ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటు అనుమతుల నిలిపివేత

ఖమ్మం పట్టణంలోని లకారం చెరువు మధ్యలో తానా సహకారంతో ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను నిలిపేస్తూ గురువారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Updated : 26 May 2023 05:47 IST

మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: ఖమ్మం పట్టణంలోని లకారం చెరువు మధ్యలో తానా సహకారంతో ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను నిలిపేస్తూ గురువారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతివ్వడాన్ని సవాల్‌ చేస్తూ భారత యాదవ సమితితోపాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు వేశారు. వీటిపై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.సత్యంరెడ్డి, న్యాయవాది చెలికాని వెంకటయాదవ్‌లు వాదనలు వినిపిస్తూ... ‘‘ఎన్టీఆర్‌ను సినిమా నటుడిగా మేమూ అభిమానిస్తున్నాం. ఆయన విగ్రహం ఏర్పాటుపై మాకెలాంటి అభ్యంతరం లేదు. అయితే.. కృష్ణుడి రూపంలో ఏర్పాటు చేస్తేనే యాదవుల మనోభావాలను దెబ్బ తీసినట్లు అవుతుంది. పైగా చెరువు మధ్యలో విగ్రహం ఏర్పాటు చేయడం గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు, ప్రభుత్వం 2016 డిసెంబరులో ఇచ్చిన జీవోకు, వాల్టా చట్టానికి విరుద్ధం’’ అని వివరించారు.

ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ... చెరువు మధ్యలో విగ్రహం ఏర్పాటుకు 2022 జూన్‌ 20న ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, ఇదేమీ ప్రజోపయోగమైన రోడ్డు వంటి ప్రాంతం కాదన్నారు. తానా తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ... ఎన్టీఆర్‌ పలు సినిమాల్లో కృష్ణుడి పాత్ర పోషించి ప్రజల మనసుల్లో ఆ రూపంలోనే నిలిచిపోయారన్నారు. అది కృష్ణుడి విగ్రహం కాదని, ఎన్టీఆర్‌ విగ్రహమేనన్నారు. గత వారం హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో చేతిలో వేణువును, నెమలి పింఛాన్ని, కత్తిని తొలగించి విగ్రహం రూపంలో మార్పులు చేశామన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి గత వారం ఇచ్చిన ఉత్తర్వులను సవరించడానికి నిరాకరించారు. విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని విచారణను జూన్‌ 6కు వాయిదా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని