కరెంటుతో కాసుల పంట

సింగరేణి సంస్థ ప్రధాన వ్యాపారం గనుల నుంచి బొగ్గు తవ్వి థర్మల్‌ విద్యుత్కేంద్రాలు, ఇతర పరిశ్రమలకు అమ్ముకోవడం.

Published : 22 May 2023 05:25 IST

1,200 మె.వా. ప్లాంట్లతో సింగరేణికి లాభాలు
800 మె.వా. సామర్థ్యంతో కొత్త విద్యుత్కేంద్రం
రూ.6,500 కోట్ల వ్యయం.. ‘భెల్‌’కు టెండరు ఖరారు
విద్యుత్‌ కొనుగోలుకు డిస్కంల అంగీకారం
మరో 800 మె.వా. ప్లాంటు నిర్మాణానికీ కసరత్తు

ఈనాడు, హైదరాబాద్‌: సింగరేణి సంస్థ ప్రధాన వ్యాపారం గనుల నుంచి బొగ్గు తవ్వి థర్మల్‌ విద్యుత్కేంద్రాలు, ఇతర పరిశ్రమలకు అమ్ముకోవడం. దీని కంటే విద్యుదుత్పత్తి ద్వారా అధిక లాభాలు వస్తుండడంతో సంస్థ ఆ దిశగా దృష్టి సారిస్తోంది. సొంత బొగ్గు అందుబాటులో ఉండడంతో ప్రయోగాత్మకంగా తొలుత మంచిర్యాల జిల్లా జైపూర్‌లో ఒక్కోటి 600 మెగావాట్ల చొప్పున రెండు (మొత్తం 1200 మె.వా.) విద్యుత్కేంద్రాలను నిర్మించింది. రాష్ట్రంలో రోజువారీ విద్యుత్‌ గరిష్ఠ డిమాండు 15,485 మెగావాట్లకు చేరడంతో ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌లో కరెంటు కొంటోంది. ఈ నేపథ్యంలోనే సింగరేణి విద్యుత్కేంద్రాల్లో 90 శాతానికి పైగా కరెంటు ఉత్పత్తి చేస్తూ రాష్ట్రానికి సరఫరా చేస్తోంది. దీనిపై ఏటా రూ.500 కోట్లకు పైగా లాభాలొస్తున్నాయని సంస్థ వర్గాలు తెలిపాయి. ఉదాహరణకు 2022-23లో బొగ్గు వ్యాపార టర్నోవర్‌ రూ.28,459 కోట్లుంటే సుమారు రూ.500 కోట్ల లాభాలొస్తాయని అంచనా వేయగా, అదే సమయంలో రూ.4,371 కోట్ల విలువైన విద్యుత్తు విక్రయంపై రూ.500 కోట్లు మిగలనున్నాయి. దీంతో విద్యుత్తు వ్యాపారం మరింత లాభదాయకమని సింగరేణి అటువైపు మొగ్గు చూపిస్తోంది. జైపూర్‌లో కొత్తగా తలపెట్టిన 800 మె.వా. విద్యుదుత్పత్తి ప్లాంటు నిర్మాణ టెండరు రూ.6,500 కోట్లతో కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘భెల్‌’కు ఖరారైంది. ఈ విద్యుత్తు కొనుగోలుకు డిస్కంల నుంచి సూత్రప్రాయ ఆమోదం సైతం లభించింది. ఇక్కడే మరో 800 మె.వా. ప్లాంటు ఏర్పాటుకు కూడా సింగరేణి కసరత్తులు ప్రారంభించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే భూమి ఇప్పటికే అందుబాటులో ఉన్నందున మొత్తం 1,600 మె.వా. ప్లాంట్లను నాలుగైదేళ్లలోగా పూర్తిచేయాలనేది సంస్థ ప్రణాళిక. సౌరవిద్యుత్‌ ప్లాంట్లను సైతం 550 మెగావాట్లతో నెలకొల్పుతున్నందున రానున్న అయిదేళ్లలో మొత్తం సింగరేణి విద్యుదుత్పత్తి సామర్థ్యం 3,350 మెగావాట్లకు చేరనుంది.


రివర్స్‌ బిడ్డింగ్‌లో ముందుకొచ్చిన ‘భెల్‌’

జైపూర్‌లో 800 మె.వా. కొత్త విద్యుత్కేంద్రం నిర్మాణ కాంట్రాక్టు ‘భెల్‌’కు దక్కనుంది. తొలి టెండర్‌లో ‘భెల్‌’ కన్నా తక్కువ ధర కోట్‌ చేసి ఎల్‌ అండ్‌ టీ కంపెనీ అర్హత పొందినా రివర్స్‌ బిడ్డింగ్‌లో భెల్‌ మళ్లీ ముందుకొచ్చింది. త్వరలో భెల్‌కు కాంట్రాక్టును అప్పగించి ఒప్పందం చేసుకునేందుకు సింగరేణి కసరత్తు చేస్తోంది. జైపూర్‌లో 1,200 మె.వా. ప్లాంట్ల నిర్మాణ సమయంలో రెండు వేల ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి అప్పగించింది. ఈ భూమిలో ఇంకా 600 ఎకరాలు ఖాళీగా ఉంది. 800 మె.వా. విద్యుత్కేంద్రాలకు 200 ఎకరాల చొప్పున భూమి సరిపోతుందని తేల్చారు. దీంతో జైపూర్‌లోనే కొత్త ప్లాంట్లను నిర్మించాలన్నది ప్రణాళిక.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని