T-Fiber: ఇంటింటికీ ఇంటర్నెట్‌ ఇంకెన్నాళ్లు..!

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని మన్‌సాన్‌పల్లి గ్రామంలో టీ-ఫైబర్‌ పైలెట్‌ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇది.

Updated : 26 May 2023 07:38 IST

గ్రామాల్లో పూర్తికాని మౌలిక సదుపాయాలు
ఏడేళ్లవుతున్నా మొదలు కాని బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు
మూలనపడ్డ మహేశ్వరం టీ-ఫైబర్‌ పైలెట్‌ ప్రాజెక్టు

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని మన్‌సాన్‌పల్లి గ్రామంలో టీ-ఫైబర్‌ పైలెట్‌ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇది. ఇంటర్నెట్‌ సహాయంతో నగరంలోని వైద్యులతో టెలీమెడిసిన్‌ ద్వారా రోగులకు వైద్యసేవలు అందించేందుకు 2018లో ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించింది. ఈ సేవలు నెల రోజులే నడిచాయి. అనంతరం ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోయాయి. వైద్యులు ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. అప్పట్లో కొనుగోలు చేసిన మందులు, ఇంజక్షన్లు అలాగే ఉన్నాయి. కొత్తగా కొనుగోలు చేసిన నీటి శుద్ధియంత్రం తెరవనే లేదు. పంచాయతీ అధికారులు కేంద్రానికి తాళం వేశారు.


మహేశ్వరం మండలంలోని తుమ్మలూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో  టీ-ఫైబర్‌ పైలెట్‌ ప్రాజెక్టులో భాగంగా మినీ    సినిమా థియేటర్‌ నిర్మించారు. అన్ని హంగులతో ఏర్పాటైనా అంతర్జాల సేవలు మాత్రం అందుబాటులోకి రాలేదు. నాలుగేళ్లుగా ప్రారంభానికి నోచుకోలేదు. వీడియో కాన్ఫరెన్సు సౌకర్యాలున్నా వినియోగించే పరిస్థితి లేకుండా పోయింది.


డిజిటల్‌ తెలంగాణ లక్ష్యం నీరుగారుతోంది.  టీ-ఫైబర్‌ ప్రాజెక్టులో భాగంగా దాదాపు రూ.3,600 కోట్లతో చేపట్టిన ఇంటింటికీ ఇంటర్నెట్‌, వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్‌ సౌకర్యం కల్పించే పనులు మరుగునపడ్డాయి. రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ప్రభుత్వ కార్యాలయాల అనుసంధానంతోపాటు దాదాపు కోటి కుటుంబాలకు చౌకధరకే బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందించేందుకు టీ-ఫైబర్‌ ప్రాజెక్టును తెలంగాణ ఐటీశాఖ ప్రారంభించి ఏడేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ నెరవేరలేదు. అయిదేళ్ల క్రితం పైలెట్‌ ప్రాజెక్టుగా మహేశ్వరం మండలంలోని నాలుగు గ్రామాల్లో చేపట్టిన కార్యక్రమాలూ నిలిచిపోయాయి. కొన్నిచోట్ల కేబుల్‌ దెబ్బతింటోంది. రాష్ట్రవ్యాప్తంగా 12,751 గ్రామాల్లో పనులు చేపట్టగా ఇప్పటికీ సగానికిపైగా గ్రామాల్లో సాంకేతిక మౌలిక సదుపాయాలు సమకూర్చలేదు. కొన్నిచోట్ల సదుపాయాలు పూర్తయినా బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు ప్రారంభం కాలేదు.


కొరవడిన పర్యవేక్షణ

కేంద్ర ప్రభుత్వ భారత్‌ నెట్‌లో భాగంగా రాష్ట్రంలో ‘ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌’(ఓఎఫ్‌సీ) ఏర్పాటును టీ-ఫైబర్‌ ప్రాజెక్టు కింద రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి జిల్లాల వారీగా మూడు ప్యాకేజీలుగా పనుల్ని విభజించింది. వీటిని ప్రస్తుతం ఎల్‌అండ్‌టీ, స్టెరిలైట్‌, టీసీఐఎల్‌ సంస్థలు నిర్వహిస్తున్నాయి. మిషన్‌ భగీరథ పైపులైన్లతోపాటే కేబుల్‌ వేస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇంటింటికీ 20 ఎంబీపీఎస్‌ సామర్థ్యం కలిగిన ఇంటర్నెట్‌, పాఠశాలలు, కళాశాలలు, టెలీమెడిసిన్‌ వైద్యసేవలకు 1జీబీపీఎస్‌ సామర్థ్యం కలిగిన బ్రాడ్‌బ్యాండ్‌ అందిస్తామని వెల్లడించింది. కొన్ని గ్రామాల్లో కేబుల్‌ వేసినప్పటికీ కనీస మౌలిక సదుపాయాలు, రక్షణ వ్యవస్థలు ఏర్పాటు కాలేదు. కేబుల్‌ తెగినప్పటికీ అంతరాయం లేకుండా అందించేందుకు చేపట్టిన రింగ్‌ కనెక్టివిటీ పనులు పూర్తికాలేదు. ఈ ప్రాజెక్టు పరిస్థితిపై ప్రభుత్వ పెద్దలు, ఐటీశాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడింది. గ్రామాలు, మండలాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రైవేటు ఆపరేటర్ల నుంచి ఇంటర్నెట్‌ సేవలు పొందుతున్నారు. టీ-ఫైబర్‌ నెట్‌వర్క్‌ పరిశీలనకు నానక్‌రామ్‌గూడలో నెట్‌వర్క్‌ ఆపరేటింగ్‌ సెంటర్‌(ఎన్‌వోసీ) పనులు కొనసాగుతూనే ఉన్నాయి.


నెలకే మూలకు

2018లో మహేశ్వరం మండలాన్ని పైలెట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. మహేశ్వరం, మన్‌సాన్‌పల్లి, తుమ్మలూరు, సిరిగిపురం గ్రామ పంచాయతీల్లో పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతోపాటు ఇంటింటికీ ఇంటర్నెట్‌ ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలకు టెలీమెడిసిన్‌ ద్వారా వైద్య సేవలు, ఈ-కామర్స్‌, ఈ-విద్య, ఆన్‌లైన్లో పౌరసేవలు మెరుగ్గా అందుతాయని తెలిపారు. తుమ్మలూరు పంచాయతీ నుంచి నేరుగా జిల్లా కలెక్టర్‌, మంత్రులు, సీఎంకు ఫిర్యాదులు చేసే వ్యవస్థను మంత్రుల చేతులమీదుగా ప్రారంభించారు. కానీ నెల రోజులకే ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోయాయి. ‘కార్యాలయాల్లో బీబీఎన్‌ఎల్‌- టీఫైబర్‌ ఏర్పాటు చేసిన పరికరాలు, కనెక్షన్లు ఉన్నా పనిచేయడం లేదు. 15 రోజులకోసారి అధికారులు పరిశీలించి వెళ్లడం తప్ప ఇంటర్నెట్‌ ఎప్పుడొస్తుందో చెప్పడం లేదు. ప్రస్తుతం ప్రైవేటు బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగిస్తున్నాం’ అని ఒక అధికారి తెలిపారు.

 ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని