Sangareddy: కట్నం చాల్లేదని పెళ్లి పీటలపై నుంచి పారిపోయిన ప్రేమికుడు

ఓ యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. పెళ్లి కోసం అష్టకష్టాలు పడి పెద్దలను ఒప్పించారు. శుక్రవారం వివాహానికి సిద్ధంచేశారు.

Published : 27 May 2023 07:48 IST

సంగారెడ్డి అర్బన్‌, న్యూస్‌టుడే: ఓ యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. పెళ్లి కోసం అష్టకష్టాలు పడి పెద్దలను ఒప్పించారు. శుక్రవారం వివాహానికి సిద్ధంచేశారు. అంతా సవ్యంగా సాగుతోందని అనుకుంటున్న తరుణంలో కట్నం చాల్లేదని పెళ్లి పీటలపై నుంచి వరుడు ఉడాయించాడు. ఫోన్‌ను స్విచ్ఛాప్‌ చేశాడు. స్థానికులు తెలిపిన ప్రకారం... సంగారెడ్డి జిల్లా మనూరు మండలానికి చెందిన యువతి, కొండాపూర్‌ మండలానికి చెందిన యువకుడు ప్రేమించుకున్నారు. అతనికి తమ కూతురుని ఇవ్వడానికి యువతి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. పైగా ఈ ఏడాది జనవరిలో ఇదే జిల్లా కంగ్టి మండలానికి చెందిన ఓ యువకుడితో అమ్మాయికి నిశ్చితార్థం జరిపించారు. విషయం తెలుసుకున్న ప్రియుడు అతనికి ఫోన్‌ చేసి... తాను యువతిని ప్రేమిస్తున్నానని, వదిలేయాలని బెదిరించాడు. దాంతో అతను పెళ్లికి నిరాకరించాడు. చివరికి ప్రేమికులిద్దరికీ పెళ్లి చేయాలని ఇరు కుటుంబాల వారూ నిర్ణయించారు. శుక్రవారం కొండాపూర్‌ మండలంలోని ఒక గుడిలో పెళ్లికి సర్వం సిద్ధం చేశారు. అనూహ్యంగా రూ.15 లక్షలు కట్నం ఇస్తేనే తాళి కడతానని పెళ్లి కుమారుడు భీష్మించాడు. అంత ఇవ్వలేమని రూ.6 లక్షలు ఇస్తామని యువతి కుటుంబీకులు చెప్పినా వరుడు వినిపించుకోలేదు. అందరి కళ్లుగప్పి పెళ్లి పీటలపై నుంచే పరారయ్యాడు. అతని కోసం ఎంత వెతికినా, ఫోన్‌ చేసినా ఫలితం లేకపోవడంతో బాధిత వధువు కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని