నాలుగు కొత్త ఇంజినీరింగ్‌ కళాశాలలు

జేఎన్‌టీయూ హైదరాబాద్‌ పేద, మధ్య తరగతి విద్యార్థుల కోసం నాలుగు కొత్త ఇంజినీరింగ్‌ కళాశాలలను ప్రారంభించనుంది. ప్రభుత్వం పచ్చజెండా ఊపగానే ఏర్పాటుకు శ్రీకారం చుట్టనుంది.

Published : 26 May 2023 05:15 IST

ప్రభుత్వ ఆమోదం అనంతరం ఏర్పాటు
జేఎన్‌టీయూ ఈసీ సమావేశంలో  ఏకగ్రీవ తీర్మానం

ఈనాడు, హైదరాబాద్‌: జేఎన్‌టీయూ హైదరాబాద్‌ పేద, మధ్య తరగతి విద్యార్థుల కోసం నాలుగు కొత్త ఇంజినీరింగ్‌ కళాశాలలను ప్రారంభించనుంది. ప్రభుత్వం పచ్చజెండా ఊపగానే ఏర్పాటుకు శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు జేఎన్‌టీయూ కార్యనిర్వాహక కమిటీలో గురువారం ప్రతిపాదించిన తీర్మానాన్ని ఈసీ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. రాష్ట్రంలోని మరింత మంది పేద విద్యార్థులకు జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చదువుకునే అవకాశం కల్పించాలని ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. విద్యార్థులకు సౌకర్యంగా ఉండే జిల్లాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ఉన్నత విద్యామండలి నివేదిక ఇచ్చాక, సీఎం ఆదేశాలకు అనుగుణంగా కళాశాలల ఏర్పాటుకు జేఎన్‌టీయూ చర్యలు చేపడుతుంది. ప్రస్తుతం జేఎన్‌టీయూ హైదరాబాద్‌ క్యాంపస్‌తోపాటు సుల్తాన్‌పూర్‌, జగిత్యాల, మంథని, సిరిసిల్ల, వనపర్తిలలో ఇంజినీరింగ్‌ కళాశాలలను నిర్వహిస్తోంది. కొత్తగా ఖమ్మం, మహబూబాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లోనూ ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలలను ప్రారంభించాలంటూ ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్‌ను అభ్యర్థించారు. ఈమేరకు సీఎం సుముఖత వ్యక్తం చేసినట్లు వారు కొద్ది నెలల క్రితం వేర్వేరు సందర్భాల్లో ప్రకటించారు. వీటితోపాటు మరో ప్రాంతంలోనూ కళాశాల ఏర్పాటు కానుంది. కొత్త ఇంజినీరింగ్‌ కళాశాలలకు అవసరమైన బోధన, బోధనేతర సిబ్బంది, మౌలిక సదుపాయాలపై ఈసీ సభ్యులు చర్చించారు. వనపర్తి, సిరిసిల్లలోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, గ్రంథాలయాలు, ప్రయోగశాలల ఏర్పాటుకు నిధులను కేటాయించారు. జేఎన్‌టీయూ క్యాంపస్‌లో కొత్తగా 300 కంప్యూటర్ల కొనుగోలుకు రూ.3 కోట్లు, ఇతర మౌలిక సదుపాయాలకు రూ.50 లక్షల విడుదలకు అంగీకరించారు. సమావేశంలో జేఎన్‌టీయూ వీసీ కట్టా నరసింహారెడ్డి, రిజిస్ట్రార్‌ మంజూర్‌ హుస్సేన్‌, రెక్టార్‌ గోవర్ధన్‌, కార్యనిర్వాహక మండలి సభ్యులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని