60 ఏళ్లు పైబడినవారు ఎంతమంది ఉన్నారు?

గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్‌ఏ)గా పనిచేస్తున్న వారిలో 60 ఏళ్లు పైబడినవారు ఎంతమంది ఉన్నారో భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌(సీసీఎల్‌ఏ) వివరాలు సేకరిస్తోంది.

Published : 23 May 2023 04:21 IST

వీఆర్‌ఏల క్రమబద్ధీకరణలో భాగంగా వివరాల సేకరణ
కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసిన సీసీఎల్‌ఏ

ఈనాడు, హైదరాబాద్‌: గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్‌ఏ)గా పనిచేస్తున్న వారిలో 60 ఏళ్లు పైబడినవారు ఎంతమంది ఉన్నారో భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌(సీసీఎల్‌ఏ) వివరాలు సేకరిస్తోంది. వారసత్వ ఉద్యోగాలు కల్పించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్న నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. వీఆర్‌ఏల క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేయడంలో భాగంగా సమగ్ర వివరాలను కోరుతూ జిల్లా కలెక్టర్లకు సోమవారం సీసీఎల్‌ఏ ఉత్తర్వులు జారీ చేసింది. మూడు రోజుల్లో వివరాలు పంపించాలని ఆదేశించింది. ఇందులో ప్రధానంగా 17 ఏళ్ల వయసు నుంచే పనిచేస్తున్నవారు కూడా ఉన్నారా అనే వివరాలనూ పంపాలని సూచించింది. 17 నుంచి 100 ఏళ్ల వరకు ప్రతి పదేళ్ల మధ్య కేటగిరీలకు సంబంధించిన వివరాలను కోరింది.

విద్యార్హత వివరాలూ నమోదు

వీఆర్‌ఏలు ఇన్నాళ్లూ కనీస విద్యార్హతలు లేకుండా రూ.10,500 గౌరవ వేతనంతో పనిచేస్తూ వచ్చారు. ఇప్పుడు వారిని క్రమబద్ధీకరించేందుకు వీలుగా వారి విద్యార్హత వివరాలను కూడా సేకరిస్తున్నారు. 1 నుంచి 6వ తరగతి వరకు, 7 నుంచి 9వ తరగతి వరకు, 10వ తరగతి, ఇంటర్‌, డిగ్రీ, బీటెక్‌, పీజీ.. ఇలా విద్యార్హతల వారీగా ఎంతమంది ఉన్నారో గుర్తిస్తున్నారు. క్రమబద్ధీకరణ అనంతరం పదోన్నతులు కూడా కల్పించాలని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో విద్యార్హతల వివరాలు నమోదు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ తదితర కేటగిరీలను ప్రత్యేకంగా నమోదు చేయాలని కూడా సీసీఎల్‌ఏ ఆదేశించింది. ఉద్యోగాల భర్తీపై నిషేధం ఉన్న సమయంలో వీఆర్‌ఏ స్థానాలు ఖాళీ అయినచోట నియామకాలు చేపట్టి ఉంటే ఆ వివరాలనూ తప్పనిసరిగా తెలియజేయాలని సూచించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని