పాలిసెట్‌లో 82 శాతం ఉత్తీర్ణత

రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ పరిధిలోని పాలిటెక్నిక్‌ కళాశాలలతోపాటు ఉద్యాన, పశువైద్య, అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో డిప్లొమా సీట్ల భర్తీకి నిర్వహించిన పాలిసెట్‌-2023 ఫలితాల్లో సుమారు 82 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.

Updated : 27 May 2023 06:13 IST

తొలి 5 ర్యాంకర్లలో ముగ్గురు సూర్యాపేట జిల్లా విద్యార్థులు
జూన్‌ 14 నుంచి ప్రవేశాల కౌన్సెలింగ్‌
జులై 15 నుంచి తరగతుల ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ పరిధిలోని పాలిటెక్నిక్‌ కళాశాలలతోపాటు ఉద్యాన, పశువైద్య, అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో డిప్లొమా సీట్ల భర్తీకి నిర్వహించిన పాలిసెట్‌-2023 ఫలితాల్లో సుమారు 82 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంజినీరింగ్‌ డిప్లొమాల్లో ప్రవేశానికి ఎంపీసీ.. ఉద్యాన, పశువైద్య, అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో నాన్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు ఎంబైపీసీగా విభజించి పరీక్ష నిర్వహించారు. ప్రశ్నపత్రం ఒకటే అయినా విద్యార్థులకు రెండు వేర్వేరు ర్యాంకులు కేటాయించారు. మొత్తం 1,05,742 మంది దరఖాస్తు చేసుకోగా.. మే 17వ తేదీన జరిగిన పరీక్షను 98,274 మంది రాశారు. పరీక్ష రాసినవారిలో ఎంపీసీ విభాగంలో 80,358 మంది(81.77 శాతం), ఎంబైపీసీ విభాగంలో 80,752 మంది(82.17 శాతం) కౌన్సెలింగ్‌కు అర్హత సాధించారు. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌, రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి(ఎస్‌బీటెట్‌) కార్యదర్శి, పాలిసెట్‌ కన్వీనర్‌ ఎ.పుల్లయ్య, రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ శ్రీనాథ్‌ తదితరులు శుక్రవారం ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా నవీన్‌ మిత్తల్‌ మాట్లాడుతూ రెండు విభాగాల్లో తొలి అయిదు ర్యాంకర్లలో ముగ్గురు సూర్యాపేట జిల్లా విద్యార్థులు ఉన్నారని తెలిపారు.

ఈ ఏడాది నుంచి ‘పాలిక్వెస్ట్‌’

పాలిటెక్నిక్‌ కోర్సులపై పాఠశాల విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు ఈ ఏడాది నుంచి ‘పాలిక్వెస్ట్‌’ పేరిట కొత్త కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నామని నవీన్‌ మిత్తల్‌ తెలిపారు. అందులో భాగంగా విద్యార్థులు తమకు సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలకు వెళ్లి ప్రయోగశాలలను, ఇతర సౌకర్యాలను చూడొచ్చన్నారు. ఈసారి కౌన్సెలింగ్‌ కేంద్రాల్లో విద్యార్థులకు దరఖాస్తులు నింపడం, ఆన్‌లైన్‌లో పంపడం లాంటి అంశాల్లో సహకారం అందిస్తామని తెలిపారు.

మరో మూడు ప్రభుత్వ కళాశాలలకు అనుమతి

రాష్ట్ర ప్రభుత్వం ఈసారి మణుగూరు, మహేశ్వరం, షాద్‌నగర్‌లలో ప్రభుత్వ కళాశాలల ఏర్పాటుకు అనుమతి ఇచ్చిందని మిత్తల్‌ తెలిపారు. గత ఏడాది వరకు 54 ప్రభుత్వ, 64 ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో మొత్తం 29,690 సీట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కొత్త కళాశాలల్లో సీట్లపై త్వరలో స్పష్టత వస్తుందన్నారు. కార్యక్రమంలో టాస్క్‌ సీఈఓ శ్రీకాంత్‌ సిన్హా, ఎస్‌బీటెట్‌ అదనపు కార్యదర్శి పీవీ రఘు, జాయింట్‌ డైరెక్టర్‌ బి.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.


మెరిసిన రైతు బిడ్డ

కాటారం, న్యూస్‌టుడే: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం గ్రామానికి చెందిన ఆకాశ్‌ పాలిసెట్‌ ఎంబైపీసీ విభాగంలో రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు సాధించి సత్తా చాటాడు. తండ్రి చీర్ల రమేశ్‌, తల్లి రజిత వ్యవసాయం చేస్తూ.. జీవనం సాగిస్తున్నారు. వీరికి ఆకాశ్‌, అక్షిత సంతానం. హనుమకొండలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదివిన ఆకాశ్‌ 10 జీపీఏ సాధించాడు. పాలిసెట్‌లో ఎంబైపీసీ విభాగంలో 120 మార్కులకు 116 సాధించి రాష్ట్రస్థాయిలో తొలి ర్యాంకు కైవసం చేసుకున్నాడు. ‘ప్రతిభను పరీక్షించుకోవడానికే పాలిసెట్‌ రాశా. ప్రత్యేకంగా ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. ఐఐటీలో సీటు సాధించడమే లక్ష్యం’ అని తెలిపాడు.


సివిల్సే లక్ష్యం

సూర్యాపేట (మహాత్మాగాంధీ రోడ్డు), న్యూస్‌టుడే: సూర్యాపేట పట్టణానికి చెందిన సురభి శరణ్య పాలిసెట్‌లో రాణించింది. ఎంపీసీ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఆమె తల్లి కవిత గృహిణి కాగా, తండ్రి భిక్షం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. పాలిసెట్‌లో ఎంపీసీ విభాగంలో రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు రావడం సంతోషంగా ఉందని సురభి శరణ్య తెలిపింది. పదో తరగతిలో 9.8 జీపీఏ వచ్చినట్లు తెలిపింది. ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత ఇంజినీరింగ్‌ చదువుతానని.. ఆ తర్వాత సివిల్స్‌కు సిద్ధమవుతానని వివరించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు