Marriages: ఒక పెళ్లి.. వంద అబద్ధాలు

‘పెళ్లి చేయాలంటే కాళ్లరిగేలా తిరగాలి’ అనేది ఒకనాటి నానుడి.  ఇప్పుడు పెళ్లి చేయాలంటే ఆన్‌లైన్‌లో వివరాలు చూసి చూసి కళ్లు తిరిగినంత పనవుతోంది.

Updated : 22 May 2023 07:47 IST

వధూవరుల ప్రొఫైల్స్‌లో తప్పుడు సమాచారం
మ్యారేజ్‌బ్యూరోల మోసాలూ బోలెడు..
తల్లిదండ్రులు తనిఖీ చేసుకోకపోతే దారుణ నష్టాలు

ఈనాడు, హైదరాబాద్‌ : ‘పెళ్లి చేయాలంటే కాళ్లరిగేలా తిరగాలి’ అనేది ఒకనాటి నానుడి.  ఇప్పుడు పెళ్లి చేయాలంటే ఆన్‌లైన్‌లో వివరాలు చూసి చూసి కళ్లు తిరిగినంత పనవుతోంది. విచ్చలవిడిగా పుట్టుకొస్తున్న కొన్ని మ్యారేజ్‌బ్యూరోల అవకతవకలు, తల్లితండ్రులు అత్యాశతో పొందుపరిచే తప్పుడు వివరాలే దీనికి కారణం. ఈ బ్యూరోలపై ప్రభుత్వపరమైన నియంత్రణ కూడా లేదు. వాటి సంపాదనపై చెల్లించాల్సిన 18 శాతం జీఎస్టీని కూడా నిర్వాహకులు ఎగవేస్తున్నారని వాణిజ్య పన్నులశాఖ వర్గాలు తెలిపాయి. బ్యూరోల్లో ఇచ్చే వధూవరుల వివరాల్లో చాలా వరకు తప్పుడు సమాచారం ఉంటోంది. ఒక బ్యూరోలో ఇచ్చిన వివరాలు మరికొందరికి వ్యాప్తి చెందుతూ గందరగోళానికి, మోసాలకు కారణమవుతున్నాయని బాధితులు వాపోతున్నారు. ఐఐటీలో చదివారు, నెలకు రూ.లక్షల వేతనం, అమెరికాలో ఉద్యోగం, హైదరాబాద్‌లో లగ్జరీ ఫ్లాట్‌.. తదితర ఆకర్షణీయ వివరాలు చూసి మోసపోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఒకటికి పదిసార్లు బాగా విచారణ చేసుకున్నాకే తల్లిదండ్రులు బిడ్డ పెళ్లిపై నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు.

కంపెనీ మూతపడింది.. ఉద్యోగం పోయింది..

ఇటీవల విజయవాడలో ఉన్న ఒక కుటుంబం తమ కుమారుడు హైదరాబాద్‌ హైటెక్‌సిటీలోని పెద్ద కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడని మ్యారేజ్‌బ్యూరోలో వివరాలిచ్చింది. అది చూసి వరంగల్‌కు చెందిన అమ్మాయి తండ్రి ఆకర్షితులయ్యారు. పెళ్లి చూపులు పూర్తిచేసి.. నిశ్చితార్థం తేదీని కూడా నిర్ణయించుకున్నారు. మరోవైపు.. మాదాపూర్‌ వెళ్లి ఆ అబ్బాయి పనిచేసే కంపెనీ గురించి ఆరా తీయమని హైదరాబాద్‌లో తన మిత్రుడికి పురమాయించారు. తీరా ఆ మిత్రుడు వెదికితే చిన్న అపార్టుమెంటులో ఉన్న ఆ కంపెనీని ఆ రోజే మూసివేస్తున్నట్లు తెలిసింది. అక్కడే కనిపించిన పెళ్లికొడుకును పలకరిస్తే ఈ కంపెనీ మూతపడిందని, మరో ఉద్యోగం వెదుక్కోవాలని చెప్పాడు. దీంతో అమ్మాయి తండ్రి ఖిన్నుడై సంబంధాన్ని రద్దు చేసుకున్నారు.


పేరు అదే.. నక్షత్రం, పుట్టినతేదీ మార్చేశారు..

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తున్న అమ్మాయికి పెళ్లి సంబంధం కోసం తండ్రి మ్యారేజ్‌బ్యూరోలో రూ.10 వేలు చెల్లించి రాజమహేంద్రవరానికి చెందిన అబ్బాయి ప్రొఫైల్‌ తీసుకున్నారు. అతను ఒక సాధారణ కాలేజీలో బీటెక్‌ చదివాడు. పుట్టినతేదీ, నక్షత్రం నప్పలేదని పురోహితులు చెప్పడంతో అమ్మాయి తండ్రి వదిలేశారు. కొంతకాలం తరువాత మరో మ్యారేజ్‌బ్యూరోలో రూ.10 వేలు చెల్లిస్తే కొందరు వరుల వివరాలిచ్చారు. అక్కడ తాము తిరస్కరించిన అబ్బాయి వివరాలు చూసి అమ్మాయి తండ్రి షాక్‌ తిన్నారు. అదే అబ్బాయి జాతీయస్థాయి ప్రముఖ ఐఐటీలో బీటెక్‌ చదివినట్లు, పుట్టినతేదీ, నక్షత్రం వివరాలు మారిపోయి కనిపించాయి. మ్యారేజ్‌బ్యూరో మారేసరికి విద్యార్హతలు, జాతకాలు ఎలా మారిపోయాయని ఆయన నివ్వెరపోయారు.


ఎస్సైనే బురిడీ కొట్టించి సొమ్ము వసూలు...

ఆయన ఒక ఎస్సై. తన కుమారుడికి పెళ్లి సంబంధాలు వెతుకుతూ హైదరాబాద్‌లోని ఒక మ్యారేజ్‌బ్యూరోలో వివరాలిచ్చారు. నాలుగు రోజుల తరువాత తిరుపతిలోని మ్యారేజ్‌ బ్యూరో నుంచి ఫోన్‌ వచ్చింది. ఒక అమ్మాయి మాట్లాడుతూ.. మీ అబ్బాయికి సరిపడే ప్రొఫైల్స్‌ పంపుతామని చెప్పింది. నెలకు రూ.లక్ష వేతనం పొందుతున్న అమ్మాయి ఉందని, ఆమె తండ్రితో మాట్లాడమని కాన్ఫరెన్స్‌ కాల్‌ కలిపింది. అనంతరం ఎస్సై.. వధువు తండ్రి ఫోన్‌ నంబరు, చిరునామా అడిగారు. అందుకోసం రూ.15 వేలు ఇవ్వాలని బ్యూరో కోరడంతో ఆయన వెంటనే ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించారు. తరువాత ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందన లేకపోవడంతో తాను మోసపోయానని ఎస్సైకి అర్థమైంది.


ఇదీ ధోరణి..

* మంచి అందం, అధిక వేతనం వచ్చే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం, సొంత ఇల్లు, కొద్దో గొప్పో ఆస్తి ఉన్న అబ్బాయిలకే డిమాండ్‌ ఉంది. దీంతో కొందరు వరుల తల్లిదండ్రులు బోగస్‌ సమాచారం పొందుపరిచి.. ఏదోలా పెళ్లి అయితే చాలని ప్రయత్నిస్తున్నారు. వధూవరులకు సంబంధించి తప్పుడు వివరాలిస్తే.. నిజానిజాలు తమకు తెలిసే అవకాశం లేదని.. వారే స్వయంగా విచారణ చేసుకుని సంబంధం కుదుర్చుకోవాల్సి ఉంటుందని ఒక బ్యూరో ప్రతినిధి చెప్పారు.

* అమెరికా సంబంధాలు మరీ దారుణంగా ఉంటున్నాయని హైదరాబాద్‌లోని మ్యారేజ్‌బ్యూరోకి చెందిన సీనియర్‌ ప్రతినిధి ఒకరు ఉదాహరణలతో చెప్పారు. అమెరికాలో ఉండే కొందరు అబ్బాయిలు అక్కడ పెళ్లి చేసుకోవడం లేదా మరో యువతితో సహజీవనం చేస్తున్నారు. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచి.. తల్లిదండ్రుల ఒత్తిడితో ఇక్కడికి వచ్చి మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారు. భర్త వెంట ఎన్నో కలలతో అమెరికా వెళ్లిన కొత్త పెళ్లికూతురికి కొద్దిరోజులకే ఈ విషయం అర్థమై దిక్కుతోచని పరిస్థితి ఎదురవుతోందని ఆయన చెప్పారు.

* మెడిసిన్‌, ఎంటెక్‌, ఎంబీఏ వంటి ఉన్నత విద్యావంతులకు అదేస్థాయి అమ్మాయి లేదా అబ్బాయి తేలిగ్గా దొరకడం లేదు. వీరిని ఆకట్టుకోవాలని కొన్ని బ్యూరోల వారు బోగస్‌ ప్రొఫైల్స్‌ ఇస్తున్నారు.

* అమ్మాయికిచ్చే కట్నం లేదా అబ్బాయికున్న ఆస్తి విలువలో 2 నుంచి 3 శాతం కనీసం ఒక శాతమైనా కమీషన్‌ ఇవ్వాలని పలు మ్యారేజ్‌బ్యూరోలు నిబంధనలు పెడుతున్నాయి. ఈ సొమ్ము ఇవ్వకపోతే పెళ్లి తరువాత కూడా గొడవలకు దిగుతున్నాయి.


ఆన్‌లైన్‌ వేదికలతో కొంత ఊరట

ఇటీవలి కాలంలో వివిధ సామాజికవర్గాల వారు ఫేస్‌బుక్‌, వాట్సప్‌లలో తమ బంధువులు, మిత్రులతో ‘మ్యారేజ్‌గ్రూప్‌’ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇందులో తల్లిదండ్రులు తమ ఫోన్‌ నంబరు, పిల్లల వివరాలు పోస్టు చేస్తే ఆసక్తి ఉన్న ఇతరులు వారిని నేరుగా సంప్రదిస్తున్నారు. దీనివల్ల మ్యారేజ్‌బ్యూరోల బెడద కొంత తప్పిందని ఒక గ్రూప్‌ అడ్మిన్‌ ‘ఈనాడు’కు చెప్పారు.

* ఇలా వాట్సప్‌ గ్రూప్‌లు, ఆన్‌లైన్‌ పోర్టళ్లలో ఉన్న వధూవరుల ప్రొఫెల్స్‌, ఫోన్‌ నంబర్లు తస్కరించి.. వాటిని ఇతరులకు చూపి రుసుం వసూలు చేసే మ్యారేజ్‌ బ్యూరోలు కూడా లేకపోలేదు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు