42 వేల ప్రత్యక్ష ఉద్యోగాలు

రాష్ట్రానికి పెట్టుబడుల లక్ష్యంగా యూకే, అమెరికాల్లో రెండు వారాలపాటు సాగిన పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ పర్యటన ముగిసింది.

Updated : 26 May 2023 05:57 IST

యూకే, అమెరికాల్లో  ముగిసిన కేటీఆర్‌ పర్యటన
రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చిన అంతర్జాతీయ సంస్థలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రానికి పెట్టుబడుల లక్ష్యంగా యూకే, అమెరికాల్లో రెండు వారాలపాటు సాగిన పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ పర్యటన ముగిసింది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. ప్రతిపాదిత పెట్టుబడులతో రాష్ట్రంలో కొత్తగా 42 వేల ప్రత్యక్ష ఉద్యోగాలు లభించనున్నాయని కేటీఆర్‌ కార్యాలయం గురువారం ప్రకటన విడుదల చేసింది. ‘‘మంత్రి కేటీఆర్‌ లండన్‌, న్యూయార్క్‌, వాషింగ్టన్‌ డీసీ, హ్యూస్టన్‌, హేండర్‌సన్‌, బోస్టన్‌లలో పర్యటించి, 80కి పైగా వ్యాపార సమావేశాలకు హాజరయ్యారు. వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు, వ్యాపార విస్తరణకు వార్నర్‌ బ్రదర్స్‌ డిస్కవరీ, మెడ్‌ట్రానిక్‌, స్టేట్‌ స్ట్రీట్‌, వీఎక్స్‌ఐ గ్లోబల్‌ సొల్యూషన్స్‌, లండన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ గ్రూపు, డాజోన్‌, టెక్నిప్‌ ఎఫ్‌ఎంసీ, అలియంట్‌, స్టెమ్‌క్రూజ్‌, మాండీ, జాప్‌కామ్‌ గ్రూప్‌లు ముందుకొచ్చాయి. ఫలితంగా బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమా, ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌, ఐటీ, ఐటీఈఎస్‌, మీడియా, వినోదం, ఏరోస్పేస్‌, రక్షణ, లైఫ్‌ సైన్సెస్‌, మెడికల్‌ డివైజెస్‌, డిజిటల్‌ సొల్యూషన్స్‌, ఇన్నోవేషన్‌, డేటా సెంటర్‌, ఆటోమోటివ్‌, ఈవీ రంగాల్లో కొత్తగా 42 వేల ప్రత్యక్ష ఉద్యోగాలు వస్తాయి.

ప్రతి ప్రత్యక్ష ఉద్యోగంతో మూడు లేదా నాలుగు పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయి. పర్యటనలో భాగంగా లండన్‌లో జరిగిన ‘ఐడియాస్‌ ఫర్‌ ఇండియా’, అమెరికాలోని నెవెడాలో నిర్వహించిన ‘ప్రపంచ పర్యావరణ, నీటివనరుల కాంగ్రెస్‌’ సదస్సుల్లో కేటీఆర్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు ‘ఇంజినీరింగ్‌ పురోగతి, భాగస్వామ్యానికి చిహ్నం’గా గౌరవం లభించింది. దాదాపు 30 కంపెనీలకు చెందిన ఎన్నారై సీఈవోలతో సమావేశమైన కేటీఆర్‌ రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో పెట్టుబడుల అవకాశాలను వివరించారు. దాంతో నల్గొండలో సొనాటా సాఫ్ట్‌వేర్‌, కరీంనగర్‌లో 3ఎం-ఎక్లాట్‌, వరంగల్‌లో రైట్‌సాఫ్ట్‌వేర్‌ సంస్థలు తమ కార్యకలాపాలను విస్తరణకు అంగీకరించాయి. కేటీఆర్‌ ప్రతినిధి బృందంలో ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, సీఆర్‌వో ఆత్మకూరి అమర్‌నాథ్‌రెడ్డి, తెలంగాణ లైఫ్‌సైన్సెస్‌ సీఈవో శక్తి ఎం.నాగప్పన్‌, పెట్టుబడులు, ఎన్నారై వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి ఇ.విష్ణువర్ధన్‌రెడ్డి, ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌, డిజిటల్‌ మీడియా వింగ్‌ డైరెక్టర్‌ కొణతం దిలీప్‌, ఇన్వెస్ట్‌ తెలంగాణ ప్రతినిధి వెంకటశేఖర్‌ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని