బోధన్‌ కుంభకోణం... త్వరలో అభియోగపత్రం దాఖలు

ఆరేళ్ల సుదీర్ఘ దర్యాప్తు ముగింపు దశకు వచ్చింది. సంచలనం సృషించిన బోధన్‌ వాణిజ్యపన్నుల శాఖ కుంభకోణంపై న్యాయవిచారణకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో సీఐడీ అభియోగపత్రాలు దాఖలు చేయనుంది.

Published : 22 May 2023 04:04 IST

కొలిక్కివచ్చిన దర్యాప్తు
ఈనాడు - హైదరాబాద్‌

ఆరేళ్ల సుదీర్ఘ దర్యాప్తు ముగింపు దశకు వచ్చింది. సంచలనం సృషించిన బోధన్‌ వాణిజ్యపన్నుల శాఖ కుంభకోణంపై న్యాయవిచారణకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో సీఐడీ అభియోగపత్రాలు దాఖలు చేయనుంది. పరారీలో ఉన్న వారంతా అరెస్టు కావడంతో పాటు కీలకమైన సైబర్‌ ఫోరెన్సిక్‌ విశ్లేషణ కూడా పూర్తవడంతో దర్యాప్తు కొలిక్కి వచ్చినట్లయింది. వచ్చే నెల రెండోవారం కల్లా అభియోగపత్రాలు దాఖలు చేయాలని భావిస్తున్నారు.

బోధన్‌ వాణిజ్యపన్నులశాఖ కార్యాలయాన్ని కేంద్రంగా చేసుకొని కొందరు ఉద్యోగులు భారీ కుంభకోణానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. దళారీగా పనిచేసే శివరాజ్‌తో జట్టు కట్టిన కొందరు వాణిజ్యపన్నులశాఖ ఉద్యోగులు నకిలీ చలానాల బాగోతానికి తెరతీశారు. దీనివల్ల గత అయిదేళ్లలో ప్రభుత్వానికి రూ.231 కోట్ల నష్టం జరిగిందని నిర్ధారించారు. బోధన్‌ పరిసరాల్లో ఎక్కువగా బియ్యం మిల్లులు ఉంటాయి. వీరు చెల్లించాల్సిన పన్నులకు  బ్యాంకులో చలానా తీసి, ప్రతిని వాణిజ్యపన్నుశాఖ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. వ్యాపారులు ఈ ప్రక్రియను మధ్యవర్తులకు అప్పగిస్తుంటారు. శివరాజ్‌ అనే దళారీ కొందరు ఉద్యోగులతో కలిసి ఒకటే చలానాను వేర్వేరు సంస్థలు చెల్లించినట్లు చూపించేవాడు. కొద్ది రోజులు ఆగి ఇదే చలానాను నంబరు మార్చి మరో సంస్థ పేరుమీద నమోదు చేయించేవాడు. వాణిజ్యపన్నుల శాఖ డేటాలో రెండు సంస్థలు పన్ను కట్టినట్లే ఉండేది. కానీ ఖజానాలో మాత్రం ఒక సంస్థకు చెందిన డబ్బు మాత్రమే జమయ్యేది. ఆడిటింగ్‌లో ఇది బయటపడినా బయటకు రాకుండా శివరాజ్‌ ముఠా మాయ చేసింది. 2012 నుంచి యథేచ్ఛగా ఈ కుంభకోణం కొనసాగింది. ఈ కుంభకోణంలో భాగమైన దళారీలు, ప్రభుత్వ ఉద్యోగులు.. ఇలా మొత్తం 17 మందిని ఇప్పటిదాకా అరెస్టుచేశారు.  కుంభకోణంపై 2017లోనే కేసు నమోదుచేసినా వివిధ కారణాలతో దర్యాప్తు మాత్రం ఏళ్ల తరబడి నడిచింది. మహేష్‌ భగవత్‌ సీఐడీ అదనపు డీజీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేసును బయటకు తీశారు. దాంతో అధికారులు మిగతా దర్యాప్తు కూడా పూర్తిచేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు