పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌కు కొత్తరూపు

తెలంగాణలో పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. కొత్తగా సీఈ, సర్కిల్‌, డివిజన్‌, సబ్‌డివిజన్‌ కార్యాలయాలను ఏర్పాటు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు (జీవో నం. 18) జారీ చేసింది.

Published : 24 May 2023 04:27 IST

 అదనంగా 4 సీఈ, 12 సర్కిల్‌, 11 డివిజన్‌, 60 సబ్‌ డివిజన్‌ కార్యాలయాల ఏర్పాటు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. కొత్తగా సీఈ, సర్కిల్‌, డివిజన్‌, సబ్‌డివిజన్‌ కార్యాలయాలను ఏర్పాటు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు (జీవో నం. 18) జారీ చేసింది. మిషన్‌ భగీరథతో పాటు పల్లె ప్రగతి ఇతర కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ పరిధి, కార్యకలాపాలు విస్తరించడంతో సీఎం కేసీఆర్‌ ఈ శాఖను పునర్వ్యవస్థీకరించాలని ఆదేశించారు. దీనికి అనుగుణంగా కొత్తగా నాలుగు చీఫ్‌ ఇంజినీర్‌ కార్యాలయాలు, 12 కొత్త సర్కిళ్లు (అందులో 8 పీఆర్‌, నాలుగు నిఘా, నాణ్యత విభాగానివి), 11 డివిజన్లు (అందులో ఏడు పీఆర్‌, నాలుగు నిఘా, నాణ్యత విభాగానివి), 60 కొత్త సబ్‌ డివిజన్లు (37 పీఆర్‌, 23 నిఘా, నాణ్యత విభాగానివి) మంజూరు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. కొత్త కార్యాలయాలకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న అధికారులకు అధికారాల బదలాయింపుపై ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీ చేసింది. పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా త్వరలో పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ శాఖలో మరో 740 పోస్టుల నియామకాల భర్తీని ప్రభుత్వం చేపట్టనుంది. ఆయా కార్యాలయాల పరిధిపై ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొంది. ఇప్పటికే ప్రభుత్వం వివిధ స్థాయుల్లో ఇంజినీర్లకు పనులు మంజూరు చేసే అధికారం కల్పించింది. డీఈఈకి ఏడాదికి రూ. 5 లక్షలు, ఈఈకి ఏడాదికి రూ. 25 లక్షల వరకు అనుమతి ఇచ్చింది.

సర్కిల్‌ కార్యాలయాలు: మంచిర్యాల, సిద్దిపేట, భువనగిరి, వికారాబాద్‌, పెద్దపల్లి, మహబూబాబాద్‌, వనపర్తి, సూర్యాపేట (పీఆర్‌); నిర్మల్‌, హైదరాబాద్‌, వరంగల్‌, మహబూబ్‌నగర్‌ (నిఘా, నాణ్యత)

కొత్త డివిజన్లు: గజ్వేల్‌, తాండూరు, ఇబ్రహీంపట్నం, హనుమకొండ, భూపాలపల్లి, దేవరకొండ, కోదాడ (పీఆర్‌); కరీంనగర్‌, మేడ్చల్‌, ఖమ్మం, నల్గొండ

ఉద్యోగుల సంబురాలు

పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో కొత్తగా 87 కార్యాలయాల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేయడంపై రాష్ట్ర పంచాయతీరాజ్‌ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులు, ఇంజినీర్లు సంబురాలు నిర్వహించారు. ఈఎన్‌సీ సంజీవరావు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దీని ద్వారా శాఖ పనితీరు మెరుగుపడుతుందని ఆయన పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని