నేడు తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ కాలపట్టిక ఖరారు

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి శనివారం కౌన్సెలింగ్‌ కాలపట్టిక(టైం టేబుల్‌) ఖరారు కానుంది.

Updated : 27 May 2023 06:03 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి శనివారం కౌన్సెలింగ్‌ కాలపట్టిక(టైం టేబుల్‌) ఖరారు కానుంది. ఎంసెట్‌ ప్రవేశాల కమిటీ సమావేశం శనివారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరగనుంది. ఆ సందర్భంగా ఛైర్మన్‌ లింబాద్రి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌, ఇతర సభ్యులు కౌన్సెలింగ్‌ తేదీలను ఖరారు చేస్తారు. డిగ్రీలో ప్రవేశాలకు ‘దోస్త్‌’ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కొద్ది రోజుల క్రితమే ప్రారంభం కాగా.. జూన్‌ 16వ తేదీన తొలి విడత సీట్లను కేటాయిస్తారు. మొత్తానికి ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ జూన్‌ 3 లేదా 4వ వారంలో మొదలయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

జూన్‌ 4వ తేదీన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ జరగనుంది. జూన్‌ 18న ఫలితాలు విడుదలవుతాయి. ఆ మరుసటి రోజు నుంచి ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలతోపాటు ఇతర కేంద్ర ప్రభుత్వ సాంకేతిక విద్యాసంస్థల్లో ఉమ్మడి ప్రవేశానికి జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ(జోసా) కౌన్సెలింగ్‌ నిర్వహిస్తుంది. అయిదు లేదా ఆరు రౌండ్లు ముగియడానికి 35 రోజుల సమయం పడుతుంది. అంటే జులై 25వ తేదీ నాటికి చివరి విడత ముగుస్తుంది. ఆ తర్వాత కూడా ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో సీట్లు ఖాళీ ఉంటే వాటి భర్తీకి సెంట్రల్‌ సీట్‌ అలకేషన్‌ బోర్డు(సీశాబ్‌) రెండు విడతల ప్రత్యేక కౌన్సెలింగ్‌ జరుపుతారు. అందుకు మరో అయిదారు రోజులు పడుతుంది. మొత్తానికి జులై నెలాఖరు అవుతుంది. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో సీట్లు వచ్చినవారు వాటిల్లో చేరతారు. ఆ వెంటనే ఎంసెట్‌ చివరి విడత జరిపితే రాష్ట్ర కళాశాలల్లో ఖాళీ అయిన సీట్లను భర్తీ చేసుకోవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు