‘గేట్ల’ పాట్లు తీరేదెన్నడు!
వానాకాలం సమీపిస్తోంది. వరదలు వచ్చేనాటికి జలాశయాలు, తూములు, కాలువల మరమ్మతులు పూర్తి చేయాల్సి ఉంది. ఈ కీలక సమయంలో నీటిపారుదల శాఖ నిర్లక్ష్యం వీడటం లేదు.
వానాకాలం వచ్చేలోగా ప్రాజెక్టుల మరమ్మతులు పూర్తయ్యేనా?!
పనిచేయని డిండి ప్రాజెక్టు తూము గేట్లు
ధ్వంసమైన సాగర్ ఎడమ బ్రాంచ్ కాలువ ఎస్కేప్ రెగ్యులేటర్‌లు
మరమ్మతులకు జూరాల, మూసీ, కడెం ఎదురుచూపులు
బిల్లుల బకాయిలతో టెండర్లకు ముందుకురాని గుత్తేదారులు!
ఈనాడు-హైదరాబాద్, న్యూస్‌టుడే యంత్రాంగం
నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ఎడమ బ్రాంచ్ కాలువ కింద 96.92 కిలోమీటరు, 113.14 కిలోమీటరు వద్ద ఉన్న ఎస్కేప్ రెగ్యులేటర్‌ల తలుపులు ధ్వంసమయ్యాయి. నీరంతా వృథాగా పోతోంది. చాలా కాలంగా మరమ్మతులు జరగలేదు. ఇటీవల మరోమారు టెండరు నిర్వహించారు. పనులు పూర్తి చేసేందుకు ఇంజినీర్లు చర్యలు చేపడుతున్నారు.
వానాకాలం సమీపిస్తోంది. వరదలు వచ్చేనాటికి జలాశయాలు, తూములు, కాలువల మరమ్మతులు పూర్తి చేయాల్సి ఉంది. ఈ కీలక సమయంలో నీటిపారుదల శాఖ నిర్లక్ష్యం వీడటం లేదు. చాలా ప్రాజెక్టుల కింద మరమ్మతులు పెండింగ్‌లో ఉన్నాయి. కాలువలు, ఆనకట్టల గేట్లు చెడిపోయి ఇప్పటికీ తెరుచుకునే ఉన్నాయి. సర్కిళ్ల నుంచి మరమ్మతుల ప్రతిపాదనలు వచ్చినప్పటికీ అనుమతులు ఇవ్వాల్సి ఉంది. మరోవైపు, కొన్ని జిల్లాల్లో టెండర్లు పిలిచినా గుత్తేదారులు ముందుకు రావడం లేదు. పాత బిల్లులు చెల్లించాల్సి ఉండటమే దీనికి కారణమన్న అభిప్రాయం ఉంది. గతేడాది భారీ వర్షానికి కడెం ప్రాజెక్టు దెబ్బతింది. సాగర్ కింద నీటి ప్రవాహానికి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో కాలువలకు గండ్లు పడ్డాయి. అంతకుముందు మూసీ, సరళాసాగర్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో జూన్ నుంచి కొత్త సీజన్ ప్రారంభమవుతున్న దృష్ట్యా అప్రమత్తం కావాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
కదలని పనులు.. టెండర్లలోనూ జాప్యం
నీటిపారుదల శాఖ పరిధిలో అత్యవసర మరమ్మతులకు వెనువెంటనే నిధుల కేటాయింపునకు వీలుగా ప్రభుత్వం త్రైమాసికానికి రూ.70 కోట్ల వరకు మంజూరు చేస్తోంది. ఈ నిధులను ఈఎన్సీ/సీఈ స్థాయి నుంచి డీఈఈ వరకు వివిధ దశల్లో వినియోగించుకోవచ్చు. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో పనులు పెండింగ్‌లో ఉంటున్నాయి. పాత పనుల బకాయిలూ పేరుకుపోతున్నాయి. సాంకేతిక, క్షేత్రస్థాయి సమస్యలు ఉన్నప్పటికీ నిధుల మంజూరులో జాప్యం చోటుచేసుకుంటోంది. దీనివల్ల కొత్త పనులు చేపట్టేందుకు గుత్తేదారులు ముందుకురావడం లేదు. కొన్ని పనులకు పలుమార్లు టెండర్లు పిలుస్తున్నా ఒప్పందాలకు ముందుకు రావడం లేదు. మూడు, నాలుగు దఫాలుగా టెండర్లు పిలిచిన అనంతరం పనులు చేసేందుకు కొందరు గుత్తేదారులు ముందుకొస్తుండటం చర్చనీయాంశంగా మారుతోంది. 2022-23 ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి ఓ అండ్ ఎం విభాగం కింద రూ.110 కోట్ల చెల్లింపులు పూర్తయ్యాయి. దాదాపు రూ.103 కోట్లు పెండింగ్ ఉన్నాయి. ఏప్రిల్, మే నెలల్లో కొన్ని బిల్లులు చెల్లించినట్లు తెలిసింది.
* ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న డిండి ప్రాజెక్టు ఎడమ కాలువ తూముకు ఉన్న మూడు గేట్లు పనిచేయడం లేదు. పైకి, కిందికి గేట్లను కదిలించేందుకు ఉన్న వ్యవస్థ మొరాయిస్తోంది. దాదాపు నాలుగేళ్ల నుంచీ ఇదే పరిస్థితి. ఈ పనులకు ఆరుసార్లు టెండర్లు పిలవగా ఈ ఏడాది ఖరారైనట్లు తెలిసింది. ఈ కాలువ కింద 12,500 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రాజెక్టుకు సంబంధించి రూ.16 లక్షల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.
* ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న మూసీ ప్రాజెక్టు ఒక గేటు కౌంటర్ వెయిట్ మరమ్మతుకు మూడుసార్లు టెండర్లు పిలవగా పనులకు ముందుకొచ్చిన గుత్తేదారు మూడుసార్లు టెండర్లలో పాల్గొన్నారు. ప్రస్తుతం పనులు చేపట్టారు. 4.4 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు కింద 33 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. రెండేళ్ల క్రితం ఒక గేటు కొట్టుకుపోగా మరమ్మతులు చేశారు.
* నిర్మల్ జిల్లాలో ఉన్న కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు పోయిన వర్షాకాలంలో వచ్చిన వరదలకు దెబ్బతిన్నది. గేట్ల కౌంటర్ వెయిట్‌ల మరమ్మతు జరుగుతున్నాయి. స్పిల్‌వేపై కొన్నిచోట్ల గోతులు ఏర్పడ్డాయి. స్పిల్‌వే దిగువన మరమ్మతులు చేయాల్సి ఉంది. రూ.1.50 కోట్లకు ప్రతిపాదనలు పంపినప్పటికీ మంజూరు కాలేదు. 7.6 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టు కింద 65 వేల ఎకరాల ఆయకట్టు ఉంది.
* ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జూరాల నుంచి ఆత్మకూరు మండలం నుంచి కొత్తకోట, పెబ్బేరు, వీపనగండ్ల, చిన్నంబావి మండలాలకు వెళ్లే కాలువలకు చాలాచోట్ల లైనింగ్ కొట్టుకుపోయాయి. ప్రధాన కాలువ నుంచి మైనర్ కాలువకు నీరు వస్తున్నా.. అక్కడి నుంచి సబ్ మైనర్, పిల్ల కాలువలకు ఎంత పరిమాణంలో నీటిని వదలాలో నియంత్రించే స్ట్రక్చర్లు కొన్ని ప్రాంతాల్లో కొట్టుకుపోయాయి. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు స్పిల్‌వే కింద ఏర్పడిన గుంతలు పూడ్చనేలేదు.
రూ. 20 కోట్లు విడుదలైనా..
కృష్ణా నదిపై తెలంగాణలో మొట్టమొదటి ప్రాజెక్టు ఇందిరా ప్రియదర్శిని జూరాల. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఈ ప్రాజెక్టు నుంచి ఏటా వేల టీఎంసీల జలాలు దిగువకు వెళ్తున్నాయి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ప్రాజెక్టు ఆనకట్ట మరమ్మతులు కొలిక్కి రావడం లేదు. గేట్ల మరమ్మతులకు ఉపయోగించే గ్యాంట్ క్రేన్ తరచూ చెడిపోతోంది. ప్రధాన గేట్లకు మరమ్మతు చేయాలంటే స్టాప్‌లాక్ గేట్లను తాత్కాలికంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. గేట్లను బాగు చేసేందుకు రెండేళ్ల క్రితం రూ.20 కోట్లు విడుదల చేసినా ఇప్పటికీ ఆరు గేట్ల మరమ్మతులు మాత్రమే పూర్తయ్యాయి.
సాగర్ స్పిల్‌వే మరమ్మతులు 30 శాతమే పూర్తి
వేగం పుంజుకోకుంటే పూర్తి కావడం కష్టమే!
ఈనాడు, నల్గొండ: రెండు రాష్ట్రాల వరప్రదాయిని అయిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు స్పిల్‌వే మరమ్మతు పనులు గడువులోపు పూర్తవుతాయా అనేది ప్రశ్నార్థకంగా మారింది. పనులు ప్రారంభమై 40 రోజులు దాటినా ఇప్పటివరకు 30 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. మరో 40 రోజుల్లో (జూన్ చివరికి) 70 శాతం పనులు పూర్తిచేయాల్సి ఉండడమే సంశయాలకు కారణమవుతోంది.
2009తో పాటు 2018, 2020 సంవత్సరాల్లో వచ్చిన వరదలకు ప్రాజెక్టు స్పిల్‌వే దెబ్బతింది. గేట్ల కింద భాగంలో భారీ గుంతలు ఏర్పడ్డాయి. వీటి వల్ల ప్రాజెక్టుకు ప్రమాదం ఏర్పడవచ్చన్న నిపుణుల హెచ్చరికతో మరమ్మతులకు ప్రభుత్వం గత నెలలో రూ.20 కోట్లు మంజూరు చేసింది. ప్రాజెక్టు ఓ అండ్ ఎం (ఆపరేషన్, మెయింటెనెన్స్)లో భాగంగా ఏప్రిల్ రెండో వారంలో పనులు ప్రారంభమయ్యాయి. 22 భారీ గుంతలను గుర్తించిన ఇంజినీరింగ్ సిబ్బంది ప్రస్తుతం 11 గుంతలను కాంక్రీట్‌తో పూడ్చే పనులు చేస్తున్నారు. ఇవి పూర్తయ్యాక మిగతావి చేపట్టనున్నారు. మొత్తం పనులు వచ్చే నెలాఖరు నాటికి పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు మరో 40 రోజుల గడువు మాత్రమే ఉంది. ఆ తర్వాత వర్షాలు, వరద ప్రవాహాలతో పనులకు ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పనుల్లో వేగం పుంజుకోకుంటే జులై చివరికైనా పనులు పూర్తికావన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎగువ నుంచి వరద మొదలు కాకముందే జూన్ నెలాఖరుకు పనులన్నీ పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
USA: అమెరికాకు ఊరట.. అప్పుల పరిమితి పెంపుపై సూత్రప్రాయంగా ఒప్పందం
-
Sports News
Shubman Gill: కోహ్లీ, రోహిత్ జట్లపై సెంచరీలు.. ఇప్పుడు ధోనీ వంతు : గిల్‌పై మాజీ పేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Movies News
keerthy suresh: కీర్తి సురేశ్ పెళ్లిపై వార్తలు.. క్లారిటీ ఇచ్చిన తండ్రి
-
India News
Shah Rukh Khan: కొత్త పార్లమెంట్‌పై షారుక్ ట్వీట్.. స్పందించిన ప్రధాని మోదీ..!
-
Movies News
Sharwanand: ఎవరికీ గాయాలు కాలేదు.. రోడ్డు ప్రమాదంపై హీరో శర్వానంద్ టీమ్ క్లారిటీ
-
Sports News
Dhoni- Chahar: ధోనీ నుంచి అక్షింతలు పడ్డాయి.. అభినందనలూ వచ్చాయి: దీపక్ చాహర్