ప్రపంచ పర్యాటక గమ్యంగా భారత్
ప్రపంచంలో కొవిడ్ నుంచి వేగంగా కోలుకుని మెరుగైన స్థితికి చేరింది భారతదేశ పర్యాటకమేనని.. ప్రపంచ పర్యాటకానికి భారత్‌ను గమ్యస్థానంగా మారుస్తామని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు.
వంద శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతి
త్వరలో కొత్త టూరిజం పాలసీ
రామప్పకు వచ్చే పర్యాటకుల కోసం హెలీ ట్యాక్సీ
‘ఈనాడు’ ముఖాముఖిలో కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి
ఈనాడు - హైదరాబాద్
ప్రపంచంలో కొవిడ్ నుంచి వేగంగా కోలుకుని మెరుగైన స్థితికి చేరింది భారతదేశ పర్యాటకమేనని.. ప్రపంచ పర్యాటకానికి భారత్‌ను గమ్యస్థానంగా మారుస్తామని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. నూతన పర్యాటక విధాన ముసాయిదా సిద్ధమై ప్రధాని కార్యాలయానికి చేరిందని.. త్వరలోనే కొత్త దశ, దిశను అందిస్తామన్నారు. తెలుగు రాష్ట్రాల్ని కలిపే కృష్ణా నదిపై సోమశిల వద్ద నిర్మించనున్న భారీ కేబుల్ బ్రిడ్జి శంకుస్థాపనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీలలో ఒకరు వస్తారని చెప్పారు. శ్రీనగర్‌లో సోమవారం నుంచి ప్రారంభం కానున్న జీ-20 పర్యాటక సదస్సు నేపథ్యంలో కిషన్‌రెడ్డి ‘ఈనాడు’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
కొవిడ్‌లో తీవ్రంగా దెబ్బతిన్న పర్యాటకం ఇప్పుడెలా ఉంది..?
కొవిడ్ వల్ల బాగా ప్రభావితమైనవి పర్యాటక, ఆతిథ్య రంగాలే. ఇప్పుడిప్పుడే ఇవి మళ్లీ ఊపందుకుంటున్నాయి. ఉదాహరణకు 2022లో కశ్మీర్‌లో 1.84 కోట్ల మంది పర్యటించారు. 2022 మార్చిలో శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో రోజుకు 90 విమానాలు రాకపోకలు సాగించాయి. లేహ్‌లో 2020 జనవరిలో వారానికి 74 విమానాలు రాకపోకలు సాగించగా.. 2022 అక్టోబరులో ఆ సంఖ్య 160కి చేరింది. ఇతర ప్రాంతాల్లోనూ వృద్ధి కనిపిస్తోంది. సమగ్ర, సుస్థిర పర్యాటకం కోసం కొత్త విధానాన్ని తీసుకొస్తున్నాం. 100 శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతివ్వడం, పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యం, ప్రకృతి పర్యాటకానికి డిమాండ్ నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు, పోచంపల్లి వంటి గ్రామీణ పర్యాటక ప్రాంతాలకు ప్రోత్సాహం వంటి అంశాలపై దృష్టి సారించాం.
కశ్మీర్‌లో జీ20 పర్యాటక సదస్సు పెట్టడంలో ప్రత్యేకత..?
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నిర్వహించే జి-20 సదస్సులకు దాదాపు లక్షమంది విదేశీ ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ సదస్సులు విదేశీ పర్యాటకుల రాక పెరిగేందుకు దోహదం చేస్తాయి. 34 సంవత్సరాల తర్వాత కశ్మీర్‌లో అంతర్జాతీయ సదస్సును నా అధ్యక్షతన నిర్వహించబోతున్నాం. అక్కడి పరిస్థితుల వల్ల కొన్నాళ్లు కుంటుపడిన పర్యాటకం మళ్లీ పుంజుకుంటోంది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా హీరో రాంచరణ్ మంగళవారం శ్రీనగర్ సదస్సులో పాల్గొంటున్నారు. సదస్సుకు రావద్దని చైనా, పాకిస్థాన్‌లు జీ 20 దేశాలకు లేఖలు రాసి ఒత్తిడి చేశాయి. అలా చెప్పడానికి వాటికి ఎలాంటి హక్కు లేదు. ఈ సదస్సుకు 29 దేశాల నుంచి విచ్చేస్తున్న 100 మంది విదేశీ ప్రతినిధుల్లో భద్రతపరంగా విశ్వాసం కల్పించాం.
ఎక్కువ మందికి ఉపాధినిచ్చే పర్యాటకానికి కేంద్రం ఎలాంటి సహకారమిస్తోంది?
ఆతిథ్యరంగ అనుబంధ విభాగాలకు ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీం పరిమితిని రూ. 4.50 లక్షల కోట్ల నుంచి రూ.5 లక్షల కోట్లకు పెంచడంతో దీనిపై ఆధారపడిన వారందరికీ లబ్ధి చేకూరింది. పర్యాటకాభివృద్ధికి రూ. లక్షల కోట్లు కావాలి. ఇందుకోసం ప్రైవేటు పెట్టుబడులు రావాలి. దేశ చరిత్రలో తొలిసారిగా ‘గ్లోబల్ టూరిజం ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్’ త్వరలో దిల్లీలో నిర్వహిస్తాం. సింగపూర్‌లో వాటర్ టూరిజం కంపెనీ, యూనివర్సల్ స్టూడియో వంటి వారిని పెట్టుబడులకు పిలుస్తున్నాం. టాటా వంటి కంపెనీలతో కొత్త ప్రాంతాల్లో హోటళ్లకు ప్రణాళికలు రచిస్తున్నాం.
తెలుగు రాష్ట్రాల్లో పర్యాటకాభివృద్ధికి ప్రణాళికలేమిటి..?
రామప్పకు యునెస్కో గుర్తింపులో కేంద్రం పాత్ర కీలకం. ఏపీలో లేపాక్షిని గత ఏడాది యునెస్కోకు పంపించాం. రవీంద్రనాథ్ ఠాగూర్ నెలకొల్పిన శాంతినికేతన్‌కు ఈ ఏడాది యునెస్కో గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నాం. రామప్ప ఆలయ అభివృద్ధికి కేంద్రం రూ.67 కోట్లు ఇస్తోంది. అలంపూర్ జోగులాంబ శక్తిపీఠంలో సౌకర్యాలకు రూ.37 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు సెప్టెంబరులో పూర్తవుతాయి. భద్రాచలంలో రూ.42 కోట్లతో పనులు చేపట్టాం. ఏపీలో రెండు కోస్తా సర్క్యూట్లకు రూ.117.39 కోట్లు, బుద్ధిస్ట్ సర్క్యూట్‌కు రూ.24.14 కోట్లు ఇచ్చాం. ఏపీలో గండికోట, లంబసింగి, అరకు ప్రాంతాల్లో రూ.100 కోట్ల చొప్పున పర్యాటకాభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. తెలంగాణలో భువనగిరి కోట, అనంతగిరిలో రూ.100 కోట్ల చొప్పున ఖర్చు చేస్తాం. రామప్పకు వచ్చే విదేశీ పర్యాటకుల కోసం హైదరాబాద్ నుంచి హెలీ ట్యాక్సీ ప్రవేశపెట్టే ఆలోచన ఉంది. తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తే రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి ఎంతమేరకైనా సహకరించడానికి కేంద్రం సిద్ధం.
దూరప్రాంత పర్యాటకానికి రైళ్లలో రిజర్వేషన్లు దొరకట్లేదు.. విమానాల్లో భారీ ఛార్జీలుంటున్నాయి..?
అప్పటికప్పుడు వెళ్లే పర్యాటకులకు రిజర్వేషన్‌లో ప్రత్యేక కోటాపై రైల్వే మంత్రితో మాట్లాడతా. ప్రజావసరాల కోసం కేంద్రం పెద్దసంఖ్యలో విమానాశ్రయాలు నిర్మిస్తోంది. అవి 2014కి ముందు 70 ఉంటే మోదీ ప్రధాని అయ్యాక 147కి పెరిగాయి. 2025 నాటికి కొత్తగా మరో 78 వస్తాయి. ఉడాన్ పథకంలో 51 కొత్త టూరిజం రూట్లను వినియోగంలోకి తెచ్చాం. ఈశాన్య రాష్ట్రాలకు రైల్వే, విమాన నెట్‌వర్క్‌ని అభివృద్ధి చేస్తున్నాం. భారత్ గౌరవ్ రైళ్లు.. రామాయణ్, బుద్ధ, అంబేడ్కర్ సర్క్యూట్లతో రవాణా సౌకర్యం కల్పిస్తున్నాం. కొండ ప్రాంతాల్లో సొరంగమార్గాలు నిర్మిస్తున్నాం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
చింతలపూడి ఏరియా ఆసుపత్రిలో చీకట్లు.. ఉక్కపోతలో రోగులు
-
Sports News
ఆస్ట్రేలియా వికెట్ పడింది.. లబుషేన్ నిద్ర లేచాడు
-
Movies News
ఇలియానా వెబ్‌సిరీస్ అప్పుడే!
-
Sports News
WTC Final: గిల్ అంటే కుర్రాడు.. నీకేమైంది పుజారా..?: రవిశాస్త్రి ఆగ్రహం
-
Movies News
Social Look: మృణాల్ ఠాకూర్ ‘బ్లాక్ అండ్ బోల్డ్’.. అయిషా శర్మ ఆటో జర్నీ!
-
Sports News
WTC Final: కెన్నింగ్టన్ ఓవల్‌లో మూడో హాఫ్ సెంచరీ.. డాన్ బ్రాడ్‌మన్ సరసన శార్దూల్