సివిల్స్‌ ఉత్తీర్ణత శాతంలో మహిళలే టాప్‌

దేశంలోనే అత్యున్నతంగా భావించే సివిల్‌ సర్వీసెస్‌కు అబ్బాయిలతో పోల్చుకుంటే అమ్మాయిలు తక్కువ మంది హాజరవుతున్నా.. విజేతల శాతం(సక్సెస్‌ రేట్‌) మాత్రం అతివల్లో ఎక్కువగా ఉంటోంది.

Published : 24 May 2023 04:27 IST

పరీక్ష రాసిన అమ్మాయిల్లో 17.9% ఎంపిక
అబ్బాయిల్లో 6.6 శాతమే..
మూడో ప్రయత్నంలోనే ఎక్కువ మంది నెగ్గేది  
సివిల్స్‌-2020పై యూపీఎస్‌సీ తాజా నివేదిక వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలోనే అత్యున్నతంగా భావించే సివిల్‌ సర్వీసెస్‌కు అబ్బాయిలతో పోల్చుకుంటే అమ్మాయిలు తక్కువ మంది హాజరవుతున్నా.. విజేతల శాతం(సక్సెస్‌ రేట్‌) మాత్రం అతివల్లో ఎక్కువగా ఉంటోంది. అది అబ్బాయిల కంటే మూడు రెట్లు అధికంగా ఉండటం విశేషం. అబ్బాయిల్లో ప్రతి 100 మందికి 6.6 శాతం మంది చివరకు కొలువు సాధించగా.. అమ్మాయిలు ఏకంగా 17.9 శాతం మంది సర్వీస్‌ దక్కించుకుంటున్నారు. సివిల్‌ సర్వీసెస్‌-2020పై యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్‌సీ) తాజాగా నివేదిక విడుదల చేసింది.

ముఖ్యాంశాలు

* సివిల్స్‌-2020 ప్రాథమిక పరీక్షకు 10.40 లక్షల మంది దరఖాస్తు చేసినా రాసింది 4.83 లక్షల మంది మాత్రమే. వీరిలో 10,564(2.2 శాతం) మంది ప్రధాన పరీక్షకు ఎంపికవ్వగా.. 10,343 మంది రాశారు. 2,053 మంది ఇంటర్వ్యూకు ఎంపికై.. 2,049 మంది హాజరయ్యారు. వారిలో 833 మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌ తదితర సర్వీసెస్‌లకు ఎంపికయ్యారు.

* ప్రాథమిక పరీక్షకు తొలిసారిగా హాజరైన వారు 49 శాతం మంది ఉండగా.. వారిలో చివరకు సర్వీస్‌కు ఎంపికైంది మాత్రం 8.40 శాతమే. ఇక రెండు, మూడు, నాలుగోసారి పరీక్షలు రాసిన వారిలో వరుసగా 18.10, 20.5, 18.60 శాతం మంది కొలువులు సాధించారు. అంటే మూడో ప్రయత్నంలో ఎక్కువ మంది ఎంపికవుతున్నారు.

* మొత్తం కొలువులకు ఎంపికైన 833 మందిలో డిగ్రీ విద్యార్హత కలిగిన వారు 650 మంది, పీజీ చదివినవారు 183 మంది ఉన్నారు. మెడికల్‌ సైన్స్‌ అభ్యర్థులు 70 మంది ముఖాముఖికి ఎంపికైతే అందులో 31 మంది విజేతలుగా నిలిచారు. అంటే అత్యధిక సక్సెస్‌ రేట్‌ 44.30 శాతం వీరిదే..

*  కొలువులకు ఎంపికైన వారిలో 641 మంది ఇంజినీరింగ్‌ అభ్యర్థులే. అది 77 శాతంతో సమానం. ఆ తర్వాత ఆర్ట్స్‌ అభ్యర్థులు 193 మంది(23 శాతం) ఉన్నారు.

* మెయిన్‌ పరీక్షలో రాజనీతి శాస్త్రాన్ని అత్యధికంగా 1863 మంది ఐచ్ఛిక సబ్జెక్టుగా ఎంచుకున్నారు. వారిలో 154 మంది(8.3 శాతం) కొలువు సాధించారు. సర్వీస్‌కు ఎక్కువ మంది ఎంపికైందీ ఈ సబ్జెక్టు వారే కావడం విశేషం. రెండు, మూడు స్థానాల్లో సోషియాలజీ(115 మంది), ఆంత్రోపాలజీ 100 మంది ఉన్నారు. అయితే సివిల్స్‌-2019 ప్రధాన పరీక్షలో మాత్రం అత్యధికంగా 1916 మంది జాగ్రఫీని ఎంచుకోగా.. 1662 మందితో రెండో స్థానంలో రాజనీతిశాస్త్రం నిలిచింది. అది ఈసారి ప్రథమ స్థానంలోకి చేరింది.

* తెలుగును ఐచ్ఛిక సబ్జెక్టుగా 36 మంది ఎంపిక చేసుకొని పరీక్ష రాయగా.. వారిలో అయిదుగురు ఉద్యోగం పొందారు. 2019లో 32 మంది రాసినా ఒక్కరూ ఎంపిక కాలేదు.

* సివిల్స్‌ ముఖాముఖికి 2,049 మంది హాజరుకాగా.. వారిలో 200 మంది ప్రాంతీయ భాషల్లో సమాధానాలిచ్చారు. వారిలో అత్యధికంగా 177 మందికి హిందీలోనే ఇంటర్వ్యూ జరిగింది. ఆ తర్వాత మరాఠీలో 13 మంది ఇంటర్వ్యూను ఎదుర్కొన్నారు. ఈసారి తెలుగు నుంచి ఒక్కరూ లేరు. గతసారి ముగ్గురు తెలుగులోనే ముఖాముఖిలో సమాధానాలు చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని