జేపీఎస్‌లకు తీపికబురు

తెలంగాణలోని జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్‌)కు తీపికబురు.. వారి సర్వీసును క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు.

Published : 23 May 2023 05:29 IST

క్రమబద్ధీకరణకు సీఎం కేసీఆర్‌ నిర్ణయం
పనితీరే ప్రామాణికం.. మదింపునకు జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీలు
ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ
ప్రక్రియ చేపట్టాలని ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలోని జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్‌)కు తీపికబురు.. వారి సర్వీసును క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు విధివిధానాలను ఖరారు చేయాలని, పనితీరును మదింపు చేసేందుకు జిల్లా, రాష్ట్రస్థాయిలో కమిటీలు వేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియాను సోమవారం ఆదేశించారు. దీంతోపాటు ఖాళీగా ఉన్న స్థానాల్లో కొత్త జేపీఎస్‌లను నియమించాలని ఆదేశించారు. 2019లో 9,350 మంది జేపీఎస్‌లను ప్రభుత్వం జిల్లాస్థాయి ఎంపిక కమిటీ (డీఎస్సీ)ల ద్వారా రాతపరీక్ష నిర్వహించి ఎంపిక చేసి, ప్రతిభ ఆధారంగా నియామకాలు జరిపింది. ముందుగా వారికి మూడేళ్ల శిక్షణ కాలాన్ని నిర్ణయించింది. అనంతరం దాన్ని మరో ఏడాది పెంచింది.
గత నెల 28తో ఆ గడువు ముగియగా.. తమను క్రమబద్ధీకరించాలనే డిమాండ్‌తో వారు సమ్మెకు వెళ్లారు. 16 రోజుల సమ్మె అనంతరం విధుల్లో చేరారు. ఈ నేపథ్యంలో సీఎం వారి అంశంపై సమీక్ష నిర్వహించి, క్రమబద్ధీకరణ ప్రక్రియకు ఆమోదం తెలిపారు. సమీక్షా సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సీఎం ప్రధాన సలహాదారు సోమేశ్‌కుమార్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, సీఎస్‌ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.

జేపీఎస్‌ల క్రమబద్ధీకరణకు వారి పనితీరును ప్రామాణికంగా తీసుకోనున్నారు. పనితీరుపై మదింపు కోసం జిల్లాస్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేయాలని నిర్ణయించారు. అందులో జిల్లా కలెక్టర్‌తో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌, జిల్లా అటవీ అధికారి, జిల్లా ఎస్పీ/డీసీపీ సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర కార్యదర్శి లేదా శాఖాధిపతి పరిశీలకుడిగా వ్యవహరిస్తారు.

మదింపు అనంతరం జేపీఎస్‌ల పనితీరుపై జిల్లాస్థాయి కమిటీ.. ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన గల రాష్ట్రస్థాయి కమిటీకి నివేదిస్తుంది. ఈ కమిటీ ఎవరెవరిని క్రమబద్ధీకరించాలనే దానిపై తుది సిఫార్సులతో సీఎస్‌కు నివేదిక పంపుతుంది.  

మరోవైపు రాష్ట్రంలోని కొన్ని గ్రామపంచాయతీల్లో తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులను జిల్లా కలెక్టర్లు నియమించారు. ఈ స్థానాల్లో కూడా కొత్త జేపీఎస్‌లను భర్తీ చేయాలని, క్రమబద్ధీకరణ పూర్తయిన తర్వాత ఈ ప్రక్రియను చేపట్టాలని సీఎం ఆదేశించారు.

జేపీఎస్‌ల క్రమబద్ధీకరణకు విధివిధానాలు, మార్గదర్శకాలను త్వరలోనే జారీ చేస్తామని  మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. జేపీఎస్‌ల క్రమబద్ధీకరణకు ఆదేశాలు ఇచ్చిన సీఎంకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం సమీక్ష అనంతరం ఆయన సీఎస్‌ శాంతికుమారి, తమ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియాతో సమావేశమై ఈ అంశంపై చర్చించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు