కేంద్ర పథకాలతోనే తెలంగాణ అభివృద్ధి

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి మహేంద్రనాథ్‌ పాండే అన్నారు.

Published : 21 May 2023 04:03 IST

కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి మహేంద్రనాథ్‌ పాండే

నారాయణపేట(పాతబస్టాండు), న్యూస్‌టుడే: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి మహేంద్రనాథ్‌ పాండే అన్నారు. తమ ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని, తద్వారా ఎక్కువమంది ప్రజలకు లబ్ధి చేకూరిందని చెప్పారు. నారాయణపేటలో పార్లమెంట్‌ ప్రవాసీ యోజనలో భాగంగా శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో భాజపా అధికారంలోకి రావడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని పాండే సూచించారు. రాష్ట్రంలో తమ పార్టీకి 80 సీట్లు ఖాయమన్నారు. అనంతరం కుమ్మరివాడలో పర్యటించి ముద్ర రుణాలు తీసుకున్న లబ్ధిదారులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కుమ్మరులకు ఉచిత విద్యుత్తు, రెండు పడకగదుల ఇళ్లు అందించాలని వారు కోరారు. అప్పక్‌పల్లి వద్ద కొత్తగా నిర్మిస్తున్న 360 పడకల జిల్లా ఆసుపత్రి నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. పనుల్లో నాణ్యత పెంచాలని, అక్టోబరు నాటికి పూర్తి చేయాలని గుత్తేదారులను ఆదేశించారు. ఆసుపత్రి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు అందిస్తే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నయాపైసా ఇవ్వలేదన్నారు. తర్వాత కోటకొండ చేనేత కార్మికులతో మాట్లాడారు. కార్యక్రమంలో భాజపా రాష్ట్ర నాయకులు నాగురావు నామాజీ, రతంగ్‌ పాండురెడ్డి, జలంధర్‌రెడ్డి, జిల్లా నాయకులు పగడాకుల శ్రీనివాస్‌, సత్యయాదవ్‌, ప్రభాకర్‌ వర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని