ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు

ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు మరోవైపు మిషన్‌ భగీరథను పూర్తి చేయడం ద్వారా దేశానికే కాకుండా, ప్రపంచానికి కూడా తెలంగాణ నీటి పాఠాలు చెప్పిందంటే అతిశయోక్తి కాదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Updated : 23 May 2023 06:56 IST

భారత్‌ ధాన్యాగారంగా రాష్ట్రం
సీఎం కేసీఆర్‌ అచంచల నిబద్ధతకు నిదర్శనం.. కాళేశ్వరం
అమెరికాలో ప్రపంచ పర్యావరణ, జల వనరుల సదస్సులో కేటీఆర్‌
కాళేశ్వరానికి ‘ఎండ్యూరింగ్‌  సింబల్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌  ప్రోగ్రెస్‌’ పురస్కారం

ఈనాడు, హైదరాబాద్‌: ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు మరోవైపు మిషన్‌ భగీరథను పూర్తి చేయడం ద్వారా దేశానికే కాకుండా, ప్రపంచానికి కూడా తెలంగాణ నీటి పాఠాలు చెప్పిందంటే అతిశయోక్తి కాదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రం అనేక రంగాల్లో అభివృద్ధి పథంలో నడిచేందుకు అవకాశం దొరికిందన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు రెండో హరిత విప్లవం కొనసాగుతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో శ్వేత, గులాబీ, నీలి, నూనె గింజల తాలూకు పసుపు విప్లవాలు కనిపిస్తున్నాయని తెలిపారు. భారీ ప్రాజెక్టుల నిర్మాణాలతో అనేక అద్భుతమైన మార్పులు జరిగాయని.. ఇప్పుడు భారతదేశ ధాన్యాగారంగా తెలంగాణ మారిందన్నారు. రాష్ట్రంలో 90 లక్షల ఎకరాల్లో రెండు పంటలు సాగవుతున్నాయని, సాగుభూమి 119 శాతం పెరిగిందని.. ధాన్యం ఉత్పత్తి మూడు రెట్లు పెరిగిందని కేటీఆర్‌ వివరించారు. రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం 25 లక్షల ఎకరాల నుంచి 97 లక్షల ఎకరాలకు పెరిగిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రం ఆలోచించని విధంగా తొలిసారిగా ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందించాలన్న బృహత్‌ సంకల్పంతో చేపట్టిన మిషన్‌ భగీరథ ప్రాజెక్టును కూడా స్వల్ప కాలంలో పూర్తి చేశామని చెప్పారు. దేశంలోనే తొలిసారి 100 శాతం ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు.

దశాబ్దాల ఫ్లోరైడ్‌ సమస్య నుంచి తెలంగాణకు శాశ్వతంగా విముక్తి లభించిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో అత్యధిక తలసరి ఆదాయం సాధించిందన్నారు. అమెరికాలోని నెవాడా రాష్ట్రంలోని హెండర్సన్‌ నగరంలో ‘అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ సివిల్‌ ఇంజనీర్స్‌’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ప్రపంచ పర్యావరణ, జల వనరుల సదస్సు’లో మంత్రి కేటీఆర్‌ సోమవారం ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సదస్సులో ప్రపంచ ఇంజినీరింగ్‌ నిపుణులు, సామాజికవేత్తలు, పరిశ్రమవర్గాలకు చెందినవారు పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు రాష్ట్రంలో నీటి కరవు.. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత అతి తక్కువ సమయంలో కాళేశ్వరం, మిషన్‌ భగీరథ ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేసిన విధానాన్ని దృశ్యరూపంలో కేటీఆర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ‘‘తెలంగాణలో చేపట్టనున్న సాగునీటి ప్రాజెక్టులు, మిషన్‌ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల గురించి 2017లో ఇదే ప్రపంచ జలవనరుల సదస్సులో వివరించే అవకాశం దక్కింది. ఆ రోజు తెలంగాణ ప్రభుత్వ ప్రణాళికలపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన సమావేశం.. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు పురస్కారం అందించడం రాష్ట్రానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌ మేధస్సుకు దక్కిన ఒక అపూర్వ గుర్తింపు. ఒక నాయకుడు తలుచుకుంటే సాధించేగలిగే ఒక గొప్ప విజయానికి నిదర్శనం కాళేశ్వరం ప్రాజెక్టు. తొమ్మిదేళ్లలో రాష్ట్రం రూపాంతరం చెందిన తీరు అద్భుతం.

రికార్డు సమయంలో పూర్తి

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందు.. సాగునీరు అందక కరవుకు నిలయంగా ఉండేది. రాష్ట్రంలోని వేల చెరువులు నిండక, సాగునీరు లేక, భూగర్భ జలాలు లేక.. తాగునీటికి సైతం ఇబ్బందులు ఎదురయ్యేవి. వ్యవసాయ రంగం సంక్షోభంలో నిలిచింది. రైతుల ఆత్మహత్యలు, వలసలు ఒకప్పుడు నిత్యకృత్యంగా ఉండేవి. 55 శాతం జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడి తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం అత్యవసరమనే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గుర్తించారు. నిరంతర కృషితో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర సమస్యలు, సంక్షోభాలు, ప్రజల ఆశలు, కలలపై సంపూర్ణమైన అవగాహన ఉన్న ఆయన.. వాటిని సాధించేందుకు అవసరమైన పక్కా ప్రణాళికను రూపొందించారు. వాటికి కార్యరూపం ఇచ్చేందుకు కఠిన శ్రమతో కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన మదిలోంచి పుట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేశాం.

13 జిల్లాల్లో సుమారు 500 కిలోమీటర్ల మేర ఈ ప్రాజెక్టు విస్తరించింది. 1800 కిలోమీటర్ల మేర కాల్వల నిర్మాణం జరిగింది. 22 పంపుహౌస్‌లను నిర్మించారు. ఇందులో ఉపయోగించిన బాహుబలి లాంటి పంపు 139 మెగావాట్ల కెపాసిటీని ఉపయోగించుకుంటుంది. నీటి నిల్వ కోసం 20 రిజర్వాయర్లను నిర్మించాం. 50 టీఎంసీలతో మల్లన్నసాగర్‌ లాంటి అతి పెద్ద రిజర్వాయర్‌ నిర్మించాం. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 240 టీఎంసీల నీటిని సాగు, తాగు నీటి అవసరాలకు, పారిశ్రామిక అవసరాల కోసం వాడుకునే అవకాశం ఉంది’’ అని  కేటీఆర్‌ వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ‘ఎండ్యూరింగ్‌ సింబల్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ ప్రోగ్రెస్‌’ పురస్కారాన్ని ప్రకటించగా.. అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ సివిల్‌ ఇంజినీర్స్‌ ప్రెసిడెంట్‌ మరియా సి లెహ్‌మన్‌ చేతుల మీదుగా దాన్ని మంత్రి కేటీఆర్‌ స్వీకరించారు.


ఏ కలా అసాధ్యం కాదు..

-మంత్రి కేటీఆర్‌

క నాయకుడి అచంచలమైన నిబద్ధతకు కాళేశ్వరం ప్రాజెక్టు నిదర్శనం. ఒక నదిని ఎత్తిపోసి, లక్షల మంది జీవితాల్లో వెలుగు నింపి జీవనోపాధి కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. రాష్ట్ర సాగునీటి ప్రగతి ప్రస్థానం, ఇంజినీరింగ్‌ నైపుణ్యం, దాని ద్వారా కలిగిన మార్పులు ఈరోజు ప్రపంచానికి, సివిల్‌ ఇంజనీరింగ్‌ రంగంలో ఆదర్శంగా నిలుస్తోందంటే అతిశయోక్తి కాదు. భవిష్యత్తు సవాళ్లను బలంగా ఎదుర్కోవడంలో, ప్రజల జీవితాల్లో మార్పులు తేవడంలో, ఏ కల కూడా అసాధ్యం కాదని నిరూపించడానికి కాళేశ్వరం ప్రాజెక్టు అనుభవాలు గొప్ప ఉదాహరణలుగా నిలుస్తాయని బలంగా నమ్ముతున్నాను.  


ఇంజినీరింగ్‌ అద్భుతం..

- మంత్రి కేటీఆర్‌

కాళేశ్వరం కేవలం సాగునీటి ప్రాజెక్టు మాత్రమే కాదు.. ఇదొక ఇంజినీరింగ్‌ అద్భుతం. సముద్ర మట్టానికి 90 మీటర్ల ఎత్తున ఉన్న నీటిని 618 మీటర్ల స్థాయికి ఎత్తిపోతల ద్వారా తీసుకుపోయి.. వివిధ ప్రాజెక్టులు నింపడం ప్రపంచ సాగునీటి చరిత్రలోనే ఒక అద్భుతంగా నిలిచిపోతుంది. ఈ ప్రాజెక్టు కోసం తరలించిన మట్టి ద్వారా 101 గిజా పిరమిడ్లను నిర్మించవచ్చు. ఈ ప్రాజెక్టులో ఉపయోగించిన స్టీల్‌ ద్వారా 66 ఈఫిల్‌ టవర్ల నిర్మాణం చేయవచ్చు. ఈ ప్రాజెక్టులో ఉపయోగించిన కాంక్రీట్‌ ద్వారా 53 బుర్జ్‌ ఖలీఫాలు కట్టవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు