Gold Loan: సులభతరం.. బంగారంపై రుణం

రోజురోజుకూ బంగారం విలువ పెరుగుతుండగా.. దీనిపై రుణాలు తీసుకోవడం కూడా సులభంగా మారుతోంది.  గతంలో బంగారం ధరల పెరుగుదలను నెలకోసారి పరిశీలించి నెలవారీ సగటు ధర ఆధారంగా ఒక గ్రాముపై ఎంత రుణం ఇవ్వాలో బ్యాంకులు నిర్ణయించేవి.

Updated : 21 May 2023 10:51 IST

ఆంక్షలు సడలిస్తున్న బ్యాంకులు
పెరుగుతున్న తాకట్టు రుణాలు
ఈనాడు - హైదరాబాద్‌

రోజురోజుకూ బంగారం విలువ పెరుగుతుండగా.. దీనిపై రుణాలు తీసుకోవడం కూడా సులభంగా మారుతోంది.  గతంలో బంగారం ధరల పెరుగుదలను నెలకోసారి పరిశీలించి నెలవారీ సగటు ధర ఆధారంగా ఒక గ్రాముపై ఎంత రుణం ఇవ్వాలో బ్యాంకులు నిర్ణయించేవి. కానీ, ఇటీవలి కాలంలో వారానికోసారి సగటు ధరను నిర్ణయించి దాని ఆధారంగా రుణ పరిమితిని పెంచుతున్నాయి. ఉదాహరణకు హైదరాబాద్‌లో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు శాఖలో ఒక గ్రాము బంగారంపై రూ.4,730 వరకూ రుణాన్ని తక్షణం ఇస్తున్నారు. వ్యవసాయ పనుల పద్దు కింద రుణం రూ.3 లక్షల వరకూ తీసుకుంటే ఎలాంటి ప్రాసెసింగ్‌ రుసుం కూడా వేయడం లేదు. ఈ రుణాలకు నెలకు వంద రూపాయలపై 71 పైసలు మాత్రమే వడ్డీ తీసుకుంటున్నట్లు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు మేనేజర్‌ సంతోష్‌రెడ్డి ‘ఈనాడు’కు వివరించారు. హైదరాబాద్‌లో ఉండేవారైనా బంగారం తాకట్టు పెట్టి వ్యవసాయ పనులకు రుణం కావాలని డిక్లరేషన్‌ ఇస్తే ప్రాసెసింగ్‌ రుసుం లేకుండా రూ.3 లక్షలు ఇచ్చేస్తామన్నారు. వ్యవసాయ భూమి పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్‌ కాపీ సమర్పిస్తే రూ.10 లక్షల వరకూ ఇస్తామని చెప్పారు.

సాధారణంగా బంగారాన్ని కొందరు బ్యాంకు లాకర్లలో భద్రపరుస్తుంటారు. కానీ, అదే బ్యాంకులో తాకట్టు పెట్టి ‘ఓవర్‌ డ్రాఫ్ట్‌’(ఓడీ) పద్దు రుణం తీసుకుంటే సులభంగా తిరిగి కట్టే సదుపాయాన్నీ బ్యాంకులు ప్రవేశపెట్టాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి 100 గ్రాముల బంగారాన్ని తాకట్టు పెడితే దాని విలువలో 75 శాతం ఓడీ రుణం కింద బ్యాంకు మంజూరుచేసి అతని పొదుపు ఖాతాలో సొమ్ము జమ చేస్తుంది. ఈ సొమ్మునంతా వెంటనే తీసుకుంటేనే మొత్తానికి వడ్డీ వేస్తారు. అలా కాకుండా బ్యాంకు ఖాతాలోనే సొమ్ము ఉంచేసి తనకు ఎంత అవసరమో అంత డబ్బునే తీసుకుంటే దానిపై మాత్రమే వడ్డీ వేసేలా ఓడీ రుణాలు ఇస్తున్నట్లు సంతోష్‌రెడ్డి వివరించారు. ఓడీ రుణాలపై ఏడాదికి 8 శాతం నుంచి 10 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారు. 

తగ్గుతున్న ప్రైవేటు భాగస్వామ్యం..

దేశంలో ప్రజల వద్ద 27 వేల టన్నుల బంగారం నిల్వలున్నట్లు అంచనా. దీనిలో 6 వేల టన్నుల వరకూ తాకట్టు రుణాల కింద బ్యాంకుల్లో పెడుతున్నారు. గతేడాదికన్నా ఈ ఏడాది 16 శాతం తాకట్టు రుణాలు పెరిగాయని రిజర్వు బ్యాంకు తాజా నివేదికలో వెల్లడించింది. మనదేశంలో బంగారం తాకట్టు పెట్టుకుని ఇచ్చే రుణాల్లో ప్రైవేటు వ్యక్తులు, సంస్థల భాగస్వామ్యం 2010-11లో 76 శాతం ఉంటే 2021-22 నాటికి 65 శాతానికి తగ్గింది. దీన్ని బట్టి తాకట్టు రుణాలు ఇవ్వడంలో బ్యాంకుల భాగస్వామ్యం పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు