రెండేళ్లుగా కొలిక్కిరాని భూసేకరణ!

రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి  భూసేకరణ ప్రక్రియ రెండేళ్లుగా కొలిక్కి రావడం లేదు. తెలంగాణ నుంచి వివిధ ప్రాంతాలకు 8 జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ నిర్ణయించింది.

Published : 22 May 2023 03:40 IST

10 వేల ఎకరాలు పెండింగ్‌
ముందుకు సాగని జాతీయ రహదారుల నిర్మాణాలు

ఈనాడు, హైదరాబాద్‌:  రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి  భూసేకరణ ప్రక్రియ రెండేళ్లుగా కొలిక్కి రావడం లేదు. తెలంగాణ నుంచి వివిధ ప్రాంతాలకు 8 జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ నిర్ణయించింది. ఈమేరకు దాదాపు 720 కిలోమీటర్ల మేర రహదారులు జాతీయ రహదారులుగా మారనున్నాయి. సవివర నివేదికలకు ఆమోదముద్ర సైతం పడింది. కేంద్రం మంజూరుచేసిన రహదారుల్లో ప్రాంతీయ రింగు రోడ్డుకు అవసరమైన భూసేకరణ వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించేందుకు గతంలో అంగీకరించాయి. ఈ రహదారి నిర్మాణ వ్యయాన్ని కేంద్రమే వెచ్చిస్తుంది.

సేకరించింది 710 ఎకరాలే..

తెలంగాణ మీదుగా నిర్మించే జాతీయ రహదారుల కోసం సుమారు 10,800 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. గత రెండేళ్లలో 710 ఎకరాలు మాత్రమే సేకరించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా 10 వేల ఎకరాల మేర భూ సేకరణ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ ముందుకు సాగని కారణంగా రాష్ట్రానికి మంజూరు చేసిన జాతీయ రహదారులు పెండింగులోనే ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ఆయా రహదారుల నిర్మాణానికి కేంద్రం రూ.32,283 కోట్లు మంజూరు చేసినట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. భూసేకరణకు కేంద్రం సుమారు రూ.10 వేల కోట్ల వరకు ఖర్చు చేయనుంది. ప్రాంతీయ రింగు రోడ్డు ఉత్తర భాగం 158.65 కిలోమీటర్ల మేర నిర్మించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ ఒక్క మార్గంలోనే 4,760 ఎకరాల భూ సేకరణ చేయాల్సి ఉంది. దీనికి రూ.2,200 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఇందులో రూ.1,100 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. ఆ నిధులు విడుదల చేయాలంటూ జాతీయ రహదారుల శాఖ పలుమార్లు రాష్ట్రానికి లేఖలు రాసింది. ఇందుకోసం గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించినా  విడుదల చేయలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ రూ.500 కోట్లు కేటాయించగా ఆ నిధులు ఎప్పటికి విడుదల అవుతాయన్నది చర్చనీయాంశంగా మారింది. మిగిలిన మార్గాల్లో కొన్నింటిలో భూసేకరణ ప్రక్రియ సింహభాగం పూర్తయినట్లు అధికారులు  చెబుతున్నారు. మరికొన్ని మార్గాల్లో 30 నుంచి 40 శాతం పూర్తయినట్లు సమాచారం.  భూ సేకరణలో జాప్యానికి కారణం ఏమిటన్నది అధికారులకే తెలియాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు