అపార ఖనిజ సంపద అన్వేషణ
అత్యాధునిక సాంకేతికత.. అపారమైన మానవ వనరులతో.. ఖనిజ సంపదలో దేశం స్వయంసమృద్ధి లక్ష్యంగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) కొత్త ఒరవడితో ముందుకు సాగుతోందని డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎస్.రాజు తెలిపారు.
ఆత్మనిర్భర్ భారత్ దిశగా జీఎస్‌ఐ తోడ్పాటు
‘ఈనాడు’తో డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎస్.రాజు
ఈనాడు, హైదరాబాద్: అత్యాధునిక సాంకేతికత.. అపారమైన మానవ వనరులతో.. ఖనిజ సంపదలో దేశం స్వయంసమృద్ధి లక్ష్యంగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) కొత్త ఒరవడితో ముందుకు సాగుతోందని డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎస్.రాజు తెలిపారు. దేశంలో మొదటిసారిగా జమ్మూ ప్రాంతంలో లిథియం నిల్వలను గుర్తించి నివేదిక అందజేసినట్లు చెప్పారు. కీలకమైన ఖనిజాలను గుర్తించి దేశాభివృద్ధికి దోహదపడేందుకు జీఎస్‌ఐ కృషి చేస్తోందని వివరించారు. లిథియంతో పాటు రాగి, బంగారం, వజ్ర నిక్షేపాలు, కీలకమైన ఖనిజాలను గుర్తించి దేశ అవసరాలకు ఉపయోపడేలా జీఎస్‌ఐ ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోందన్నారు. మైనింగ్ బ్లాక్‌లను గుర్తించే బాధ్యతను కేంద్రం జీఎస్‌ఐకి అప్పగించిందని.. 400కు పైగా బ్లాక్‌లను గుర్తించి వివరాలను అందించామన్నారు. 170 ఏళ్ల చరిత్ర కలిగిన జీఎస్‌ఐ ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా భూమి లోపలి ఖనిజ వనరులతో పాటు సముద్రంలో నిక్షేపమైన ఖనిజాలను గుర్తించి దేశ అవసరాలకు అండగా నిలుస్తోందని వివరించారు. ‘ఈనాడు’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలను వెల్లడించారు.
లిథియం నిల్వలు..
విద్యుత్ వాహనాల బ్యాటరీలకు కీలకమైన లిథియంను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఈ నేపథ్యంలో దేశంలోనే మొదటిసారిగా జమ్మూ ప్రాంతంలో లిథియం నిల్వలను జీఎస్‌ఐ గుర్తించింది. ఇవి 5.9 మిలియన్ టన్నుల మేర ఉంటాయని అంచనా. పూర్తి వివరాలను జమ్మూ పాలన యంత్రాంగానికి అందజేశాం. లిథియం గనులపై కేంద్రం కూడా దృష్టి సారించింది. ఎంత వెలికి తీయవచ్చనే అంశంపై ఇండియన్ బ్యూరోఆఫ్ మైన్స్ అధ్యయనం చేస్తోంది. త్వరలో ఈ గనుల్లో తవ్వకాలు చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దేశంలో ఇంకా ఎక్కడెక్కడ లిథియం నిల్వలు ఉన్నాయో.. గుర్తించే పనిలో జీఎస్‌ఐ ఉంది. రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో లిథియం నిల్వలను గుర్తించే పరిశోధనలు కొనసాగుతున్నాయి. రాగి నిల్వలు మనవద్ద పూర్తిగా తగ్గిపోయాయి. రాగి, టంగ్‌స్టన్ వంటి ఖనిజాలను గుర్తిస్తున్నాం. గతంలో ధాతువులో 2 శాతం మేర రాగి ఉంటేనే మైనింగ్ చేసేవారు.. ఇప్పుడు 0.4 శాతం ఉన్నా మైనింగ్‌కు అవకాశం ఉండటంతో తక్కువ పరిమాణంతో ఉన్న నిల్వలను గుర్తిస్తున్నాం.
నిక్షేపంగా బంగారం..
బంగారం నిక్షేపాలు ప్రధానంగా కర్ణాటకలో ఉన్నాయి. హట్టి బంగారు నిల్వలపై ఆ రాష్ట్రానికి జీఎస్‌ఐ నివేదికను అందజేసింది. శంకరిగొప్ప, బుడపనపల్లి, కార్వార్ సహా మొత్తం అయిదు బ్లాక్‌ల వివరాలను అందించాం. బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, కేరళ వంటి రాష్ట్రాల్లో కూడా నిల్వలు ఉన్నాయి. అవి అటవీ లేదా నివాస ప్రాంతాల్లో ఉండటం వల్ల వెలికితీయడం అంత సులభం కాదు.
వజ్ర ‘సంపద’
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా వజ్రకరూర్ ప్రాంతంలో వజ్ర నిక్షేపాలకు అవకాశం ఉంది. జీఎస్‌ఐ, హైదరాబాద్‌లోని ఎన్‌జీఆర్‌ఐ సంయుక్తంగా అక్కడ అధ్యయనం చేస్తున్నాయి. వజ్రాల లభ్యతకు అవకాశం ఉన్న కింబర్‌లైట్ పైపులను ప్రాథమికంగా గుర్తించాం. పూర్తిస్థాయి అధ్యయనం జరుగుతోంది.
జోషిమఠ్‌లో అధ్యయనం
జోషిమఠ్‌లో నేల కుంగిన ప్రాంతంలోని ఇళ్లలోని వారికి ప్రత్యామ్నాయంగా సురక్షితమైన ప్రాంతాల్లో ఇళ్లను నిర్మించేందుకు అనువైన స్థలాలను గుర్తించే బాధ్యతను జీఎస్‌ఐకి కేంద్రం అప్పగించింది. ఇప్పటికే ఈ ప్రాంతంలో అధ్యయనం చేసి అయిదు అనువైన ప్రదేశాలను గుర్తించి వివరాలను అందజేశాం.
కొండచరియలపైనా సమాచారం..
వాతావరణ సమాచారం మాదిరిగా కొండచరియలు విరిగిపడే సమాచారాన్ని ముందస్తుగా అందించనున్నాం. 2025 నుంచి జీఎస్‌ఐ ఈ సమాచారాన్ని అందిస్తుంది. హిమాలయ ప్రాంతాలు సహా మొత్తం 17 రాష్ట్రాలకు ఈ సమాచారం అందుబాటులోకి రానుంది. ఈమేరకు అధ్యయనాలు సాగుతున్నాయి.
భూమిలోపల నిక్షేపాలు..
చాలా రాష్ట్రాల్లో భూ ఉపరితలంలో ఉన్న ఖనిజ వనరుల నిల్వలు దాదాపు ఉపయోగించుకోవడం పూర్తి కావస్తోంది. ఈమేరకు భూమి లోపల ఉండే ఖనిజ నిక్షేపాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. 40-50 కిలోమీటర్ల లోతున ఉన్న ఖనిజ వనరులను గుర్తించగలిగే అత్యాధునిక సాంకేతిక ప్రాజెక్టును అమలు చేస్తున్నాం. వీటిని గుర్తించి వినియోగించడం ద్వారా దేశాభివృద్ధికి తోడ్పడేలా కార్యక్రమం అమలవుతోంది. భూమి లోపల రెండు కిలోమీటర్ల వరకు ఉన్న నిక్షేపాలను గుర్తించేందుకు ప్రత్యేక విమానాలను సమకూర్చుకున్నాం.
సాగర గర్భంలోనూ..
జీఎస్‌ఐ వద్ద అత్యాధునిక సాంకేతిక పరికరాలతో ఉండే రత్నాకర్ నౌక ఉంది. రూ.800 కోట్లతో ఈ నౌకను కేంద్రం సమకూర్చింది. ఈ నౌక తూర్పు, పశ్చిమ తీర ప్రాంతాల్లోని సముద్రంలో ఉండే ఖనిజ సంపదతో పాటు విలువైన సమాచారాన్ని సేకరిస్తోంది. ప్రధానంగా తూర్పు తీరంలోని అండమాన్ ప్రాంతంలోను.. పశ్చిమతీరంలోను.. పనిచేస్తోంది. సముద్రంలో 2 కిలోమీటర్ల వరకు లభించే ఇల్మెనైట్, మోనజైట్, సిలిమనైట్, జిర్కాన్ సహా మొత్తం 8 ఖనిజ నిక్షేపాలను గుర్తిస్తున్నాం. ఫాస్ఫేట్, నిర్మాణాలకు పనికివచ్చే ఇసుక, లైమ్‌స్టోన్ నిక్షేపాలపైనా అధ్యయనం జరుగుతోంది. సముద్ర భూభాగంలో నిల్వలను గుర్తించడంతో పాటు సముద్రం లోపల భూప్రకంపనలను నమోదు చేస్తున్నాం. దీంతో పాటు దేశ రక్షణకు సంబంధించి కీలక తోడ్పాటు అందిస్తున్నాం.
జియోహెరిటేజ్ సైట్‌లు..
చారిత్రక సంపద గురించి భవిష్యత్ తరాలకు అందించేలా అనేక కార్యక్రమాలు చేపట్టాం. జియోహెరిటేజ్ సైట్‌లను గుర్తించి వాటి చారిత్రక వివరాలను అందుబాటులో ఉంచాం. ఇలాంటివాటిని దేశంలో 90 వరకు గుర్తించాం. ఉదాహరణకు తిరుమలలోని శిలాతోరణం, షిల్లాంగ్ గుహలు వంటివి. వీటితో జియో టూరిజం మ్యాప్‌ను అందుబాటులోకి తెస్తాం. స్థలం గొప్పతనం, చారిత్రక విశేషాలు, అక్కడ ఉన్న సౌకర్యాలు, అక్కడికి చేరుకోవడం ఎలా వంటి అనేక అంశాలు అందులో ఉంటాయి. బద్రీనాథ్, కేదార్‌నాథ్‌ల టన్నెళ్ల ఎలైన్‌మెంట్‌పై బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్‌తో కలిపి జీఎస్‌ఐ పనిచేస్తోంది.
ఈనాడు, హైదరాబాద్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Ambati Rayudu: చివరి మ్యాచ్‌లో రాయుడు మెరుపు షాట్లు.. చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో ముగింపు
-
World News
Japan: ప్రధాని ఇంట్లో ప్రైవేటు పార్టీ.. విమర్శలు రావడంతో కుమారుడిపై వేటు!
-
India News
వీసాల్లో మార్పులు.. అండర్ గ్రాడ్యుయేట్లకు కాదు: యూకే మంత్రి
-
Sports News
Yashasvi Jaiswal: మైదానంలో నా ఆలోచనంతా అలానే ఉంటుంది: యశస్వి జైస్వాల్
-
Crime News
Crime News: బాగా చదివి లాయర్ కావాలనుకుని.. ఉన్మాది చేతిలో కత్తి పోట్లకు బలైపోయింది
-
Movies News
Chinmayi: స్టాలిన్ సార్.. వైరముత్తుపై చర్యలు తీసుకోండి: గాయని చిన్మయి