రైతు గోడు ఆలకించేదెవరు!

అకాల వర్షాలకు తోడు ధాన్యం కొనుగోళ్లు- మిల్లులకు తరలింపులో జాప్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో సమస్యలు రైతులను వేధిస్తున్నాయి.

Published : 23 May 2023 04:21 IST

మహబూబాబాద్‌ జిల్లాలో ధాన్యానికి నిప్పంటించి అన్నదాతల నిరసన
మొక్కజొన్నల కొనుగోళ్లలో జాప్యంపై జగిత్యాల జిల్లా రాయికల్‌లో ధర్నా
తూకం వేసిన ధాన్యం తడవడంతో రైతు ఆత్మహత్యాయత్నం

నెల్లికుదురు, రాయికల్‌, కోరుట్ల గ్రామీణం, న్యూస్‌టుడే- ఈనాడు, హైదరాబాద్‌: అకాల వర్షాలకు తోడు ధాన్యం కొనుగోళ్లు- మిల్లులకు తరలింపులో జాప్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో సమస్యలు రైతులను వేధిస్తున్నాయి. ఇబ్బందులు తీవ్రమవుతుండడంతో అన్నదాతలు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండలం నర్సింహులగూడెం గ్రామ రైతులు సోమవారం ఆందోళన నిర్వహించారు. 5 బస్తాల ధాన్యాన్ని నెల్లికుదురు-మహబూబాబాద్‌ ప్రధాన రహదారికిపైకి తీసుకొచ్చి దహనం చేసి రాస్తారోకో చేశారు. రహదారిపై రాకపోకలను అడ్డుకున్నారు. శ్రీరామగిరి పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఈ గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 48 మంది రైతుల నుంచి సుమారు 5,900 బస్తాల ధాన్యం కొనుగోలు చేశారు. వాటిలో 1,837 బస్తాల ధాన్యాన్ని మాత్రమే మిల్లులకు తరలించారు. సుమారు 4 వేల ధాన్యం బస్తాలు వారం రోజులుగా కేంద్రంలోనే ఉండిపోయాయి. మరో 5 వేల ధాన్యం బస్తాలకు కాంటాలు నిర్వహించాల్సి ఉంది. కొనుగోలు కేంద్రం వద్ద విద్యుత్తు సౌకర్యం లేకపోవడంతో ధాన్యం బస్తాలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తాగునీటి వసతి లేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. నెల్లికుదురు ఎస్సై క్రాంతికిరణ్‌, పీఏసీఎస్‌ అధ్యక్షుడు గుండా వెంకన్నలు రైతులతో మాట్లాడి.. ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు ఫోన్‌లో ఈ సమస్యలను వివరించగా.. పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని ఎస్సై ద్వారా రైతులకు తెలపడంతో వారు ఆందోళన విరమించారు.

రాయికల్‌-ఇటిక్యాల రహదారిపై వంటావార్పు

మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో తూకంలో తీవ్ర జాప్యంపై జగిత్యాల జిల్లా రాయికల్‌లో రైతులు ధర్నా నిర్వహించారు. రాయికల్‌-ఇటిక్యాల రహదారిపై సోమవారం వంటావార్పు చేసి నిరసన తెలిపారు. కేంద్రానికి తెచ్చిన మక్కలను తూకం వేయకపోవడంతో అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. ఏ గ్రేడు మక్కలను బీ గ్రేడుగా చూపిస్తూ ధరలో మోసం చేస్తున్నారని, హమాలీ కోసం రైతుల నుంచి బస్తాకు అదనంగా రూ.34 వసూలు చేస్తున్నారని ఆరోపించారు. తహసీల్దారు అబ్దుల్‌ ఖయ్యూం, ఎస్సై కిరణ్‌కుమార్‌లు రైతులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు.

జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండల కేంద్రంలో ఆదివారం రాత్రి వర్షం కురిసింది. దీంతో భూషణ్‌రావుపేట కొనుగోలు కేంద్రంలో రైతు గోపిడి మధు ధాన్యం తడిసిపోయాయి. దీన్ని చూసి ఆయన మనస్తాపానికి గురయ్యారు. కొనుగోలు కేంద్రం వద్దే పురుగు మందు తాగేందుకు ప్రయత్నించగా రైతులు వారించారు. వారం రోజుల కిందట ధాన్యం తూకం వేసినా లారీలు రాకపోవడంతో మిల్లుకు చేరలేదని, ఎన్నిరోజులు పడిగాపులు కాయాలని రైతు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఘటన నేపథ్యంలో స్పందించిన అధికారులు ఈ రైతు ధాన్యాన్ని లారీలో మధ్యాహ్నం మిల్లుకు తరలించారు. ఈ కేంద్రంలో దాదాపు 4 వేలకు పైగా ధాన్యం బస్తాలు తూకం వేసినా లారీలు రాకపోవడంతో మిల్లులకు తరలించడంలో జాప్యం జరుగుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు