1.50 లక్షల మందికి.. 4.05 లక్షల ఎకరాలు

అటవీ భూముల్ని సాగు చేస్తున్న గిరిజనులకు పోడు పట్టాల పంపిణీపై సీఎం కేసీఆర్‌ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లతో సచివాలయంలో గురువారం సమావేశం నిర్వహించనున్నారు.

Updated : 25 May 2023 06:13 IST

పోడు పట్టాల పంపిణీకి ప్రభుత్వ నిర్ణయం
నేడు కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లతో సీఎం కేసీఆర్‌ సమావేశం

ఈనాడు, హైదరాబాద్‌, ఈనాడు డిజిటల్‌ - మహబూబాబాద్‌: అటవీ భూముల్ని సాగు చేస్తున్న గిరిజనులకు పోడు పట్టాల పంపిణీపై సీఎం కేసీఆర్‌ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లతో సచివాలయంలో గురువారం సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, హరితహారం, అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ తదితర అంశాలపైనా సమీక్షిస్తారు. ప్రధానంగా పోడు పట్టాల పంపిణీని జూన్‌ 24 నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 1,50,012 మంది లబ్ధిదారులకు 4,05,601 ఎకరాల అటవీ భూమిపై పట్టాలు ఇవ్వాలని నిర్ణయించింది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సిద్దిపేట, కరీంనగర్‌, జోగులాంబ-గద్వాల, జనగామ జిల్లాలకు ఈ పంపిణీలో చోటు దక్కలేదు.

గిరిజనులకు మాత్రమే!

అటవీ హక్కుల చట్టం-2006 కింద రాష్ట్రవ్యాప్తంగా పోడు భూములపై హక్కుల కోసం 4,14,353 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా 13.18 లక్షల ఎకరాల అటవీ భూములపై హక్కులు కావాలని కోరుకున్నారు. దరఖాస్తుదారుల్లో 56.6% మంది గిరిజనులు 8.15 లక్షల ఎకరాలపై, 43.4% మంది గిరిజనేతరులు 5.03 లక్షల ఎకరాలపై హక్కులు కల్పించాలని కోరారు. వీరిలో తొలుత గిరిజనులకు మాత్రమే పట్టాలు ఇవ్వనున్నారు. ఈమేరకు ఏప్రిల్‌ మూడో వారంలోనే 1.35 లక్షల మందికి, 3.9 లక్షల ఎకరాలపై పట్టాలివ్వాలని నిర్ణయించారు. మే 23 నాటికి ఈ సంఖ్య 1,50,012 మందికి, 4,05,601 ఎకరాలకు పెరిగింది. సంబంధిత దస్త్రంపై సీఎం కేసీఆర్‌ ఏప్రిల్‌ ఆఖరి వారంలోనే సంతకం చేశారు.

37.27% కొత్తగూడెం జిల్లాలోనే

పోడు పట్టాలు పంపిణీ చేసే 4,05,601 ఎకరాల్లో ఒక్క భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలోనే 37.27% అంటే 1,51,195 ఎకరాల అటవీ భూములు ఉన్నాయి. ఈ జిల్లా నుంచి ఏకంగా 2,99,478 ఎకరాలకు పట్టాలివ్వాలని దరఖాస్తులు వచ్చాయి. పరిశీలన తర్వాత వాటిలో సగం అర్హమైనవిగా తేల్చారు. పెద్దపల్లి జిల్లాలో 8,292.61 ఎకరాల అటవీ భూములపై పోడుహక్కుల కోసం 4,592 దరఖాస్తులు అందాయి. ఇక్కడ ఎస్టీలు 485 మంది 942.55 ఎకరాల భూమికి హక్కు కల్పించాలని కోరారు. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత తొలుత అర్హమైనవి కేవలం ఎనిమిది దరఖాస్తులుగా తేల్చారు. తుది పరిశీలనలో ముగ్గురే అర్హులని... వారికిచ్చేది ఎకరం భూమే అని తేలింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని