అమెరికా-భారత్‌ బంధం బలోపేతం

అమెరికా-భారత్‌ సంబంధాల బలోపేతంలో హైదరాబాద్‌లో నిర్మించిన నూతన కాన్సులేట్‌ కార్యాలయం నూతన అధ్యాయాన్ని ఆవిష్కరిస్తుందని భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి పేర్కొన్నారు.

Published : 27 May 2023 05:31 IST

యూఎస్‌ రాయబారి ఎరిక్‌ గార్సెట్టి
కాన్సులేట్‌ కార్యాలయం లాంఛనంగా ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికా-భారత్‌ సంబంధాల బలోపేతంలో హైదరాబాద్‌లో నిర్మించిన నూతన కాన్సులేట్‌ కార్యాలయం నూతన అధ్యాయాన్ని ఆవిష్కరిస్తుందని భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి పేర్కొన్నారు. రాయబారిగా బాధ్యతలు చేపట్టిన తరవాత తొలిసారిగా ఆయన హైదరాబాద్‌కు వచ్చారు. నానక్‌రాంగూడలోని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో నిర్మించిన నూతన కాన్సులేట్‌ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అమెరికా 247వ స్వాతంత్య్ర వేడుకలను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాలకు సేవలను అందించేందుకు ఇక్కడ కాన్సులేట్‌ ఏర్పాటు చేశాం. నూతన భవన నిర్మాణానికి రూ.340 మిలియన్‌ డాలర్లు వెచ్చించాం’ అని చెప్పారు. కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై, కాన్సుల్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌, భారత్‌ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి డాక్టర్‌ ఔసఫ్‌ సయీద్‌ పాల్గొన్నారు. అంతకుముందు కాన్సులేట్‌కు వచ్చిన గవర్నర్‌ తమిళిసైతో ఎరిక్‌, లార్సన్‌లు వివిధ అంశాలపై చర్చించారు.

మోదీ-బైడెన్‌ బంధంపై ప్రపంచం ఆసక్తి

‘అమెరికా-భారత్‌ సంబంధాలను యావత్తు ప్రపంచం ఎంతో ఆసక్తిగా చూస్తోంది. రానున్న నాలుగు నెలల్లో రెండు దేశాల అగ్రనాయకులు మూడుసార్లు ముఖాముఖి కలవనుండటం విశేషం. ఇరు దేశాల సంబంధాల బలోపేతానికి ఇదే సూచిక’ అని భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి అన్నారు. హైదరాబాద్‌ వచ్చిన ఆయన శుక్రవారం టి-హబ్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘అమెరికాకు భారత్‌ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఇటీవల కాలంలో ప్రపంచంలో ఎక్కడా ఏర్పాటు చేయకపోయినా.. అమెరికా తన కాన్సులేట్‌ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో నెలకొల్పడం భారత్‌కు ఇచ్చే ప్రాధాన్యానికి నిదర్శనం. వీసాల కోసం డిమాండు అనూహ్యంగా ఉంది. హైదరాబాద్‌ కాన్సులేట్‌ పరిధిలో వీసా కోసం గతంలో వెయ్యి రోజులపాటు వేచి ఉండాల్సి వచ్చేది. ప్రస్తుతం ఆ వ్యవధిని ఏడాదికి తగ్గించగలిగారు. జూన్‌, జులై, ఆగస్టు నెలల్లో విద్యార్థి వీసా (ఎఫ్‌-1)లకు అధిక ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించాం. ఈ ఏడాదిలో ఒక మిలియన్‌ వీసా దరఖాస్తులను పరిశీలించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని ఎరిక్‌ తెలిపారు.

ఆయన నోట తెలుగు మాట..

‘హైదరాబాద్‌లో ట్రాన్స్‌జెండర్‌ల కోసం ఏర్పాటు చేసిన ఆసుపత్రితోపాటు చౌమొహల్లా ప్యాలెస్‌, టీ-హబ్‌లను సందర్శించాను. 1985 తర్వాత మళ్లీ ఇప్పుడు హైదరాబాద్‌ వచ్చాను. ఈ నగరం అభివృద్ధికి సంకేతంగా ఉంది’ అన్నారు ఎరిక్‌. అమెరికన్‌ అయినా.. మహాకవి శ్రీశ్రీ రాసిన ‘మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది..’ కవితను ఆయన తెలుగులో ప్రస్తావించడం విశేషం. ఈ కవిత మన ఆకాంక్షలను, ఆశయాలను చెబుతోందంటూ ఆయన ఆ కవిత భావాలను ఆంగ్లంలో వివరించారు. తాను హాలీవుడ్‌ నుంచి వచ్చినా ఇక్కడి నాటు... నాటు.. పాట ఆస్కార్‌ను దక్కించుకోవటం ఆనందంగా ఉందని ఎరిక్‌ గార్సెట్టి అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని