జరిగే  ప్రపంచ తెలుగు ఐటీ మహాసభ సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు పెట్టుబడులు,  పరిశ్రమల సాధన, అంకురాల ప్రోత్సాహానికి కృషిచేస్తున్నామని మండలి అధ్యక్షుడు సందీప్‌కుమార్‌ తెలపగా ఆయనకు మంత్రి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, డిజిటల్‌ మీడియా విభాగం సంచాలకుడు దిలీప్‌ కొణతం తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు