సంక్షిప్త వార్తలు (5)

రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణమండలి(ఎస్‌బీటెట్‌) నూతన కార్యదర్శిగా పులయ్య నియమితులయ్యారు. ప్రస్తుతం కార్యదర్శిగా ఉన్న డాక్టర్‌ సి.శ్రీనాథ్‌ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనరేట్‌ కార్యాలయంలో జాయింట్‌ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు.

Updated : 24 May 2023 05:31 IST

ఎస్‌బీటెట్‌ కార్యదర్శిగా పుల్లయ్య

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణమండలి(ఎస్‌బీటెట్‌) నూతన కార్యదర్శిగా పులయ్య నియమితులయ్యారు. ప్రస్తుతం కార్యదర్శిగా ఉన్న డాక్టర్‌ సి.శ్రీనాథ్‌ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనరేట్‌ కార్యాలయంలో జాయింట్‌ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో అక్కడ జేడీగా ఉన్న పుల్లయ్య ఎస్‌బీటెట్‌ కార్యదర్శిగా నియమితులయ్యారు. అయిదేళ్లపాటు కార్యదర్శిగా కొనసాగుతారు. ఈమేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ మంగళవారం జీఓ జారీ చేశారు.


పారా అథ్లెట్‌కు గవర్నర్‌ ఆర్థిక సాయం

ఈనాడు, హైదరాబాద్‌: వర్ధమాన పారా అథ్లెట్‌, షాట్‌పుట్‌, డిస్కస్‌ త్రోలో శిక్షణ పొందుతున్న లోకేశ్వరికి రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై రూ.50 వేల ఆర్థిక సాయాన్ని అందించారు. మంగళవారం రాజ్‌భవన్‌లో సంబంధిత చెక్కును అందజేశారు. అంతర్జాతీయ పోటీల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలనే ఆశయంతో శిక్షణ పొందుతున్న క్రీడాకారిణికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మున్ముందు అవసరమైన సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు.


అమరుల స్మారకం త్వరలో ప్రారంభం: మంత్రి వేముల

ఈనాడు, హైదరాబాద్‌: అమరవీరుల స్మారక కేంద్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరలో ప్రారంభించనున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. నిర్మాణ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. ‘హైదరాబాద్‌ నగరంలో సచివాలయానికి ఎదురుగా అమరవీరుల స్మారక కేంద్రాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. తుది మెరుగులద్దే పనులను త్వరితంగా పూర్తి చేయాలి’ అని అధికారులను ఆదేశించారు. సచివాలయ జంక్షన్‌ అభివృద్ధి పనులను కూడా మంత్రి పరిశీలించారు.


పదోన్నతులకు ట్రెసా వినతి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి నుంచి దిగువ స్థాయి కేడర్‌ పదోన్నతులను వెంటనే పూర్తి చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ను ట్రెసా కోరింది. ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్‌కుమార్‌లతో కూడిన ప్రతినిధుల బృందం మంగళవారం సచివాలయంలో నవీన్‌ మిత్తల్‌తో భేటీ అయింది. పలుసమస్యలను ఆయనకు వివరించారు.


తపాలా సిబ్బందికి కేంద్ర మంత్రి అభినందన

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ తపాలా సర్కిల్‌ హైదరాబాద్‌ రీజియన్‌ సిబ్బందిని కేంద్ర సమాచార, ప్రసారశాఖ సహాయ మంత్రి దేవుసింహ్‌ చౌహాన్‌ ట్విటర్‌లో ప్రశంసించారు. మహిళలకు ఆర్థిక చేయూత అందించే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌’కు సంబంధించి సూర్యాపేట డివిజన్‌ పరిధి వీకే పహాడ్‌ బ్రాంచిలో ఒకేరోజు 118 ఖాతాలు తెరిపించిన పోస్టుమాస్టర్‌ సోనియాను ప్రత్యేకంగా అభినందించారు. 132 ఖాతాలు ప్రారంభించి తెలంగాణలో తొలి ‘సంపూర్ణ మహిళా సమ్మాన్‌ బచత్‌ గ్రామ్‌’గా నిలిచిన గొట్టిపర్తి బ్రాంచ్‌ పోస్టుమాస్టర్‌, సిబ్బంది కృషిని కొనియాడారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ రీజియన్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ పీవీఎస్‌ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌ రీజియన్‌ పరిధిలో మే 20 నాటికి 20,169 మహిళా సమ్మాన్‌ ఖాతాల్ని తెరిచినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 62 తపాలా రీజియన్లలో హైదరాబాద్‌ 3వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని