ఆర్టీసీకి భారీగా తగ్గిన నష్టాలు

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీకి)కు నష్టాలు గణనీయంగా తగ్గాయి. అయిదేళ్ల గణాంకాలను చూసినా... కిందటేడాది నష్టాలను చూసినా ఇదే స్పష్టమవుతోంది.

Published : 26 May 2023 03:57 IST

ఏడాది కాలంలో రూ.1,986 కోట్ల నుంచి రూ.672 కోట్లకు తగ్గుదల
2022-23 ఆర్థిక సంవత్సర గణాంకాల్లో వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీకి)కు నష్టాలు గణనీయంగా తగ్గాయి. అయిదేళ్ల గణాంకాలను చూసినా... కిందటేడాది నష్టాలను చూసినా ఇదే స్పష్టమవుతోంది. 2018-19లో రూ.928.68 నష్టం రాగా 2022-23లో అది రూ.672.29 కోట్లకు తగ్గింది. 2021-22లో రూ.1,986.58 కోట్ల నష్టం వచ్చింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ, వ్యయాలు, ప్రభుత్వం నుంచి వచ్చిన రీయింబర్స్‌మెంట్‌ లెక్కల మూల్యాంకనం కొద్దిరోజుల క్రితం పూర్తయింది. దాని ప్రకారం నష్టం రూ.672.29 కోట్లు అని తేలింది. ఆర్టీసీలో మూడు జోన్లు, 10 రీజియన్లు ఉన్నాయి. ఏ ఒక్క రీజియన్‌ కూడా లాభాల్ని గడించలేదు. మొత్తం నష్టంలో సగానికిపైగా గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ నుంచే వచ్చింది. రీజియన్లలో అతి తక్కువ నష్టాలతో నల్గొండ తొలి స్థానంలో నిలిచింది. ఈ రీజియన్‌ పరిధిలో 2021-22తో పోలిస్తే 2022-23లో నష్టాలు 95.8 శాతం తగ్గాయి.  రంగారెడ్డి రీజియన్‌లో 84.2 శాతం, ఖమ్మంలో 79.3, మెదక్‌లో 76 శాతం నష్టాలు తగ్గాయి.

*  గత ఆర్థిక సంవత్సరం గణాంకాలను చూసినప్పుడు ఆర్టీసీకి ప్రయాణికుల టికెట్లు, బస్టాండ్లలో వాణిజ్య అద్దెలు, కార్గో వంటి రూపాల్లో వచ్చిన మొత్తం ఆదాయం కంటే ఖర్చు అధికంగా ఉంది. డీజిల్‌ ధరల పెరుగుదలతో ఇంధన ఖర్చు బాగా ఎక్కువైంది. సంస్థ వ్యయంలో ఉద్యోగుల వేతనాలు, గతంలో తీసుకున్న రుణాలకు వాయిదాల చెల్లింపులు, అధికారుల కోసం కొనుగోలు చేసిన కొత్త కార్లు వంటి ఖర్చులు అధికంగా ఉన్నాయి.

2021-22 కంటే నష్టం తగ్గడానికి...

2021-22తో పోలిస్తే నష్టాలు బాగా తగ్గడానికి గల కారణాల్లో భారీగా నడిపిన అదనపు కిలోమీటర్లతో వచ్చిన ఆదాయం ఒకటిగా ఉంది. ప్రభుత్వం నుంచి అంతకుముందు ఏడాది కంటే రాయితీ బస్‌పాసుల రీయింబర్స్‌మెంట్‌ ఎక్కువగా రావడం మరొకటని సమాచారం. ఆర్టీసీ వ్యూహాత్మకంగా వేసిన ఎత్తుగడలతో పరోక్ష బాదుడు వల్ల వచ్చిన అదనపు ఆదాయం, ఉన్నతాధికారులు చేపట్టిన సంస్కరణలు కూడా కొంత ఉపశమనానికి కారణమని తెలుస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు